icon icon icon
icon icon icon

Lok Sabha Elections: సార్వత్రిక సమరం.. ప్రారంభమైన రెండో విడత పోలింగ్‌

Lok Sabha Elections: రెండో విడత లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా 88 స్థానాల్లో ఓటర్లు తమ అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చనున్నారు.

Published : 26 Apr 2024 07:14 IST

దిల్లీ: దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల (Lok Sabha Elections) రెండో దశ పోలింగ్‌ శుక్రవారం ఉదయం ప్రారంభమైంది. 13 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోని 88 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ విడతలో 89 స్థానాలకు పోలింగ్‌ జరగాల్సి ఉంది. మధ్యప్రదేశ్‌లోని బైతూల్‌లో బీఎస్పీ అభ్యర్థి హఠాన్మరణం చెందారు. అక్కడ ఓటింగ్‌ను మూడో దశకు మార్చారు.

1,202 మంది బరిలో..

రెండో విడతలో మొత్తం 15.88 కోట్ల మంది ఓటర్లు తమ అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చనున్నారు. వీరిలో 8.08 కోట్లు పురుషులు, 7.8 కోట్ల మహిళలు ఉన్నారు. మొత్తం 1.67 లక్షల పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 16 లక్షలకు పైగా పోలింగ్‌ సిబ్బంది పనిచేస్తున్నారు. వివిధ పార్టీల నుంచి 1,202 మంది బరిలో ఉన్నారు.

ఏ రాష్ట్రాల్లో ఎన్ని స్థానాలు..

కేరళలోని మొత్తం 20 లోక్‌సభ స్థానాల్లోనూ నేడే ఓటింగ్‌ పూర్తికానుంది. ఈ విడతతో రాజస్థాన్‌లో ఓటింగ్‌ పూర్తికానుంది. ఆ రాష్ట్రంలోని మొత్తం స్థానాలు 25 ఉండగా.. 12 స్థానాలకు తొలి దశలోనే పోలింగ్‌ ముగిసింది.  కర్ణాటక 14, ఉత్తర్‌ప్రదేశ్‌ 8, మహారాష్ట్ర 8, మధ్యప్రదేశ్‌ 6, బిహార్‌ 5, అస్సాం 5, పశ్చిమ బెంగాల్‌ 3, ఛత్తీస్‌గఢ్‌ 3, జమ్మూకశ్మీర్‌ 1, మణిపుర్‌ 1, త్రిపుర 1 స్థానాల్లో నేడు పోలింగ్‌ జరుగుతోంది.

బరిలో ప్రముఖులు..

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ (వయనాడ్‌) ఈ దశలోనే బరిలో ఉన్నారు. 2014 నుంచి మథురా నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న హేమామాలిని.. ప్రస్తుతం అక్కడ హ్యాట్రిక్‌ విజయంపై గురిపెట్టారు. హ్యాట్రిక్‌ విజయాల కోసం లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా (కోటా-బూందీ), కేంద్రమంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ (జోధ్‌పుర్‌) ప్రయత్నిస్తున్నారు. ఛత్తీస్‌గఢ్‌లో 30 ఏళ్లుగా భాజపాకు కంచుకోటగా ఉన్న రాజ్‌నంద్‌గావ్‌ స్థానంలో ఈసారి కాంగ్రెస్‌ అభ్యర్థిగా మాజీ సీఎం భూపేశ్‌ బఘేల్‌ బరిలో దిగారు. కాంగ్రెస్‌ నేత శశిథరూర్‌, కేంద్రమంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ తలపడుతోన్న తిరువనంతపురంలోనూ నేడే పోలింగ్‌ జరుగుతోంది. వీరితో పాటు భాజపా తరఫున అరుణ్‌ గోవిల్‌ (మేరఠ్‌), తేజస్వీ సూర్య (బెంగళూరు దక్షిణం) బరిలో ఉన్నారు. కాంగ్రెస్‌ నేత కేసీ వేణుగోపాల్‌ (అలప్పుళ) భవితవ్యాన్ని ఓటర్లు ఈరోజే నిక్షిప్తం చేయనున్నారు.

2019లో ఇలా..

రెండో విడతలోని 88 నియోజకవర్గాల్లో.. 2019లో 52 స్థానాలను భాజపా, 12 సీట్లను ప్రస్తుత దాని మిత్రపక్షాలు గెలుచుకున్నాయి. ఇప్పుడు ఇండియా కూటమిలో భాగస్వామ్య పక్షాలుగా ఉన్న పార్టీలు నాడు వీటిలో 23 నియోజకవర్గాలను దక్కించుకున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img