Venu Tillu: కొత్తగా ఉంది.. ఆ గౌరవం

‘‘ఇరవయ్యేళ్లుగా నటిస్తున్నా. రెండు వందల సినిమాలు చేశా. కమర్షియల్‌ సక్సెస్‌ రాలేదు. ఎప్పుడొస్తుందో కూడా తెలియదు. అప్పటివరకూ ఖాళీగా ఉండటం ఎందుకని రాయటం మొదలుపెట్టా.

Updated : 16 Mar 2023 07:02 IST

‘‘రవయ్యేళ్లుగా నటిస్తున్నా. రెండు వందల సినిమాలు చేశా. కమర్షియల్‌ సక్సెస్‌ రాలేదు. ఎప్పుడొస్తుందో కూడా తెలియదు. అప్పటివరకూ ఖాళీగా ఉండటం ఎందుకని రాయటం మొదలుపెట్టా. అదే ‘బలగం’ (Balagam) తీయడానికి కారణమైంది’’ అన్నారు వేణు ఎల్దండి (Venu). హాస్యనటుడిగా ప్రేక్షకులకు సుపరిచితమైన వేణు... ‘బలగం’తో మెగాఫోన్‌పట్టారు. తొలి ప్రయత్నంలోనే ఓ మంచి సినిమా తీసి ప్రేక్షకుల్ని మెప్పించారు. తన ఆలోచనల్లోని లోతుని ఈ చిత్రంతో చాటి చెప్పారు. చిత్రం విజయవంతంగా ప్రదర్శితమవుతున్న సందర్భంగా వేణు ఎల్దండి బుధవారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు. ఆ విషయాలివీ...

‘‘మరాఠీ, మలయాళం, తమిళంలో వస్తున్నట్టుగా మూలాల్ని ఆవిష్కరించే భిన్నమైన సినిమాలు నాపై ఎక్కువగా ప్రభావం చూపించాయి. అలా మనం ఎందుకు చేయకూడదనే ఆలోచనలో ఉన్నప్పుడే ‘బలగం’ కథ తట్టింది. మా నాన్న చనిపోయినప్పుడు జరిగిన కొన్ని సంఘటనలు నాకు గుర్తుండిపోయాయి. పైగా మాది పెద్ద కుటుంబం.నేను మా అమ్మకి తొమ్మిదో సంతానం. ఇలా నా కుటుంబం, మా ఊరు సిరిసిల్ల, ఆ మనుషులు, వాతావరణంలోనే ఈ సినిమా చేయాలనుకున్నా. ప్రేక్షకుల నుంచి వచ్చిన స్పందన ఎంతో తృప్తినిచ్చింది. జీవితంలో మనం సాధించాలనే కోరిక ఉంటుంది. అది నెరవేరినప్పుడు కలిగిన అనుభూతి మాటల్లో వర్ణించలేం. అలాంటి అనుభూతి అగ్ర కథానాయకుడు చిరంజీవి మెచ్చుకున్నప్పుడు కలిగింది. ఆయన ప్రతీ సన్నివేశం గురించి వివరంగా మాట్లాడుతూ మెచ్చుకోవడం నాకెంతో తృప్తినిచ్చింది’’.

‘‘మంచి సినిమా చేయాలనుకున్నా. అదే చేసి చూపించాం. దిల్‌రాజు అనుభవం మమ్మల్ని ముందుకు నడిపించింది. నన్ను ఇప్పుడొక నటుడిగానూ చూస్తున్నారు, దర్శకుడిగానూ చూస్తున్నారు. సినిమా విడుదల తర్వాత  నా దగ్గరి స్నేహితులు కూడా ఇప్పుడు నాకు ప్రత్యేకమైన గౌరవం ఇస్తుంటే కొత్తగా, భయంగా ఉంది. దాన్ని జీర్ణించుకోవడానికి కాస్త సమయం పడుతుంది. ఇకపై నేను చేయనున్న సినిమాల్లో హాస్యం కూడా ఉంటుంది.  ఎలాంటి భావోద్వేగాలు ఉంటాయనే విషయం కంటే... అందరికీ ఆమోదయోగ్యమైన కథ చెప్పడమే కీలకం అని నమ్ముతాను. నిర్మాత దిల్‌రాజుకు ఇప్పటికే ఓ కథ చెప్పా. అది కొంచెం పెద్ద స్థాయిలోనే ఉంటుంది’’.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని