
ప్రవాసీ.. అభివృద్ధికి అడుగేసి..
విదేశాల్లో ఉంటూ వివిధ రంగాల్లో చేయూత
నేడు ప్రవాస భారతీయుల దినోత్సవం
ఏ దేశమేగినా ఎందుకాలిడినా.. ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనినా..
పొగడరా నీ తల్లి భూమి భారతిని.. నిలపరా నీ జాతి నిండు గౌరవం..
అంటూ జన్మభూమి గొప్పతనాన్ని తన గేయంలో స్ఫురించారు రాయపోలు సుబ్బారావు. ఈ స్ఫూర్తిని అందిపుచ్చుకున్న పలువురు ప్రవాస భారతీయులు తమ సొంతూర్ల అభివృద్ధికి నడుంబిగించారు. తమకు చదువు నేర్పిన పాఠశాలల్లో అక్షరజ్యోతులు వెలిగించారు. ఆరోగ్యానికి సహకారం అందిస్తున్నారు. ఎక్కడున్నా.. ఏం చేస్తున్నా మాకు విజ్ఞానాన్ని నేర్పిన జన్మభూమిని మరువలేమని చాటిచెప్పడం విశేషం. నేడు ప్రవాసీయుల దినోత్సవం సందర్భంగా ఉమ్మడి మెదక్, వికారాబాద్ జిల్లాలకు చెందిన పలువురు ఎన్ఆర్ఐలు కొనసాగిస్తున్న సేవా కార్యక్రమాలపై ‘న్యూస్‌టుడే ప్రత్యేక కథనం.
నేనున్నా అంటూ..
తాను ఆర్థికంగా స్థిరపడటమే కాకుండా మరికొందరికి తమకు ప్రయోజనం కలగాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నారు చేగుంట మండలం చందాయిపేటకు చెందిన బచ్చు అనిల్‌కుమార్. స్వగ్రామంలో పదో తరగతి వరకు చదివిన
ఈయన ప్రస్తుతం అమెరికాలో స్థిరపడ్డారు. తనకు విద్యాబుద్ధులు నేర్పిన బడికి ఏదైనా చేయాలనే ఉద్దేశంతో గ్రంథాలయం ఏర్పాటు చేయించారు. రూ.5 లక్షలతో ఫర్నీచర్, రూ.6 లక్షలతో పుస్తకాలను సమకూర్చారు. ఈ క్రమంలో పాఠశాల విద్యార్థులు నేలపై కూర్చొని ఇబ్బందులు పడుతుండటాన్ని గమనించిన సర్పంచి బుడ్డ స్వర్ణలత, మిత్రులు అనిల్‌కుమార్ దృష్టికి తీసుకెళ్లగా.. రూ.1.50 లక్షలతో డ్యూయల్ డెస్క్‌లు తయారు చేయించి అందజేశారు.
* ఇదే గ్రామానికి చెందిన నీరుడి సుదర్శన్ 15 ఏళ్లుగా అమెరికాలో నివసిస్తున్నారు. లాక్డౌన్ సమయంలో ప్రజలు ఇబ్బందులు పడుతుండటాన్ని గమనించి రూ.1.50 లక్షలు వెచ్చించి ఇక్కడి మిత్రుల సహకారంతో పేదలకు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. ఇక ప్రతి ఏటా కొంతమంది విద్యార్థులను ఎంపిక చేసి విహారయాత్రకు పంపిస్తుంటారు.
* చేగుంట మండలం వడియారం గ్రామానికి చెందిన గోలి సంతోష్పున్నం సింగపూర్‌లో నివసిస్తున్నారు. నార్సింగికి చెందిన బాల గాయని శర్వాణి ఆర్థిక ఇబ్బందులతో ముందుకు సాగలేక అష్టకష్టాలు పడ్డారు. దీంతో ఆమె శిక్షణకు అవసరమయ్యే రూ. 1.02 లక్షలు, స్మార్ట్‌ఫోన్‌ను సంతోష్ అందించడం గమనార్హం.- న్యూస్‌టుడే, చేగుంట
గో సంరక్షణకు నడుం బిగించి..
గోవులను పూజించే సంప్రదాయం మనది. వీటి సంరక్షణకు సంగారెడ్డి పట్టణ శివారులోని వైకుంఠపురం ఆలయంలో గోశాల కొనసాగుతోంది. ఇక్కడ వందలాది ఆవులు ఉన్నాయి. వీటి నిర్వహణ ఖర్చుతో కూడుకున్న పని. గో సంరక్షణను బాధ్యతగా భావించే వారు తమవంతు సాయం అందిస్తున్నారు. హత్నూరకు చెందిన శ్రీకాంత్ ఇదే కోవలోకి వస్తారు. ఆయన ప్రస్తుతం అమెరికాలోని ఎడిసన్‌లో ఉంటున్నారు. సాఫ్ట్వేర్ సంస్థను నిర్వహిస్తున్నారు. గోశాల నిర్వహణ ఖర్చుల నిమిత్తం ఇప్పటి వరకు రూ.5 లక్షలు అందించడం గమనార్హం. తన మిత్రులతో కలిసి గో సంరక్షణలు అడుగులు వేయిస్తున్నారని, డే ఫర్ డాలర్ పేరిట నెలకు 30 డాలర్లను ఇందుకు కేటాయించే కార్యక్రమానికి రూపకల్పన చేస్తున్నారని వైకుంఠపురం ప్రధాన అర్చకుడు కందాడై వరదాచార్యులు తెలిపారు.
- న్యూస్‌టుడే, సంగారెడ్డి టౌన్
చదువుకు అండాదండ
దేశం అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలంటే విద్య పరిఢవిల్లాలనేది ఆయన నమ్మకం. అదే నిరుపేదలకు అండగా నిలిచి వారిని చదివించేలా ప్రోత్సహించింది. ఇలా తనవంతుగా విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నారు చేర్యాల మండలం ముస్త్యాల గ్రామానికి చెందిన పెడతల ప్రతాప్‌రెడ్డి. విద్యాలయాలు బాగుపడాలని కాంక్షించే ఈయన పుట్టిన ఊరు ముస్త్యాలతో పాటు పరిసర గ్రామాల్లోనూ ఆర్థిక సాయం చేస్తున్నారు. 1977లో అమెరికాకు వెళ్లారు. ఆచార్య వృత్తి చేపట్టి అక్కడే స్థిరపడ్డారు. ఈ క్రమంలో పిల్లలకు విజ్ఞానాన్ని పెంచేందుకు అనుగుణంగా సొంతూరిలోని పాఠశాల రూపురేఖలు మార్చి, తాను చదివిన చేర్యాల ప్రభుత్వ కళాశాలకూ చేయూత అందించారు. సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు, చేర్యాల మండలం మర్రిముచ్చాలకు ఆర్థిక సహాయం చేశారు. చుంచనకోట, ఐనాపూర్, ముస్త్యాల గ్రామాల్లో మినీ గ్రంథాలయాల ఏర్పాటుతో పాటు ముస్త్యాల జడ్పీహెచ్, ప్రాథమిక పాఠశాలలకు వేర్వేరుగా రూ.2.50 లక్షలతో భవిష్యనిధి ఏర్పాటు చేయించారు. చేర్యాలలోని ‘మనోచేతన’ మానసిక దివ్యాంగుల సంస్థకు తోడ్పాటు అందిస్తున్నారు.
- న్యూస్‌టుడే, చేర్యాల
ఆరోగ్యమే పరమావధిగా..
అమెరికాలో స్థిరపడిన వైద్యురాలు రేణుకారెడ్డి పుట్టిన ఊరైన వికారాబాద్ పట్టణ పరిధి కొంపల్లిని మరువకుండా ప్రతి ఏటా గ్రామానికి వస్తుంటారు. వచ్చిన ప్రతి సారి గ్రామస్థులందరినీ కలిసి వారి ఆరోగ్య సమస్యలు తెలుసుకుని సూచనలు, సలహాలను అందజేస్తుంది. అవసరమైన వారికి ఉచితంగా మందులు అందిస్తూ వారి ఆరోగ్యానికి సహకరిస్తున్నారు. అంతే కాకుండా గ్రామంలోని బడికి అవసరమైన బల్లలు, కుర్చీలు, విద్యార్థులకు పుస్తకాలు, దుస్తులు, బూట్లు, తదితర వస్తువులు అందించి తనవంతు సాయం చేస్తున్నారు. ఐదేళ్లుగా స్వాతంత్య్ర దినోత్సవం కంటే ముందు రోజు కచ్చితంగా గ్రామానికి వస్తున్నారు. స్వాతంత్య్ర దినోత్సవం రోజున విద్యార్థులకు అవసరమైన విద్యాసామగ్రి పంపిణీ చేస్తున్నారు.
- న్యూస్‌టుడే, వికారాబాద్ మున్సిపాలిటీ
నిరుపేదలకు భరోసా కల్పిస్తూ..
వికారాబాద్ జిల్లా తాండూరు మండలంలోని కుగ్రామం మిట్టబాస్పల్లికి చెందిన రవిశంకర్పటేల్ తన సంపాదనలో కొంత భాగాన్ని పేదలు, క్రీడాకారులు, పాఠశాలల అభివృద్ధికి వితరణ అందిస్తూ సేవా దృక్పథాన్ని చాటుకుంటున్నారు. 20 ఏళ్ల కిందట అమెరికాలో అడుగు పెట్టిన ఈయన సాఫ్ట్వేర్ కంపెనీని స్థాపించి అక్కడే స్థిరపడ్డారు. వందలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పిస్తున్నారు. తాండూరులో విద్యాభ్యాసం చేసిన రవిశంకర్ నియోజకవర్గంలోని పేద పిల్లలకు ఏదైనా చేయాలని సంకల్పించుకున్నారు. ఇందుకు రవిశంకర్ పటేల్ ఛారిటబుల్ ట్రస్ట్ నెలకొల్సి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. చదువుకునేందుకు వీలుగా సహకారం అందించడంతో పాటు జిల్లా స్థాయి క్రీడా పోటీల్లో ప్రతిభ చూపి రాష్ట్ర స్థాయికి వెళ్లాలంటే ఖర్చులు భరించలేని వారికి అండగా నిలుస్తున్నారు. యాలాల, అగ్గనూరు, మిట్టబాస్పల్లి, తాండూరు, మారెపల్లి తదితర గ్రామాల్లోని పాఠశాలల విద్యార్థులకు భరోసా కల్పిస్తున్నారు. అలాగే పలు పల్లెల్లో తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయాన్ని తెలుసుకుని బోర్లు వేయించి వారి దాహం తీర్చేందుకు కృషి చేశారు. నిరుపేదల ఆర్థిక పరిస్థితిపై పూర్తి అవగాహన ఉంది.. వారికి సాయం చేసినప్పుడే కలిగే తృప్తికి వెలకట్టలేమంటారు ఈ ప్రవాస భారతీయుడు.
- న్యూస్‌టుడే, తాండూరు
బడి బాగుకు కదిలొచ్చి..
పెద్దశంకరంపేటకు చెందిన కొమ్మ మల్లికార్జున్‌గుప్త అమెరికాలోని చికాగోలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ వృత్తిరీత్యా స్థిరపడ్డాడు. పేటలోని సరస్వతి శిశుమందిర్‌లో 1981-82 విద్యా సంవత్సరంలో ఒకటోతరగతిలో చేరి ఐదో తరగతి వరకు విధ్యాభ్యాసం పూర్తి చేశాడు. తర్వాత జవహార్ నవోదయ పాఠశాలలో మొదటి బ్యాచ్‌లో 1986లో చేరి నేడు ఉన్నత స్థాయి వరకు ఎదిగాడు. మల్లికార్జున్ దంపతులిద్దరూ చికాగోలో సాఫ్ట్‌వేర్‌గా పనిచేస్తున్నారు. గత కొన్నేళ్ల క్రితం మల్లికార్జున్ సెలవు స్వగ్రామానికి వచ్చినప్పుడు తాను చదువుకున్న సరస్వతి శిశుమందిరాన్ని సందర్శించారు. ఈసందర్భంగా తాను చిన్ననాడు చదువుకున్న పాఠశాలను సందర్శించి అప్పుడు పాత పెంకటిల్లులో కొనసాగిన తరగుతులు నేడు పక్కా భవనాలలో కొనసాగుతున్నాయి. గదుల నిర్మాణాలు దాతల సహకారంతో నిర్మించినవేనని పాఠశాల సిబ్బంది ఆయనకు తెలిపారు. రెండు గదులు అసంపూర్తిగా ఉండటాన్ని చూసి ఈ రెండు గదుల నిర్మాణానికి తనవంతు ఆర్థిక సహాయాన్ని అందించి నిర్మించేందుకు చేయూతనందించాడు.
- న్యూస్‌టుడే, పెద్దశంకరంపేట