Varalaxmi Sarathkumar: నేనెందుకు సమాధానం చెప్పాలి?: వరలక్ష్మీ శరత్‌కుమార్‌

నెగెటివ్‌ కామెంట్స్‌ను తాను పట్టించుకోనన్నారు నటి వరలక్ష్మీ శరత్‌కుమార్‌.

Published : 29 Apr 2024 00:12 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘క్రాక్‌’, ‘వీరసింహారెడ్డి’, ‘హనుమాన్‌’ (Hanuman) తదితర తెలుగు చిత్రాల్లో కీలక పాత్రలు పోషించి, ఇక్కడి ప్రేక్షకులకు దగ్గరైన కోలీవుడ్‌ నటి వరలక్ష్మీ శరత్‌కుమార్‌ (Varalaxmi Sarathkumar). నటుడు శరత్‌కుమార్‌ కుమార్తెగా తెరంగేట్రం చేసినా అనతి కాలంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె ప్రధాన పాత్రలో తెరకెక్కిన కొత్త సినిమా ‘శబరి’ (Sabari). మే 3న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో.. కాబోయే భర్త నికోలయ్‌ సచ్‌దేవ్‌ (Nicholai Sachdev)పై వచ్చిన విమర్శలపై స్పందించారు. నెగెటివ్ కామెంట్స్‌ను తాను పట్టించుకోనన్నారు.

‘‘సెకండ్‌ మ్యారేజ్‌ అంటూ నిక్‌ గురించి కొందరు ఏం మాట్లాడుతున్నారో విన్నా. నాకు మాత్రం ఆయన హ్యాండ్సమ్‌గా కనిపిస్తారు. మా నాన్న కూడా రెండు సార్లు పెళ్లి చేసుకున్నారు. ఆయన ఆనందంగా ఉన్నంత వరకు అందులో తప్పు లేదు. మా (నిక్‌తో) బంధంపై పలువురు చేసే ట్రోల్స్‌ని నేను లెక్కచేయను. ఎవరికైనా నేనెందుకు సమాధానం చెప్పాలి?నిక్‌ మాజీ భార్యతో నాకు పరిచయం ఉంది. ఆమె వ్యక్తిత్వం నాకు నచ్చింది. నిక్‌, అతని కుమార్తె పవర్‌లిఫ్టింగ్‌లో గోల్డ్‌మెడల్‌ సాధించారు. 14 ఏళ్ల క్రితం మేం తొలిసారి మీట్‌ అయ్యాం. తర్వాత స్నేహితులమయ్యాం. ఆ స్నేహం ఇటీవల ప్రేమగా మారింది. సచ్‌దేవ్‌ నన్ను బాగా నవ్విస్తారు. కెరీర్‌ విషయంలో ఎప్పుడూ సపోర్ట్‌ చేస్తారు’’ అని పేర్కొన్నారు.

ముంబయికి చెందిన వ్యాపారవేత్త సచ్‌దేవ్‌ ఆర్ట్‌ గ్యాలరీలు నిర్వహిస్తుంటారు. ఆన్‌లైన్‌ వేదికగానూ వివిధ రకాల పెయింటింగ్‌లు, కళాకృతులను విక్రయిస్తుంటారు. ఇరు కుటుంబాలు, అతి కొద్దిమంది బంధువుల సమక్షంలో మార్చి తొలివారంలో వీరి నిశ్చితార్థం జరిగింది. పెళ్లి ముహూర్తం ఇంకా ఖరారు కాలేదని వరలక్ష్మి గత ఇంటర్వ్యూలో తెలిపారు. ‘శబరి’ని సైకలాజికల్‌ థ్రిల్లర్‌గా దర్శకుడు అనిల్‌ కాట్జ్‌ తెరకెక్కించారు. తల్లీకూతురు అనుబంధం నేపథ్యంలో రూపొందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని