దాహార్తి తీర్చలేని దద్దమ్మ పాలన!

అబద్ధాల అష్టావధానంలో ఎవరికీ దక్కని నికృష్ట రికార్డు జగన్‌మోహన్‌ రెడ్డి సొంతం. చేసిన వాగ్దానాల్లో ఏ ఒక్కటీ నెరవేర్చకపోయినా అభూత కల్పనలతో సామూహిక జన వంచనకు మరోసారి సిద్ధం అంటున్న జగన్‌- రాష్ట్రానికి దాపురించిన అరిష్టం! ‘గోదారి గట్టునా తాగునీటికి కటకటే’నంటూ 2018 మే నెలలో విపక్ష నేతగా జగన్‌ ఇచ్చిన హామీల్ని, నేటి వాస్తవ స్థితిగతుల్ని పోల్చుకొంటే గుండె మండిపోతుంది.

Published : 26 Apr 2024 00:11 IST

బద్ధాల అష్టావధానంలో ఎవరికీ దక్కని నికృష్ట రికార్డు జగన్‌మోహన్‌ రెడ్డి సొంతం. చేసిన వాగ్దానాల్లో ఏ ఒక్కటీ నెరవేర్చకపోయినా అభూత కల్పనలతో సామూహిక జన వంచనకు మరోసారి సిద్ధం అంటున్న జగన్‌- రాష్ట్రానికి దాపురించిన అరిష్టం! ‘గోదారి గట్టునా తాగునీటికి కటకటే’నంటూ 2018 మే నెలలో విపక్ష నేతగా జగన్‌ ఇచ్చిన హామీల్ని, నేటి వాస్తవ స్థితిగతుల్ని పోల్చుకొంటే గుండె మండిపోతుంది. ‘కాలువల పక్కనే ప్రతి ఊళ్లో సమ్మర్‌ స్టోరేజి ట్యాంకులు నిర్మించి, కాల్వలకు నీళ్లు రాగానే వాటిలో నింపి, రక్షిత నీటి పథకాలు అమలు చేస్తాం’- అన్న వాగ్దానం చేసింది జగనే. ప్రతి ఊళ్లో మినరల్‌ వాటర్‌ ప్లాంట్‌ కట్టిస్తామన్నదీ ఆయన ఇచ్చిన హామీనే! రాష్ట్రంలో డిసెంబరు నుంచే మొదలైన నీటి ఎద్దడి నేడు భరింప శక్యం కాని స్థాయికి చేరింది. కరవు పరిస్థితులకు మండే ఎండలు తోడై జనం నాలుకలు పిడచకట్టుకుపోతుంటే, ప్రకాశం సహా రాయలసీమ వ్యాప్తంగా అయిదారు రోజులకోసారి తాగునీటి సరఫరా ప్రజల ప్రాణాలతో పరాచికాలాడుతోంది. అయిదేళ్ల కాలంలో రుణభారాన్ని రూ.11లక్షల కోట్లు దాటించి రాష్ట్ర జనావళిపై మోపిన జగన్‌కు- గ్రామాల్లో తాగునీటి సరఫరా కోసం రూ.70కోట్ల మంజూరుకు మనసొప్పడంలేదు. తాగునీటి సమస్య తీవ్రమైన చోట ట్యాంకర్ల ద్వారా సత్వర సరఫరా ప్రారంభించి, తరవాత కలెక్టర్ల నుంచి అనుమతి పొందే వెసులుబాటు గతంలో ఉండేది. వైకాపా అధికారానికి వచ్చాక ముందస్తు అనుమతిని తప్పనిసరి చేసింది. పల్లెలు పట్టణాల్లో నీటి కరవు ఇంతగా గజ్జె కట్టడానికి కారణమైన జగనన్న పాపాలు అనేకం! గతంలో నదిలోని చెలమల చెంత ఒకటి రెండడుగులకే లభించిన ఊటనీరు దాహార్తుల సేద తీర్చేది. జగన్‌ ముఠా అక్రమ ఇసుక తవ్వకాలతో జల ఛాయ 15 అడుగుల దిగువకు జారిపోయింది! ఈ ప్రకృతి విధ్వంసానికి జతపడిన జగన్‌ అసమర్థత- తాగునీటి వెతల్ని రాష్ట్రవ్యాప్తం చేసేసింది!

గత ఆగస్టు నుంచే వర్షాభావ పరిస్థితులు కమ్ముకొని కోస్తా రాయలసీమల్లో తాగునీటి సమస్య ముమ్మరిస్తున్నా జగన్‌ సర్కారు మొద్దు నిద్ర అభినయించింది. ఈ వేసవిలో 21 జిల్లాల్లోని 369 మండలాల్లో నీటి ఎద్దడి తీవ్రంగా ఉంటుందని, 3000కు పైగా ట్యాంకర్లతో గ్రామాల్లో నీటి సరఫరా సాగించాలన్న సూచనల్ని ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. ట్యాంకర్ల గుత్తేదారులకూ నిధుల్ని ఎండగట్టింది. రాష్ట్రంలో 591 రక్షిత నీటి పథకాల నిర్వహణకు నిధులివ్వకుండా వాటిని పాడుపెట్టిన పాపం జగన్‌దే! సమగ్ర రక్షిత తాగునీటి పథకాల నిర్వహణకు విద్యుత్‌ ఛార్జీలతో కలిపి అయ్యే వ్యయం ఏటా రూ.500కోట్లు! వైకాపా అధికారంలోకి వచ్చిన మూడో ఏడాది నుంచే ఆ పథకాల బాధ్యతను చేతిలో చిల్లిగవ్వ లేని జిల్లా పరిషత్తులకు బదలాయించారు. కేంద్రం ఇచ్చిన ఆర్థిక సంఘం నిధుల్నీ ఇష్టారాజ్యంగా వాడేసుకున్నారు. రూ.26,769కోట్ల అంచనా వ్యయంతో కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాల సమ భాగస్వామ్యంతో తలపెట్టిన జల్‌ జీవన్‌ మిషన్‌ది మరో విషాద గాథ! తాము ఇచ్చిన నిధుల్ని ఏపీ ప్రభుత్వం సద్వినియోగం చేసుకోలేదని, తాగునీటి విషయంలో ఏపీ పనితీరు సరిగ్గా లేదని కేంద్రం పార్లమెంటులోనే స్పష్టీకరించింది. ఇంటింటి కుళాయిలకు అవసరమైన నీటి సరఫరా కోసం జగన్‌ ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా రూ.46,675కోట్లతో వాటర్‌ గ్రిడ్‌ నిర్మాణాన్ని ప్రతిపాదించింది. దాన్ని అమలు చేసే దమ్ము లేక, తాగునీటి సమస్య తీవ్రంగా ఉన్న ఆరు జిల్లాల కోసం రూ.7910కోట్లతో ఇంకో ప్రణాళిక అల్లింది. దానికీ చేవ చాలక, తాగునీటి పథకాలకు నిధులెందుకని నీళ్లు నములుతూ చాప చుట్టేసింది. జనానికి మబ్బుల్లో నీళ్లు చూపి ముంత ఒలకబోయించిన దద్దమ్మ ప్రభుత్వమిది. దాహార్తి తీర్చే నీళ్లు కావాలో, జగన్‌ పెట్టిస్తున్న కన్నీళ్లు కావాలో... ఇక ప్రజానీకమే తేల్చుకోవాలి!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.