Writer Padmabhushan Review: రివ్యూ: రైటర్ పద్మభూషణ్
సుహాస్ ప్రధాన పాత్రలో నటించిన ‘రైటర్ పద్మభూషణ్’ (Writer Padmabhushan) ఎలా ఉందంటే..?
Writer Padmabhushan.. చిత్రం: రైటర్ పద్మభూషణ్; నటీనటులు: సుహాస్, టీనా శిల్పరాజ్, రోహిణి, ఆశిష్ విద్యార్థి, శ్రీ గౌరీ ప్రియ, గోపరాజు; సంగీతం: శేఖర్ చంద్ర; సినిమాటోగ్రఫీ: వెంకట్ ఆర్.శేఖమూరి; ఎడిటింగ్: పవన్ కల్యాణ్, సిద్ధార్థ్; నిర్మాత: అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర, చండ్రు మనోహరన్; దర్శకుడు: షణ్ముఖ ప్రశాంత్; విడుదల తేదీ: 02-02-2023
సుహాస్ అనగానే ‘కలర్‌ఫొటో’ సినిమానే గుర్తొస్తుంది. జాతీయ పురస్కారం పొందిన ఆ సినిమా తర్వాత నుంచి ఆయన కోసమే కొన్ని కథలు పుడుతున్నాయి. ఆ కథలు ఆయన్ని కథానాయకుడిగా మరింత బిజీగా మార్చేశాయి. ఆ పరంపరలో రూపుదిద్దుకున్న మరో చిత్రమే ‘రైటర్ పద్మభూషణ్’. మంచి ప్రచారంతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన ఈ చిత్రం ఎలా ఉందో తెలుసుకునే ముందు కథేమిటో చూద్దాం (Writer Padmabhushan).
కథేంటంటే: పద్మభూషణ్ అలియాస్ భూషణ్ (సుహాస్) (Suhas) విజయవాడకి చెందిన ఓ మధ్య తరగతి కుర్రాడు. ఓ గ్రంథాలయంలో అసిస్టెంట్ లైబ్రేరియన్‌గా పని చేస్తుంటాడు. ఎప్పటికైనా రైటర్ పద్మభూషణ్ అనిపించుకోవాలనేది అతని కల. అందుకోసమని ఇంట్లో వాళ్లకి తెలియకుండా లక్షలు అప్పు చేసి తొలి అడుగు పేరుతో ఓ బుక్ రాస్తాడు. కానీ, పాఠకులతో ఆ బుక్‌ని చదివించడానికి పడరాని పాట్లు పడుతుంటాడు. కాపీలు అమ్ముడుపోక ఇంటికి తిరిగి తెచ్చుకోవాల్సిన పరిస్థితి. అప్పులకి వడ్డీలు కట్టలేక, కాపీలు అమ్ముడుపోక సతమతమవుతున్న దశలో పద్మభూషణ్ పేరుతో వెలువడిన మరో కొత్త పుస్తకానికీ, అదే పేరుతో ఏర్పాటైన బ్లాగ్‌కి మంచి పేరొస్తుంది. ఎప్పుడో దూరమైన బాగా డబ్బున్న మేనమామ తన కూతురు సారిక (టీనా శిల్పరాజ్)ని ఇచ్చి పెళ్లి చేయడానికి ముందుకొస్తాడు. ఊహించని ఆ పరిణామం భూషణ్ తల్లిదండ్రులకి ఎంతో సంతోషాన్నిస్తుంది. ఆ సంతోషాన్ని దూరం చేయలేక, తను రాయకపోయినా తనే రచయిత అని చెబుతూ పెళ్లికి సిద్ధమవుతాడు భూషణ్. ఇంతలోనే ఆ బ్లాగ్‌లో వరుసగా వస్తున్న కంటెంట్ ఆగిపోతుంది. దాంతో అసలు విషయాన్ని తనకి కాబోయే భార్యకి చెప్పాలనుకున్న భూషణ్ ఆ పని చేశాడా? లేదా? వీళ్లిద్దరి పెళ్లి జరిగిందా? ఇంతకీ రైటర్ పద్మభూషణ్ పేరుతో రచనలు చేసిందెవరు? అసలు ఆ పేరుని వాడుకోవాల్సిన అవసరం ఎందుకొచ్చింది? అజ్ఞాతంలో ఉన్న ఆ రచయితని పట్టుకునేందుకు భూషణ్ ఎన్ని పాట్లు పడ్డాడన్నది మిగతా కథ (Writer Padmabhushan).
ఎలా ఉందంటే: విజయవాడ పుస్తక ప్రపంచాన్ని ఆవిష్కరిస్తూ మొదలయ్యే కథ ఇది. రచయితగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలని, పెద్ద రచయితల సరసన తనని చూసుకోవాలని కలలు కనే యువకుడి పాత్ర చుట్టూ సాగుతుంది. ఈ నేపథ్యం కొత్తదే. రచనవైపు దృష్టిపెడుతున్న నేటి యువతరం తక్కువే కానీ, కథానాయకుడి పాత్రని అమాయకత్వంతో తీర్చిదిద్ది అందరికీ కనెక్ట్ అయ్యేలా చేశాడు దర్శకుడు. ఇంటిల్లిపాదీ కలిసి ఆస్వాదించేలా హాస్యం, మలుపులు, సందేశాన్ని మేళవించి కథని అల్లిన తీరు ఆకట్టుకుంటుంది. కథానాయకుడు తన పుస్తకాన్ని పాఠకులతో బలవంతంగా చదివించేందుకు పడే పాట్లు, కథానాయికతో ప్రేమ ప్రయాణంతో ప్రథమార్ధం సరదాగా సాగుతుంది. సినిమా హాల్‌లో సన్నివేశాలకి తోడు, కథానాయకుడి తల్లిదండ్రులుగా నటించిన ఆశిష్ విద్యార్థి, రోహిణిల మధ్య మిడిల్‌క్లాస్ నేపథ్యం కూడా హాస్యాన్ని పంచుతుంది. తాను రాసిన పుస్తకం అమ్ముడుపోక రచయిత వెనక్కి తిరిగి తెచ్చుకొనే సన్నివేశాలు మనసుల్ని కదిలిస్తాయి. పద్మభూషణ్ పేరుతో రాస్తున్న ఆ రచయిత ఎవరనేదే సినిమాలో కీలకం. విరామ సన్నివేశాల్లో మలుపు ద్వితీయార్ధంపై ఆసక్తిని పెంచుతుంది. కానీ, అక్కడే సమస్యంతా. హాస్యం మోతాదు తగ్గడం, కొన్ని సన్నివేశాలు సాగదీతగా మారడంతో కథ ముందుకు కదలదు. అసలు రైటర్ ఎవరనే విషయంలోనూ ఓ అంచనాకి ప్రేక్షకుడు వచ్చేస్తాడు. దాంతో పతాక సన్నివేశాలు పెద్దగా ప్రభావం చూపించవు. చివర్లో సందేశం ఆకట్టుకున్నప్పటికీ, భావోద్వేగాలు మాత్రం పండవు. తనవి కాని రచనల్ని తనవే అని చెబుతూ ఓ యువకుడు తప్పటడుగులు వేయడాన్ని చూసి మరో రచయిత ఊరుకుంటారా?ఎదగాలనే కోరిక ఉన్న ఓ రచయితని ప్రోత్సహించడం అంటే అదా? అనే ప్రశ్నలు తలెత్తుతాయి. హాస్యం, మలుపుల వరకు పర్వాలేదు కానీ, కథ, కథనాల విషయంలో లోటుపాట్లు కనిపిస్తాయి. చివర్లో సందేశం మాత్రం ఆలోచింపజేస్తుంది. కుటుంబంతో కలిసి చూసేలా సన్నివేశాల్ని తీర్చిదిద్దడం ఈ సినిమాకి కలిసొచ్చే విషయం (Writer Padmabhushan).
ఎవరెలా చేశారంటే: సుహాస్ రైటర్ పద్మభూషణ్ పాత్రలో ఒదిగిపోయాడు. మిడిల్ క్లాస్ కుర్రాడిగా ఆ పాత్రపై తనదైన ప్రభావం చూపించాడు. హాస్యం టైమింగ్ ఆకట్టుకుంటుంది. కథానాయిక టీనా తన పాత్రకి తగ్గట్టుగా నటింది. మరో అమ్మాయి శ్రీ గౌరీ ప్రియ కూడా కీలకమైన పాత్రలో కనిపిస్తుంది. రోహిణి, ఆశిష్ విద్యార్థి పాత్రలు సినిమాకి కీలకం. వాళ్లిద్దరూ మధ్య తరగతి తల్లిదండ్రులుగా పాత్రలపై బలమైన ప్రభావం చూపించారు. కథానాయిక తండ్రిగా గోపరాజు రమణతోపాటు, ఇతర నటులు తమ పాత్రల పరిధి మేరకు నటించారు. సాంకేతికంగా ఈ సినిమాను ఉన్నతంగా తీర్చిదిద్దారు. కెమెరా, సంగీతం విభాగాలు ఆకట్టుకుంటాయి. మనకు తెలిసిన విజయవాడ, కాకినాడల్ని మరింత కొత్తగా, అందంగా చూపించింది కెమెరా విభాగం. పాటలు, నేపథ్య సంగీతం సినిమాకి బలాన్నిచ్చాయి. ద్వితీయార్ధంలోనూ కొన్ని సన్నివేశాలు సాగదీతగా అనిపిస్తాయి. ప్రథమార్ధంలోనూ అక్కడక్కడా వేగం తగ్గినట్టు అనిపిస్తుంది. వాటిపై ఎడిటింగ్ విభాగం దృష్టిపెట్టాల్సింది. దర్శకుడు ఎవరూ స్పృశించని ఓ కొత్త నేపథ్యంలో కథని నడిపారు. హాస్యంలోనూ ఆయన పట్టు కనిపిస్తుంది. కథ, కథనాల పరంగానే మరిన్ని కసరత్తులు చేయాల్సింది. నిర్మాణం ఉన్నతంగా ఉంది.
బలాలు
1.హాస్యం, 2.సుహాస్ నటన, 3.పతాక సన్నివేశాల్లో సందేశం
బలహీనతలు
1.అక్కడక్కడా సాగదీతగా సన్నివేశాలు, 2.కథలో సమస్యలు
చివరిగా: రైటర్ పద్మభూషణ్.. కొన్ని నవ్వులు పంచుతాడు.. ఆలోచన రేకెత్తిస్తాడు..!
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Tirumala: తిరుమలలో భారీ వర్షం.. భక్తులకు ఉపశమనం
-
India News
Rajnath Singh: ఆల్ టైం గరిష్ఠానికి రక్షణ రంగ ఎగుమతులు
-
Politics News
Chandrababu: చాలా మంది వైకాపా ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారు: చంద్రబాబు
-
India News
Navjot Singh Sidhu: జైలునుంచి విడుదలైన సిద్ధూ.. రాహుల్ గాంధీ ఓ విప్లవమని వ్యాఖ్య!
-
Movies News
అల్లు అర్జున్‌తో మురుగదాస్ మూవీ.. క్లారిటీ ఇచ్చిన దర్శకుడు!
-
India News
Rahul Gandhi: రాహుల్ గాంధీపై మరో పరువు నష్టం కేసు