Politics: భాజపాకు భారీ విజయం ఖాయమే.. కానీ : సుబ్రహ్మణ్యస్వామి

వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో (Lok Sabha Elections) భాజపాకు భారీ విజయం ఖాయమని, హిందుత్వ అంశం వారికి కలిసి వచ్చే అవకాశముందని భాజపా సీనియర్‌ నేత సుబ్రహ్మణ్య స్వామి (Subramanian Swamy) పేర్కొన్నారు.

Published : 25 Feb 2024 22:17 IST

పట్నా: భాజపా సీనియర్‌ నేత సుబ్రహ్మణ్య స్వామి (Subramanian Swamy) కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో (Lok Sabha Elections) భాజపాకు భారీ విజయం ఖాయమని, హిందుత్వ అంశం వారికి కలిసి వచ్చే అవకాశముందన్నారు. అయితే, ఇందులో మోదీ (Narendra Modi) మ్యాజిక్‌ మాత్రం ఏదీ లేదన్నారు. పట్నాలో నిర్వహించిన ‘లా కాంక్లేవ్‌’లో మాట్లాడిన ఆయన.. భాజపాతోపాటు ఆర్‌ఎస్‌ఎస్‌లో వ్యక్తుల కంటే సంస్థకే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుందన్నారు.

‘‘గత ఎన్నికల ఫలితాలను భాజపా అధిగమిస్తుందని విశ్వసిస్తున్నా. ఎందుకంటే.. తొలిసారిగా హిందువులు తమ గుర్తింపు గురించి గర్వపడుతున్నారు. నెహ్రూ హయాంలో ఉన్న అభద్రతాభావం ఇప్పుడు కనిపించడం లేదు. ఈ మార్పు తమ వల్లే అని కొందరు భావిస్తుండవచ్చు. అటువంటి వాటికి ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం లేదు. మోదీ మ్యాజిక్‌ వంటిదేమీ ఉందనుకోవడం లేదు. భాజపా-ఆర్‌ఎస్‌ఎస్‌లలో వ్యక్తులకు పెద్దపీట ఉండదు. అది కాంగ్రెస్‌ సంప్రదాయం’ అని సుబ్రహ్మణ్య స్వామి పేర్కొన్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీ 370కిపైగా స్థానాల్లో గెలుస్తుందని, ఎన్డీయేకు 400లకుపైగా సీట్లు వస్తాయని ప్రధాని మోదీ ధీమా వ్యక్తం చేస్తుండటంపై విలేకరులు అడిగిన ప్రశ్నకు స్వామి ఇలా స్పందించారు.

బిహార్‌ ముఖ్యమంత్రి నీతీశ్‌ కుమార్‌ ఇటీవల ఎన్డీయేలో చేరడాన్ని సుబ్రహ్మణ్యస్వామి స్వాగతించారు. అయితే, గతంలో ఆయన కూటమి నుంచి ఎందుకు బయటకు వెళ్లారో తనకు ఇప్పటికీ అర్థం కాలేదన్నారు. వచ్చే ఎన్నికల్లో భాజపాను ఎదుర్కొనేందుకు ప్రయత్నాలు చేస్తున్న రాహుల్‌ గాంధీపై విమర్శలు గుప్పించిన ఆయన.. నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో వాళ్లు (రాహుల్‌ కుటుంబాన్ని ఉద్దేశిస్తూ) జైలుకు వెళ్లేలా చూస్తానని చెప్పడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని