Vadhandhi Review: రివ్యూ: వదంతి: ది ఫాబెల్‌ ఆఫ్‌ వేలోని

ఎస్‌.జె.సూర్య (SJ Suryah) కీలక పాత్రలో నటించిన క్రైమ్‌ థ్రిల్లర్‌ వెబ్‌సిరీస్‌ వదంతి: ది ఫాబెల్‌ ఆఫ్‌ వెలోని (Vadhandhi) ఎలా ఉందంటే?

Updated : 05 Dec 2022 16:30 IST

వెబ్‌సిరీస్‌: వదంతి: ది ఫాబెల్‌ ఆఫ్‌ వేలొని (Vadhandhi review); నటీనటులు: ఎస్‌.జె.సూర్య (SJ Suryah), సంజనా, లైలా, నాజర్‌, వివేక్‌ ప్రసన్న, హరీష్‌ పేరడి, స్మృతి వెంకట్‌, కుమారన్‌ త్యాగరాజన్‌; సంగీతం: సిమన్స్‌ కె కింగ్‌; సినిమాటోగ్రఫీ: శరవణన్‌ రామస్వామి; ఎడిటింగ్‌: రిచర్డ్‌ కెవిన్‌ ఎ; నిర్మాతలు: పుష్కర్‌ అండ్‌ గాయత్రి; దర్శకత్వం: ఆండ్రూ లూసిస్‌; స్ట్రీమింగ్‌ వేదిక: అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో

ఒకప్పుడు డిటెక్టివ్‌, క్రైమ్‌ సస్పెన్స్‌ నవలలు బాగా చదివేవారు. ఇప్పుడు బాగా చూస్తున్నారు. అందుకు కారణం ఓటీటీ. థియేటర్‌లో ఒకే జానర్‌లో వరుస చిత్రాలు రావడానికి ఆస్కారం తక్కువ. కానీ, ఓటీటీల్లో వివిధ భాషల్లో క్రైమ్‌ థ్రిల్లర్‌లు అలరిస్తున్నాయి. అంతేకాదు, తెలుగు భాషలోనూ డబ్‌ అయి స్ట్రీమింగ్‌ అవుతున్నాయి. అలా.. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన వెబ్‌సిరీస్‌ ‘వదంతి’. దర్శకుడు, నటుడు ఎస్‌.జె.సూర్య (SJ Suryah) ఇందులో కీలక పాత్రలో నటించారు. మరి ఈ సిరీస్‌ కథేంటి? పోలీస్‌ ఆఫీసర్‌ అయిన ఎస్‌.జె.సూర్య టేకప్‌ చేసిన కేసు ఏంటి?(Vadhandhi review)

కథేంటంటే: కన్యాకుమారి శివార్లలో సినిమా షూటింగ్‌ జరుగుతుండగా, ఓ యువతి మృతదేహాన్ని కనుగొంటారు. సినిమాలో నటించే హీరోయిన్‌ను హత్య చేశారని వదంతి వ్యాప్తి అవుతుంది. అయితే, హత్యకు గురైన యువతి హీరోయిన్‌ కాదని వేలోని (సంజన) అని గుర్తిస్తారు. అప్పటికే వదంతులు పలు రకాలుగా మారడంతో ఈ కేసును తప్పనిసరిగా ఛేదించాల్సి వస్తుంది. దీంతో రంగంలోకి దిగిన ఎస్‌.ఐ. వివేక్‌ (ఎస్‌జే సూర్య)కు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? ఈ కేసు ఇన్వెస్టిగేషన్‌ ఎలా సాగింది? ఇంతకీ ఆ యువతిని హత్య చేసింది ఎవరు? తెలియాలంటే వెబ్‌ సిరీస్‌ చూడాల్సిందే!

ఎలా ఉందంటే: క్రైమ్‌, సస్పెన్స్ థ్రిల్లర్‌లకు కామన్‌ థ్రెడ్‌ ఒక్కటే. చివరి వరకూ ట్విస్ట్‌లు ఇస్తూ, ప్రేక్షకుడిని ఉత్కంఠకు గురి చేయడం. ఆ పని చేయడంలో ‘వదంతి’ వెబ్‌సిరీస్‌, దర్శకుడు ఆండ్రూ లూసిస్‌ విజయం సాధించారు. యువతి హత్యతో వదంతులు ఎలా వ్యాపిస్తాయో తెలిసేలా మొదటి ఎపిసోడ్‌ను వాడుకున్న దర్శకుడు, వివేక్‌ కేసు టేకప్‌ చేయడంతోనే అసలు కథ మొదలవుతుంది. అయితే, అక్కడి నుంచి కథనం వేగం పుంజుకుంటుందనుకుంటే తర్వాతి రెండు ఎపిసోడ్స్‌ కూడా కేసు ఇన్వెస్టిగేషన్‌ ప్రాథమిక ఆధారాల సేకరణతోనే సాగుతుంది. కథను ఎస్టాబ్లిష్‌ చేసే క్రమంలో అనవసర సన్నివేశాలకు కత్తెర వేయకుండా వదిలేశారు. డీటెలింగ్‌ పేరుతో సాగదీశారు. ఎస్‌.ఐ. వివేక్‌ ఒక్కో ఆధారాన్ని సేకరించడం, హత్యకు సంబంధించిన వివరాలను క్రోడీకరించడంతో నాలుగో ఎపిసోడ్‌ నుంచి ‘వదంతి’లో వేగం పుంజుకుంటుంది. ఆ టెంపోను చివరి వరకూ కొనసాగించాడు దర్శకుడు. ప్రతి పాత్రపైనా అనుమానం కలిగేలా దర్శకుడు సన్నివేశాలను రాసుకున్న విధానం మాత్రం బాగుంది. పతాక సన్నివేశాల్లో వచ్చే ట్విస్ట్‌ కొత్తగా ఉంది. అయితే, ఎవరు యువతిని హత్య చేశారన్నది చెప్పడానికి ఎనిమిది ఎపిసోడ్స్‌ చాలా ఎక్కువ. అదే సమయంలో హత్యకు కారణం తెలిసిన తర్వాత ఇంత సాగదీత అవసరమా? అనిపించకమానదు. అనవసర సన్నివేశాలను తొలగించడం ద్వారా నిడివి తగ్గించి, స్క్రీన్‌ప్లే, ఇంకాస్త గ్రిప్పింగ్‌గా మార్చి ఉంటే సిరీస్‌ బాగుండేది. క్రైమ్‌ థ్రిల్లర్‌ మూవీలను ఇష్టపడేవారు ఒకసారి ప్రయత్నింవచ్చు.(Vadhandhi review)

ఎవరెలా చేశారంటే: ఎస్సై వివేక్‌ పాత్రలో ఎస్‌.జె.సూర్య కాస్త కొత్తగా కనిపించారు. ఇప్పటివరకూ ఆయన అలాంటి పాత్ర పోషించలేదు.  అయితే, ఆయనకు చెప్పిన తెలుగు డబ్బింగ్‌ అంతగా అతకలేదు. లైలా ఒక డిఫరెంట్‌ పాత్రలో కనిపించారు. లైలా ఇలాంటి పాత్ర చేస్తుందని ఎవరూ ఊహించి ఉండరు. నాజర్‌, సంజన తమ పాత్రల పరిధి మేరకు నటించారు. సాంకేతికంగా ఈ వెబ్‌సిరీస్‌ బాగుంది. పుష్కర్‌, గాయత్రి నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. సిమన్స్‌ నేపథ్య సంగీతం ఇన్వెస్టిగేషన్‌ సీన్స్‌ను ఎలివేట్‌ చేసింది. శరవణన్‌ రామస్వామి సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. రిచర్డ్‌ కెవిన్‌ ఎడిటింగ్‌ అస్సలు బాగోలేదు. డీటెలింగ్‌ పేరుతో తీసింది తీసినట్లు ఉంచేశారు.(Vadhandhi review) దర్శకుడు ఆండ్రూ లూయిస్‌ ఎంచుకున్న కథ, టేకింగ్‌ బాగుంది. హత్య ఎవరు చేశారన్న పాయింట్‌ను చివరి వరకూ హుక్‌ చేయడంలో ఆండ్రూ విజయం సాధించినా, అంత సాగదీయడం అనవసరం.

బలాలు: 👍 నటీనటులు, 👍 కొన్ని మలుపులు,👍 సాంకేతిక బృందం పనితీరు

బలహీనతలు; 👎 రెగ్యులర్‌ స్టోరీ, 👎 సుదీర్ఘ ఎపిసోడ్‌లు

చివరిగా: ట్విస్ట్‌లు బాగున్నా.. ‘వదంతి’ పెద్దదైంది..!

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు