GST Collections: జీఎస్‌టీ చరిత్రలో రికార్డు వసూళ్లు.. ఒక్క నెలలో రూ.2.10 లక్షల కోట్లు!

GST Collections: ఏప్రిల్‌లో వసూలైన రూ.2.10 లక్షల కోట్లలో సీజీఎస్‌టీ రూ.43,846 కోట్లు, ఎస్‌జీఎస్‌టీ రూ.53,538 కోట్లు, ఐజీఎస్‌టీ రూ.99,623 కోట్లుగా నమోదైంది.

Updated : 01 May 2024 13:40 IST

దిల్లీ: ఏప్రిల్‌లో స్థూల జీఎస్‌టీ వసూళ్లు (GST Collections) రికార్డు గరిష్ఠానికి చేరాయి. ఏడాది క్రితంతో పోలిస్తే 12.4% పెరిగి రూ.2.10 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. దేశీయంగా లావాదేవీలు 13.4% పెరగడం ఇందుకు కలిసొచ్చిందని ఆర్థిక మంత్రిత్వ శాఖ బుధవారం వెల్లడించింది. 2017 జులైలో జీఎస్‌టీ విధానం అమల్లోకి వచ్చాక, నెలవారీ వసూళ్లకు సంబంధించి ఇదే అత్యధిక మొత్తం కావడం గమనార్హం. 2023 ఏప్రిల్‌ నాటి రూ.1.87 లక్షల కోట్లే.. ఇప్పటివరకు రికార్డుగా ఉంది. ఈ ఏడాది మార్చిలో జీఎస్‌టీ వసూళ్లు రూ.1.78 లక్షల కోట్లుగా నమోదైన సంగతి తెలిసిందే. రిఫండ్ల తర్వాత 2024 ఏప్రిల్‌లో నికర జీఎస్‌టీ రెవెన్యూ వార్షిక ప్రాతిపదికన 17.1 శాతం పెరిగి రూ.1.92 లక్షల కోట్లుగా నమోదైంది. 

ఏప్రిల్‌లో వసూలైన (GST Collections) రూ.2.10 లక్షల కోట్లలో సీజీఎస్‌టీ రూ.43,846 కోట్లు, ఎస్‌జీఎస్‌టీ రూ.53,538 కోట్లు, ఐజీఎస్‌టీ రూ.99,623 కోట్లుగా (దిగుమతులపై వసూలు చేసిన రూ.37,826 కోట్లతో కలిపి) నమోదైంది. సెస్సు వసూళ్లు రూ.13,260 కోట్లుగా ఉన్నాయి. ఐజీఎస్‌టీ నుంచి సీజీఎస్‌టీ కింద రూ.50,307 కోట్లు; ఎస్‌జీఎస్‌టీ కింద రూ.41,600 కోట్ల చొప్పున ప్రభుత్వం కేటాయించింది. ఈ సర్దుబాటు అనంతరం ఏప్రిల్‌లో కేంద్ర, రాష్ట్రాల మొత్తం జీఎస్‌టీ ఆదాయం వరుసగా రూ.94,153కోట్లు; రూ.95,138 కోట్లుగా లెక్కతేలింది.

జీఎస్‌టీ నెలవారీ వసూళ్లలో టాప్‌-5

  • 2024 ఏప్రిల్‌ - రూ.2.10 లక్షల కోట్లు
  • 2023 ఏప్రిల్‌ - రూ.1.87 లక్షల కోట్లు
  • 2024 మార్చి - రూ.1.78 లక్షల కోట్లు
  • 2024 జనవరి - రూ.1.74 లక్షల కోట్లు
  • 2023 అక్టోబరు - రూ.1.72 లక్షల కోట్లు
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని