Karnataka: ‘ఖర్గే హత్యకు భాజపా కుట్ర’.. ఆడియో క్లిప్‌ రిలీజ్‌ చేసిన కాంగ్రెస్‌

Karnataka Elections: కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హత్యకు భాజపా కుట్ర పన్నిందని ఆ పార్టీ ఆరోపించింది. సంబంధిత ఆడియో క్లిప్‌ను విడుదల చేసింది.

Updated : 06 May 2023 15:11 IST

బెంగళూరు: ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ కర్ణాటక (Karnataka Elections) రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి. తాజాగా కాంగ్రెస్‌ పార్టీ (Congress) విడుదల చేసిన ఓ ఆడియో క్లిప్‌ మరోసారి కలకలం రేపింది. కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను (Mallikarjun Kharge) హతమార్చేందుకు భాజపా (BJP) అభ్యర్థి కుట్ర పన్నారంటూ ఆ పార్టీ ఆరోపించింది. సంబంధిత ఆడియోను పార్టీ ప్రధాన కార్యదర్శి రణ్‌దీప్‌ సూర్జేవాలా విడుదల చేశారు. ఈ ఆరోపణలను భాజపా తిప్పికొట్టింది.

కర్ణాటకలోని కలబురగి జిల్లా చిత్తాపూర్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న భాజపా అభ్యర్థి మణికంఠ రాథోడ్‌ మాట్లాడినట్లుగా ఉన్న ఆడియోను సూర్జేవాలా విలేకరుల సమావేశంలో వినిపించారు. ‘ఖర్గేతో పాటు ఆయన భార్య, పిల్లలను కూడా అంతమొందిస్తా’ అని రాథోడ్‌ కన్నడలో అన్నట్లుగా ఆడియో ఉంది. దీనిపై సూర్జేవాలా మాట్లాడుతూ ఎన్నికల్లో ఓటమి భయంతో హత్యకు సైతం భాజపా నేతలు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. 

కన్నడ ప్రజలు కాంగ్రెస్‌పై చూపుతున్న అభిమానాన్ని జీర్ణించుకోలేక చివరికి హత్యా రాజకీయాలకు సైతం భాజపా తెరలేపిందని సూర్జేవాలా ఆరోపించారు. రాథోడ్‌కు ప్రధాని మోదీ, సీఎం బసవరాజ్‌ బొమ్మై అండదండలు కూడా ఉన్నాయని అన్నారు. తనపై కాంగ్రెస్‌ చేసిన ఆరోపణలను రాథోడ్‌ ఖండించారు. కాంగ్రెస్‌ చెప్తున్నవన్నీ అబద్ధమని, అది ఓ ఫేక్‌ ఆడియోగా కొట్టిపారేశారు. ఓటమి భయంతోనే లేని అభాండాలు మోపుతున్నారని ఆరోపించారు. చిత్తాపూర్‌ నియోజకవర్గం నుంచి ఖర్గే తనయుడు ప్రియాంక్‌ ఖర్గే పోటీ చేస్తుండగా.. ఆయనపై 26 ఏళ్ల మణికంఠ రాథోడ్‌ను భాజపా బరిలో నిలిపింది. మే 10న కర్ణాటకలోని అన్ని స్థానాలకు పోలింగ్‌ జరగనుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని