Upcoming Movies: స్టార్‌లు లేకపోయినా ‘మే’మున్నామంటూ.. ఈ నెలలో సందడి చేసే చిత్రాలివే!

మే నెలలో ప్రేక్షకులను అలరించేందుకు పలు చిత్రాలు సిద్ధమయ్యాయి. ఏ రోజు ఏ చిత్రం విడుదల కానుందంటే?

Published : 01 May 2024 12:00 IST

మార్చి, ఏప్రిల్‌లో ఏ స్టార్‌ హీరో సినిమా విడుదల కాలేదు. మే 9న ప్రభాస్‌ (Prabhas) ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD)తో అలరించేందుకు వస్తారని ఆశించిన ప్రేక్షకులకు నిరాశే మిగిలింది. చిత్ర బృందం ఈ సినిమాని జూన్‌ 27కి వాయిదా వేసింది. దీంతో స్టార్‌ హీరో సినిమాలేని నెలల జాబితాలో మే కూడా చేరింది. ఈ వేసవిలో వినోదాల జల్లు కురిపించేందుకు మేమున్నామంటూ ఇప్పటికే పలువురు నటులు విభిన్న కాన్సెప్ట్‌ మూవీస్‌తో అలరించారు. మరికొందరు సిద్ధంగా ఉన్నారు. వారెవరు? మేలో విడుదలయ్యే ఆ చిత్రాలేంటి? చూసేద్దాం..

మే 3..

‘నాంది’, ‘ఉగ్రం’వంటి సీరియస్‌ స్టోరీలతో రూటు మార్చిన అల్లరి నరేశ్‌ (Allari Naresh) మళ్లీ తన మార్క్‌ కామెడీ ‘ఆ ఒక్కటీ అడక్కు’ (Aa Okkati Adakku) అంటూ సిద్ధమయ్యారు. ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌. జీవితంలో స్థిరపడినా పెళ్లికి తొందరెందుకనే యువకుల పరిస్థితి ఎలా ఉంటుందో దర్శకుడు మల్లి అంకం ఈ చిత్రంలో చూపించనున్నారు. విభిన్న కాన్సెప్టులను ఎంపిక చేసుకోవడంలో ముందుండే సుహాస్‌ (Suhas) ఈసారి ‘ప్రసన్న వదనం’ (Prasanna Vadanam)తో థ్రిల్‌ పంచనున్నారు. ఫేస్‌ బ్లైండ్‌నెస్‌తో బాధపడే యువకుడిపై మర్డర్‌ కేసుల్లో ఇరుక్కోవడానికి కారణమేంటి? వాటి నుంచి ఎలా బయటపడ్డాడనేది కథాంశం. అర్జున్‌ వై.కె. తెరకెక్కించిన ఈ సినిమాలో పాయల్‌ రాధాకృష్ణ, రాశీసింగ్‌ హీరోయిన్లు. వరలక్ష్మీ శరత్‌కుమార్‌ (Varalaxmi Sarathkumar) ప్రధాన పాత్రలో దర్శకుడు అనిల్‌ కాట్జ్‌ రూపొందించిన చిత్రం ‘శబరి’ (Sabari). తన బిడ్డను కాపాడుకునేందుకు ఓ తల్లి చేసిన సాహసం నేపథ్యంలో సైకలాజికల్‌ థ్రిల్లర్‌గా రూపొందించారు.

విజయవంతమైన హారర్‌ కామెడీ ఫ్రాంచైజీ ‘అరణ్‌మనై’ (Aranmanai) నుంచి వస్తున్న 4వ చిత్రం ‘బాక్‌’ (Baak). సుందర్‌ సి. ప్రధాన పాత్రలో నటిస్తూ దర్శకత్వం వహించారు. తమన్నా (Tamannaah Bhatia), రాశీఖన్నా (Raashii Khanna) హీరోయిన్లు. ‘ఉయ్యాల జంపాల’తో యువతను ఆకట్టుకున్న ద‌ర్శకుడు విరించి వ‌ర్మ. కొన్నేళ్ల విరామం తర్వాత ఆయన దర్శకత్వంలో రూపొందిన పొలిటికల్‌ బ్యాక్‌డ్రాప్‌ మూవీ ‘జితేందర్‌రెడ్డి’ (Jithender Reddy). ‘బాహుబలి’తో గుర్తింపు తెచ్చుకున్న రాకేశ్‌వర్రే కథానాయకుడు. 1980లో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా ఈ మూవీని తీర్చిదిద్దారు. టొవినో థామస్‌ ప్రధాన పాత్రలో లాల్‌ జూనియర్‌ తెరకెక్కించిన చిత్రం ‘నడిగర్‌’ (Nadikar). ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన నటుడు ఎందుకు పాతాళానికి పడిపోవాల్సి వచ్చిందనేది కథాంశం. ఇవన్నీ మే 3న విడుదల కానున్నాయి.


మే 10..

సత్యదేవ్‌ (Satyadev) హీరోగా వి.వి. గోపాల కృష్ణ తెరకెక్కించిన సినిమా ‘కృష్ణమ్మ’ (Krishnamma). ముగ్గురు స్నేహితులు, ఓ విలన్‌ గ్యాంగ్‌కు మధ్య జరిగే సంఘర్షణే ఈ సినిమా ఇతివృత్తం. చిన్న ఘటన ఆ మిత్రుల జీవితాన్ని ఎలా మలుపు తిప్పిందనేది ఆసక్తికరం. మోహన్‌ భగత్‌, సుప్రితా సత్యనారాయణ ప్రధాన పాత్రల్లో అజయ్‌ నాగ్‌ రూపొందించిన చిత్రం ‘ఆరంభం’ (Aarambham). ఈ రెండూ మే 10న రిలీజ్ అవుతాయి.


మే 17..

1960ల నాటి గోదావరి జిల్లాల నేపథ్యంలో రూపొందిన చిత్రం ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ (Gangs of Godavari). ఆ రోజుల్లో చీకటి ప్రపంచంలో సామాన్యుడి స్థాయి నుంచి అసామాన్యుడిగా ఎదిగిన ఓ హింసాత్మక వ్యక్తి కథగా ఈ సినిమా ఉండనుంది. విశ్వక్‌ సేన్‌ (Vishwak Sen) హీరో. నేహాశెట్టి హీరోయిన్‌. కృష్ణచైతన్య దర్శకుడు. కాజల్‌ అగర్వాల్‌ (Kajal Aggarwal) నటించిన లేడీ ఓరియెంటెడ్‌ ఫిల్మ్‌ ‘సత్యభామ’ (Satyabhama). ఆమె పోలీసు అధికారిగా నటించారు. ఈ క్రైమ్‌ థ్రిల్లర్‌కు సుమన్‌ చిక్కాల దర్శకత్వం వహించారు. ‘రాజు యాదవ్‌’ (Raju Yadav)గా ఎంటర్‌టైన్‌ చేయనున్నారు గెటప్‌ శ్రీను (Getup Srinu). ఈయన హీరోగా కె. కృష్ణమాచారి తెరకెక్కించిన సినిమా ఇది. అంకిత కారాట్‌ హీరోయిన్‌. ఈ మూవీస్‌ మే 17న ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.


యాక్షన్‌ vs లవ్‌

యానియా భరద్వాజ్‌ ప్రధాన పాత్రలో స్టీఫెన్‌ తెరకెక్కించిన సూపర్‌ గర్ల్‌ సినిమా ‘ఇంద్రాణి’ (Indrani). ‘‘భారతీయ చరిత్రలో మహిళలు ఇంత పెద్ద స్థాయిలో రోప్‌ షాట్స్‌, ఎంతో రిస్క్‌తో కత్తులను ఉపయోగించి చేసిన తొలి చిత్రమిది’’ అని డైరెక్టర్‌ పేర్కొన్నారు. మే 24న విడుదల కానుంది. దెయ్యమని తెలిసీ ప్రేమలో పడిన యువకుడి పరిస్థితేంటి? అన్న కథాంశంతో అరుణ్‌ భీమవరపు తెరకెక్కించిన చిత్రం ‘లవ్‌ మీ: ఇఫ్‌ యూ డేర్‌’ (Love Me If You Dare). ఆశిష్‌ (Ashish Reddy), వైష్ణవీ చైతన్య (Vaishnavi Chaitanya) హీరో, హీరోయిన్లు. ఈ భయానకమైన రొమాంటిక్ ప్రేమకథా చిత్రం మే 25న రిలీజ్‌ అవుతుంది.


మే 31..

‘హరోం హర’ (Haromhara)తో ప్రేక్షకులను పలకరించనున్నారు సుధీర్‌ బాబు (Sudheer Babu). ఆయన హీరోగా నటించిన ఈ చిత్రాన్ని జ్ఞానసాగర్‌ ద్వారక తెరకెక్కించారు. మాళవిక శర్మ కథానాయిక. 1989 నాటి చిత్తూరు జిల్లా కుప్పం నేపథ్యంలో సాగే చిత్రమిది. ‘బేబీ’తో యువతలో క్రేజ్‌ సంపాదించుకున్న ఆనంద్‌ దేవరకొండ (Anand Deverakonda) నటించిన తాజా చిత్రం ‘గం..గం.. గణేశా’ (Gam Gam Ganesha). ప్రగతి శ్రీవాస్తవ హీరోయిన్‌. లవ్‌, యాక్షన్‌ నేపథ్యంలో ఉదయ్‌ శెట్టి తెరకెక్కించారు. ఇరవయ్యేళ్ల వయసులో కన్న కలలు, లక్ష్యాల కోసం యాభయ్యేళ్ల వ్యక్తి చేసిన ప్రయాణం ఎలా సాగింది?అన్న కథాంశంతో రూపొందిన చిత్రం ‘మ్యూజిక్‌ షాప్‌ మూర్తి’ (Music Shop Murthy). అజయ్‌ ఘోష్‌, చాందినీ చౌదరి ప్రధాన పాత్రధారులు. శివ పాలడుగు దర్శకత్వం వహించారు. ఈ సినిమాలు మే 31న రిలీజ్‌ కానున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు