ఆ రైతులను నమ్మించి గొంతుకోశారు: పవన్‌

రాజధాని ఎక్కడ ఉండాలన్నది రాష్ట్రం ఇష్టమేననీ.. ఆ విషయంతో తానూ ఏకీభవిస్తానని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. కానీ, ...

Updated : 15 Feb 2020 16:08 IST

రాయపూడి: రాజధాని ఎక్కడ ఉండాలన్నది రాష్ట్రం ఇష్టమేననీ.. ఆ విషయంతో తానూ ఏకీభవిస్తానని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. కానీ, అమరావతినే రాజధానిగా గతంలో అందరూ అంగీకరించి.. ఇప్పుడు మార్చడం సరికాదన్నారు. ఇష్టానుసారం నిర్ణయాలను మార్చుకోవడమేంటని ఆగ్రహం వ్యక్తంచేశారు. రాజధాని రైతులను సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి నమ్మించి గొంతు కోశారని మండిపడ్డారు. రాజధాని అమరావతిలోనే ఉండేలా పోరాటం చేస్తానన్నారు. శనివారం ఆయన అమరావతి రాజధాని ప్రాంతంలోని రాయపూడి రైతుల ఉద్యమానికి సంఘీభావం తెలిపారు. అనంతరం పవన్‌ మాట్లాడుతూ.. ‘‘రాజధానికి భూములు ఇచ్చిన రైతుల త్యాగం వెలకట్టలేనిది. రాష్ట్ర భవిష్యత్తు కోసమే రైతులు భూములిచ్చారు. రాజధానికి భూములు ఇచ్చిన రైతుల త్యాగం వెలకట్టలేనిది. రాష్ట్రానికి అమరావతే రాజధాని అని నిర్ణయం తీసేసుకున్నాం. అది అయిపోయింది. ఇప్పుడు మార్చడానికి లేదు. 151 మంది ఎమ్మెల్యేలు మార్చుకుంటాం.. 13 రాజధానులు.. 13 ముక్కలు.. 33 ముక్కలు చేస్తామంటే కుదరదు. ఇది ప్రజాస్వామ్యం.. తమ ఇష్టానికి చేసుకోవడం కుదరదు’’ అని వ్యాఖ్యానించారు. 

వైకాపా నేతలకు క్విడ్‌ప్రోకో అలవాటే!

‘‘రాజధాని తరలింపు అంశాన్ని జగన్‌ ఎన్నికల ముందే చెప్పి ఉండాల్సింది. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ చేసిన వాళ్లను కావాలంటే శిక్షించండి. ప్రజలను రోడ్లమీదకు తీసుకొచ్చి ఇబ్బంది పెట్టేవి అసలు పార్టీలే కాదు. రాష్ట్ర ప్రజల భవిష్యత్తుతో ఆడుకోవద్దు. నాలుగైదు భవనాలు కట్టినంత మాత్రాన అభివృద్ధి కాదు. వైకాపా నేతలకు క్విడ్‌ప్రోకో అలవాటే. రైతులు తెదేపాకు భూములు ఇవ్వలేదు.. ప్రభుత్వానికి ఇచ్చారు. రాయలసీమ, ఉత్తరాంధ్రాల సమగ్ర అభివృద్ధిని కోరుకుంటున్నా. ఒక్క కోర్టు వచ్చినంత మాత్రాన అభివృద్ధి జరగదు’’

పెన్ను పోటుతో రాజధాని మార్పు!
‘‘విశాఖలో మళ్లీ భూసమీకరణ చేస్తున్నారు. అక్కడి రైతులు భూసమీకరణను గట్టిగా వ్యతిరేకిస్తున్నారు. ఇక్కడ ఇన్ని వేల ఎకరాలు ఉంటే విశాఖలో మళ్లీ భూ సమీకరణ ఎందుకు? ప్రభుత్వం వ్యాపారం చేస్తున్నట్లు ఉంది. వైకాపా నాయకుల నవరత్నాల పందేరానికి భూములు ఇవ్వలేదు. ఇక్కడ చాలా రోజులుగా కులమతాలకతీతంగా రైతులు దీక్షలు చేస్తున్నారు. ఇది కేవలం ఒక సామాజిక వర్గానికి చెందినది కాదు. రైతులు నిజంగా త్యాగం చేసి భూములు ఇచ్చారు. తెదేపాతో మీకు గొడవ ఉంటే వారితో పెట్టుకోండి.. కానీ, రాజధాని మార్పు తగదు. పెన్నుపోటుతో రాజధాని మార్పు చేస్తున్నారు. 40 మందికి పైగా రైతులు చనిపోయారు.. ఇవి ప్రభుత్వ హత్యలే. అహంకారం తలకెక్కి నిర్ణయాలు తీసుకుంటే మంచిది కాదు. అమరావతి రైతుల ఉద్యమానికినా మద్దతు ఎప్పటికీ ఉంటుంది’’ అని పవన్‌ అన్నారు. 

ఫొటో గ్యాలరీ కోసం క్లిక్‌ చేయండి...


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని