Green Card: గ్రీన్‌కార్డుల్లో కోటా ఎత్తివేత!

అమెరికాలో శాశ్వత నివాస హోదా కల్పించే గ్రీన్‌కార్డు కోసం ఎదురుచూస్తున్న భారతీయులకు శుభవార్త! ఈ కార్డుల జారీ ప్రక్రియలో దేశాలవారీగా ఉన్న కోటాను ఎత్తివేయడానికి ఉద్దేశించిన బిల్లుపై కీలక ముందడుగు పడింది. అమెరికా కాంగ్రెస్‌కు చెందిన న్యాయ కమిటీ 22-14 మెజార్టీతో దాన్ని ఆమోదించింది. దీంతో- ‘ఈక్వల్‌ యాక్సెస్‌ టు గ్రీన్‌కార్డ్స్‌ ఫర్‌ లీగల్‌ ఎంప్లాయ్‌మెంట్‌ (ఈగల్‌)’గా పిలుస్తున్న ఈ బిల్లుపై ప్రతినిధుల సభలో చర్చ జరిగేందుకు మార్గం సుగమమైంది. కుటుంబ ఆధారిత

Updated : 09 Apr 2022 06:43 IST

దేశాలవారీ పరిమితి తొలగింపులో ముందడుగు
కీలక బిల్లుకు అమెరికా కాంగ్రెస్‌ న్యాయ కమిటీ ఆమోదం

వాషింగ్టన్‌: అమెరికాలో శాశ్వత నివాస హోదా కల్పించే గ్రీన్‌కార్డు కోసం ఎదురుచూస్తున్న భారతీయులకు శుభవార్త! ఈ కార్డుల జారీ ప్రక్రియలో దేశాలవారీగా ఉన్న కోటాను ఎత్తివేయడానికి ఉద్దేశించిన బిల్లుపై కీలక ముందడుగు పడింది. అమెరికా కాంగ్రెస్‌కు చెందిన న్యాయ కమిటీ 22-14 మెజార్టీతో దాన్ని ఆమోదించింది. దీంతో- ‘ఈక్వల్‌ యాక్సెస్‌ టు గ్రీన్‌కార్డ్స్‌ ఫర్‌ లీగల్‌ ఎంప్లాయ్‌మెంట్‌ (ఈగల్‌)’గా పిలుస్తున్న ఈ బిల్లుపై ప్రతినిధుల సభలో చర్చ జరిగేందుకు మార్గం సుగమమైంది. కుటుంబ ఆధారిత వీసాలకు సంబంధించి ఒక్కో దేశానికి ప్రస్తుతం 7%గా ఉన్న పరిమితిని 15%కు పెంచేలా తాజా బిల్లులో నిబంధనలను పొందుపరిచారు. గ్రీన్‌కార్డుల జారీలో ఒక్కో దేశం వాటా 7 శాతానికి మించకూడదని ప్రస్తుత నిబంధనలు స్పష్టంచేస్తున్నాయి. ఈగల్‌ బిల్లు ప్రతినిధుల సభతోపాటు సెనేట్‌లోనూ ఆమోదం పొంది చట్టరూపం దాలిస్తే.. అమెరికాలో వేలమంది భారతీయులకు ప్రయోజనం చేకూరుతుందని నిపుణులు చెబుతున్నారు.

3.8 లక్షల నిరుపయోగ వీసాలు మళ్లీ అందుబాటులోకి..

గ్రీన్‌కార్డుల కోసం విదేశీయుల నిరీక్షణ వ్యవధిని తగ్గించడంలో దోహదపడే ఓ కీలక బిల్లును కొందరు ప్రముఖ చట్టసభ్యులు ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టారు. ఇప్పటికే మంజూరైనప్పటికీ  నిరుపయోగంగా ఉన్న దాదాపు 3.8 లక్షల కుటుంబ ఆధారిత, ఉద్యోగ ఆధారిత వీసాలను (వాటి నంబర్లు) ప్రభుత్వం తిరిగి తన అధీనంలోకి తీసుకొని.. వాటిని ఇతరులకు కేటాయించేందుకు అది వీలు కల్పించనుంది.


హెచ్‌-4 వీసాదారులకు ఉద్యోగ హక్కు!

హెచ్‌-4 వీసాదారులు ప్రత్యేక అనుమతులు పొందకుండానే అమెరికాలో ఉద్యోగం చేసుకునేందుకు వీలు కల్పించే బిల్లును ఇద్దరు చట్టసభ్యులు ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టారు. అది చట్టంగా మారితే వేలమంది భారతీయులకు లబ్ధి చేకూరుతుంది. హెచ్‌-1బి, హెచ్‌-2ఎ, హెచ్‌-2బి, హెచ్‌-3 వీసాదారుల జీవిత భాగస్వాములు, పిల్లలకు హెచ్‌-4 వీసాలను మంజూరు చేస్తుంటారు.  నిబంధనల ప్రకారం వీరు ముందస్తు అనుమతి తీసుకున్న తర్వాతే అమెరికాలో ఉద్యోగం చేయాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో అగ్రరాజ్యంలో ఉద్యోగుల కొరత తీర్చడమే లక్ష్యంగా తాజా బిల్లును రూపొందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని