Shivraj Singh Chouhan: సోనియా కూడా రాజ్యసభ రూట్‌లో.. ఇదీ కాంగ్రెస్‌ దుస్థితి: చౌహాన్‌ విమర్శలు

సోనియా గాంధీ సైతం రాజ్యసభ రూట్‌ ఎంచుకున్నారని.. కాంగ్రెస్‌ పరిస్థితి ఇదీ.. అంటూ విమర్శలు చేశారు భాజపా సీనియర్‌ నేత శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌.

Published : 18 Mar 2024 00:06 IST

భోపాల్‌: కాంగ్రెస్‌ పార్టీ (Congress) పరిస్థితి దయనీయంగా మారిందని మధ్యప్రదేశ్ మాజీ సీఎం, భాజపా నేత శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ (Shivraj Singh Chouhan) విమర్శించారు.  చివరకు ఆ పార్టీ అగ్రనాయకురాలు సోనియా గాంధీ (Sonia Gandhi) కూడా లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి బదులు రాజ్యసభ రూటును ఎంచుకున్నారన్నారు.  రాహుల్‌ గాంధీ నిర్ణయాలు పూర్తి గందరగోళంగా ఉంటాయని ఆక్షేపించిన ఆయన.. కాంగ్రెస్‌కు లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి అభ్యర్థులే లేరన్నారు. ఈ ఎన్నికల్లో భారీ మెజార్టీతో భాజపా గెలవబోతోందని విశ్వాసం వ్యక్తం చేశారు. భోపాల్‌లో శివరాజ్‌ సింగ్‌ మీడియాతో మాట్లాడారు. రాహుల్‌ గాంధీ.. ఎప్పుడేం చేయాలో తెలియని కెప్టెన్‌ అని ఎద్దేవా చేశారు. ఎన్నికలకు సిద్ధమవుతున్నప్పుడు యాత్రలకు వెళ్తారని.. యాత్రలకు వెళ్లాల్సిన సమయంలో విదేశాలకు వెళ్తారన్నారు.  ఎన్నికల్లో ఓడిపోతే ఈవీఎంలపై విమర్శలు చేస్తుంటారని విమర్శించారు. 

వికసిత భారత్‌ మాత్రమే కాదు.. వికసిత ఆంధ్రప్రదేశ్‌ మా లక్ష్యం: మోదీ

కాంగ్రెస్‌ దుస్థితి చూసి ఆలోచనలో పడుతున్న నేతలు ఆ పార్టీని వీడుతున్నారని.. వరుస ఓటమిలతో  ఆ పార్టీ పరిస్థితి మరీ దారణంగా ఉండటంతో చివరకు సోనియా గాంధీ సైతం ఎన్నికల్లో పోటీ చేయకుండా రాజ్యసభ ద్వారా పార్లమెంట్‌లో అడుగు పెట్టాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. కాంగ్రెస్ మునిగిపోతున్న పడవ అన్నారు. రాహుల్ ఎక్కడికి వెళ్లినా తన సొంత పార్టీనే కాకుండా విపక్ష ‘ఇండియా’ కూటమి భాగస్వాములైన అఖిలేశ్‌ యాదవ్, తేజస్వి యాదవ్, అరవింద్ కేజ్రీవాల్ వంటి వారిని కూడా దెబ్బతీస్తున్నారన్నారు.  తాను 10 రాష్ట్రాలను సందర్శించానని.. ఎక్కడ చూసినా ప్రజలు భాజపాకు చారిత్రక తీర్పు ఇచ్చి మూడోసారి నరేంద్ర మోదీని ప్రధానిగా చేయాలన్న ఆసక్తితో ఉన్నారని శివరాజ్‌ సింగ్‌ చెప్పారు. శివరాజ్‌ సింగ్‌ ప్రస్తుతం విదిశ లోక్‌సభ స్థానం నుంచి బరిలో నిలుస్తున్న విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని