Alluri Seetarama Raju: ఎస్వీ రంగారావును ఎంపిక చేశారు.. చివరకు బాలయ్యే నటించారు!

కృష్ణ హీరోగా తెరకెక్కిన ‘అల్లూరి సీతారామరాజు’ విడుదలై నేటికి 50 ఏళ్లు. ఈ చిత్రానికి సంబంధించిన ఆసక్తికర విశేషాలివీ..

Updated : 01 May 2024 10:40 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ‘అల్లూరి సీతారామరాజు’ (Alluri Seetarama Raju) ఓ సంచలనం. ప్రేక్షకులు ఎప్పటికీ మరవలేనిది నటుడు కృష్ణ (Krishna) సాహసం. ఈ సినిమా విడుదలై నేటికి 50 ఏళ్లు (1974 మే 1న విడుదల). ఈ సందర్భంగా ఆసక్తికర విశేషాలు చూద్దాం (50 years for Alluri Seetarama Raju)..

‘నో’ చెప్పినా.. ఆయనే నటించారు

ఈ సినిమాలోని కీలక పాత్రల్లో అగ్గి రాజు ఒకటి. ఆ రోల్‌ ప్లే చేసేందుకు ముందుగా నటుడు మన్నవ బాలయ్య (Mannava Balayya)ను అడిగారట కృష్ణ. అదే సమయంలో ఆయన ‘అన్నదమ్ముల కథ’ సినిమాని నిర్మించే పనుల్లో బిజీగా ఉండడంతో ‘అల్లూరి..’లో నటించేందుకు ఆసక్తి చూపలేదు. దీంతో, అగ్గి రాజు పాత్రకు ఎస్వీ రంగారావు (sv rangarao)ను ఎంపిక చేసింది చిత్ర బృందం. ఈ సినిమా ఖరారైన తర్వాత మరో మూవీ షూటింగ్‌కు మైసూరుకు వెళ్లిన ఎస్వీఆర్‌ అస్వస్థతకు గురయ్యారు. విషయం తెలుసుకున్న టీమ్‌ అగ్గి రాజు సీన్‌లు లేకుండా తొలి షెడ్యూల్‌ చిత్రీకరణ పూర్తి చేసింది. ఎస్వీఆర్‌ కోలుకున్నా ఇంకో సినిమా షూట్‌ ముగించుకునే రావాలి. ఇక్కడేమో చిత్రీకరణ శరవేగంగా సాగుతోంది. ఎస్వీఆర్‌ రాక ఆలస్యమవుతుండడంతో కృష్ణ మరోసారి బాలయ్యను సంప్రదించారు. అగ్గిరాజు సన్నివేశాలను త్వరగా పూర్తి చేయకపోతే వాటిల్లే నష్టం గురించి వివరించారు. నటించేందుకు బాలయ్య సరేనన్నారు. అలా ఇద్దరూ కలిసి సెట్స్‌కి వెళ్లే సరికి యూనిట్‌ మొత్తం డీలాపడిపోయిందట. ‘‘అగ్గి రాజుగా నన్ను తీసుకోవద్దని యూనిట్‌ సభ్యులు కృష్ణకు విజ్ఞప్తి చేశారని నాకు తెలిసింది. ఓ సీన్‌ రష్‌ చూసిన తర్వాత ఆయన ఎంపికను సమర్థించారు. నా కెరీర్‌లో అది ఓ తీపి గుర్తు’’ అని బాలయ్య ఓ ఇంటర్వ్యూలో ఈ జ్ఞాపకాలు నెమరువేసుకున్నారు.

సబబు కాదనుకున్నారు..

మన్యం వీరుడి జీవితం తెరపైకి రావడానికి రచయిత త్రిపురనేని మహారథి (Tripuraneni Maharathi) మరో ప్రధాన కారణం. ఎంతో బిజీగా ఉండే ఆయన ఈ చిత్రం కోసం అంతకు ముందు అంగీకరించిన సినిమాలెన్నింటినో క్యాన్సిల్‌ చేసుకున్నారు. అల్లూరి సీతారామరాజు మరణ సన్నివేశం చిత్రీకరణ గురించి ఓ సందర్భంలో వివరించారు. ‘‘సీతారామరాజు ఎలా చనిపోయారన్న దాని గురించి భిన్న కథనాలు ఉన్నాయి. సుప్రభాత వేళ సంధ్యావందనం చేసుకుంటున్న ఆయన్ను బ్రిటిష్‌ సైనికులు చుట్టుముట్టి కాల్చి చంపారని, సంధికి పిలిచి చంపారనే ప్రచారం ఉంది. వీరోచిత పోరాటం సాగించిన వ్యక్తి సంధ్యావందనం చేసుకుంటూ ఎన్‌కౌంటర్‌ అయ్యారనేది నాకు సబబుగా అనిపించలేదు. అందుకే రెండో కథనాన్నే ఎన్నుకున్నా’’ అని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని