CM KCR: మళ్లీ అధికారం మాదే.. గతంలో కంటే 7, 8 సీట్లు ఎక్కువే: కేసీఆర్

తెలంగాణలో మళ్లీ అధికారం తమదేనని, ప్రస్తుతం కంటే మరో 7..8 సీట్లు ఎక్కువగానే వస్తాయని సీఎం కేసీఆర్‌ ధీమా వ్యక్తం చేశారు.

Updated : 06 Aug 2023 17:41 IST

హైదరాబాద్‌: తెలంగాణలో మళ్లీ అధికారం తమదేనని, ప్రస్తుతం కంటే మరో 7, 8 సీట్లు ఎక్కువగానే వస్తాయని సీఎం కేసీఆర్‌ ధీమా వ్యక్తం చేశారు. వర్షాకాల అసెంబ్లీ సమావేశాల చివరి రోజు సభలో రాష్ట్ర ఆవిర్భావం- సాధించిన ప్రగతిపై స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. తొమ్మిదేళ్ల తెలంగాణ ప్రగతి ప్రస్థానం గురించి వివరించారు. సాగు నీరు, తాగునీరు, వ్యవసాయం సహా  వివిధ అంశాలపై సుదీర్ఘంగా ప్రసంగించారు. నెల రోజుల్లో రైతు రుణమాఫీ పూర్తి చేస్తామని ప్రకటించారు. నియామక పరీక్షలు దశల వారీగా నిర్వహిస్తామని, గ్రూప్‌-2, ఇతర పరీక్షలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సీఎస్‌కు సూచించామని వెల్లడించారు. 

దేశం ఆశ్చర్యపోయేలా ఉద్యోగులకు పేస్కేలు ఇస్తాం 

‘‘మజ్లీస్‌ పార్టీ మాకు ఎప్పుడైనా మిత్ర పక్షమే. భవిష్యత్‌లోనూ మజ్లిస్‌ను కలుపుకొని పోతాం. బ్రాహ్మణులకైనా, మైనార్టీలకైనా బహిరంగంగానే మంచి చేస్తాం. అలవికాని హామీలను మేం ఎప్పుడూ ఇవ్వము. భారాస ఎప్పుడూ లౌకికవాద పార్టీయే. అన్నీ ఉచితంగా ఇస్తున్నామని తెలంగాణను భాజపా విమర్శించింది. అదే భాజపా కర్ణాటక ఎన్నికల్లో ఎన్నో ఉచితాల హామీలు ప్రకటించింది. మా అమ్ముల పొదిలో కూడా చాలా అస్త్రాలు ఉన్నాయి. మేం అస్త్రాలు తీసినప్పుడు విపక్షాలు గాలిలో కొట్టుకుపోతాయి. సమయం వచ్చినప్పుడు మేం కూడా పింఛన్లు పెంచుతాం. ఇప్పుడు కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో రూ.4వేల పింఛను ఇవ్వట్లేదు. ఆర్థిక వనరులు సమకూరగానే మళ్లీ ఉద్యోగుల జీతాలు పెంచుతాం. దేశం ఆశ్చర్యపోయేలా ఉద్యోగులకు పేస్కేలు ఇస్తాం. అతి త్వరలోనే ఉద్యోగులకు ఐఆర్‌ ప్రకటిస్తాం. ఉద్యోగస్తులు కూడా మా పిల్లలే. ప్రపంచమంతా ప్రభావం చూపేలా హైదరాబాద్‌ స్థిరాస్తి రంగం పెరుగుతోంది. హైదరాబాద్‌కు ప్రపంచస్థాయి స్థిరాస్తి కంపెనీలు వస్తున్నాయి. తెలంగాణ ఐటీ ఎగుమతులు రూ.2.47 లక్షల కోట్లకు పెరిగాయి. రాబోయే రోజుల్లో ఎన్ని పథకాల నిధులు పెంచాలో అన్నీ పెంచుతాం’’ అని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు.

తెలంగాణకు రూపాయి ఇవ్వని కేంద్రం.. అవార్డులు మాత్రం ఇచ్చింది

‘‘ప్రజల నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ప్రతి ఇంటికి 20వేల లీటర్ల మంచినీరు ఇస్తున్నాం. గ్రావిటీతోనే వేలాది గ్రామాల్లో ఇంటింటికీ తాగునీరు ఇస్తున్నాం. పల్లెలు, పట్టణాల్లో రపాయికే నల్లా కనెక్షన్‌ ఇస్తున్నాం. 13 రాష్ట్రాలు, కొన్ని దేశాల ప్రతినిధులు వచ్చి మన మిషన్‌ భగీరథను అధ్యయనం చేస్తున్నాయి. పారిశుద్ధ్యం, మంచినీరు విషయంలో కేంద్రం ఎన్నో అవార్డులు ఇచ్చింది. తెలంగాణకు రూపాయి ఇవ్వని కేంద్రం అవార్డులు మాత్రం బాగానే ఇచ్చింది. తండాలు, గిరిజన ఆవాసాల్లో రోగాలు కనిపిస్తున్నాయా ఇప్పుడు? దేశంలోనే వీధి నల్లాలు లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ. కాంగ్రెస్‌ పాలనలో రాష్ట్రంలో 35వేల చెరువులు అదృశ్యమయ్యాయి.

తెలంగాణ ఏర్పాటుకు ముందే మిషన్‌ భగీరథ పేరు..

తెలంగాణ వస్తే పునర్నిర్మాణం ఎక్కడ మొదలు పెట్టాలని చాలా పర్యాయాలు చర్చలు జరిపాయం. ఆచార్య జయశంకర్‌, విద్యాసాగర్‌రావుతో చర్చించాం. తెలంగాణ వస్తే ముందుగా చెరువులు బాగు చేసుకోవాలని నిర్ణయించాం. రాష్ట్ర ఏర్పాటుకు 5..6 నెలల ముందే మిషన్‌ భగీరథ అని పేరు పెట్టాలని భావించాం. మిషన్‌ కాకతీయ పుణ్యమే 30లక్షల బోర్లు నీళ్లు పోస్తున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాగ్రెస్‌ నేతలు విమర్శలు చేస్తున్నారు. కాళేశ్వరం నుంచే తుంగతుర్తి, కోదాడ, డోర్నకల్‌కు నీళ్లు వెళ్తున్నాయి. కృష్ణా ప్రాజెక్టులకు నీళ్లు రాకుంటే కాళేశ్వరం నుంచి తీసుకొనేలా ప్రణాళికలు చేశాం. దేశంలోనే అత్యుత్తమ పునరావాసాలు నిర్మించింది తెలంగాణ. మన పునరావాస గ్రామాలు చూసి కేంద్ర బృందాలు ప్రశంసించాయి. కాలువల్లో ఏడాది పొడుగునా నీళ్లు పారుతున్నాయి. కరీంనగర్‌ జిల్లాలో 4 సజీవ జలధారలు కాళేశ్వరం వల్లే పారుతున్నాయి.

బండి పోతే బండి.. గుండు పోతే గుండు ఇస్తామన్న వ్యక్తి జాడ లేదు..

వరదల వల్ల నష్టపోయిన వారిని కాపాడుకుంటాం. హైదరాబాద్‌లో తీవ్ర నష్టం జరిగితే కేంద్రం ఒక్క రూపాయి ఇవ్వలేదు. వరదల్లో బండి పోతే బండి ఇస్తాం, గుండు పోతే గుండు ఇస్తాం అన్న వ్యక్తి జాడ లేదు. 7 లక్షల టన్నుల యూరియా వాడే తెలంగాణ ఇవాళ 27లక్షల టన్నులు వాడుతోంది. మళ్లీ కాంగ్రెస్‌ వస్తే కరెంటు, రైతు బంధు పోతాయని ప్రజలు భయపడుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మిస్తుంటే 420 కేసులు వేశారు. ధాన్యం దిగుమతిలో పంజాబ్‌ను తెలంగాణ అధిగమిస్తోంది. తొలినాళ్లలోనే 30-40లక్షల టన్నుల సామర్థ్యం గల గోదాములు నిర్మించాం. తెలంగాణ గోదాముల్లో ప్రస్తుతం కోటి టన్నులు ధాన్యం ఉంది. వేలం ద్వారా విక్రయించాలని పౌరసరఫరాల శాఖ మంత్రిని ఆదేశించా. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టకపోతే ఎఫ్‌ఆర్‌బీఎంలో కేంద్రం కోత విధించింది. దీంతో ఏటా రూ.5వేల కోట్లు నష్టపోతున్నాయం. కేంద్రం వైఖరి వల్ల ఐదేళ్లలో రూ.25వేల కోట్లు నష్టపోయాం. ధరణి పుణ్యమా అని 10 నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్లు పూర్తవుతున్నాయి. రైతు చనిపోయిన వారంలోనే ఆ కుటుంబానికి రూ.5లక్షలు వస్తున్నాయి’’ అని సీఎం కేసీఆర్‌ వివరించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని