మధ్యప్రదేశ్ పరిణామాలు.. సుప్రీంకు భాజపా

కేంద్ర మాజీమంత్రి జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్‌కు రాజీనామా చేసి భాజపాలో చేరడంతో మధ్యప్రదేశ్‌లో నెలకొన్న రాజకీయ అనిశ్చితి నాటకీయ పరిణామాల మధ్య కొనసాగుతోంది...........

Updated : 16 Mar 2020 16:12 IST

దిల్లీ: కేంద్ర మాజీమంత్రి జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్‌కు రాజీనామా చేసి భాజపాలో చేరడంతో మధ్యప్రదేశ్‌లో నెలకొన్న రాజకీయ అనిశ్చితి నాటకీయ పరిణామాల మధ్య కొనసాగుతోంది. రాష్ట్ర గవర్నర్‌ లాల్జీ టాండన్‌ ఆదేశాల నేపథ్యంలో కమల్‌నాథ్‌ ప్రభుత్వానికి సోమవారం బలపరీక్ష జరుగుతుందని అంతా భావించినా అలా జరగకపోవడంపై భాజపా ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 12గంటల సమయం లోపు కమల్‌నాథ్‌ ప్రభుత్వం బలపరీక్ష ప్రక్రియను పూర్తిచేసేలా ఆదేశాలు జారీచేయాలని విజ్ఞప్తి చేశారు. సుప్రీంను ఆశ్రయించిన వారిలో భాజపా సీనియర్‌ నేత శివరాజ్‌సింగ్ చౌహాన్‌తో పాటు 10మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. దీనిపై సుప్రీంకోర్టు రేపు విచారణ చేపట్టే అవకాశం ఉన్నట్టు సమాచారం. మరోవైపు, భాజపా నేతలు గవర్నర్‌ నివాసానికి వెళ్లి ఆయన్ను కలుస్తున్నట్టు తెలుస్తోంది.

సింధియాకు విధేయులైన 22 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పడంతో కమల్‌నాథ్‌ ప్రభుత్వ మనుగడ ప్రమాదంలో పడిన విషయం తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలో ఈ రోజు బల పరీక్ష నిర్వహించాలని గవర్నర్‌ టాండన్‌ శనివారం రాత్రి ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో.. అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు తొలి రోజు ఉత్కంఠ నెలకొంది. ఈ సమావేశాల్లో ప్రారంభోపన్యాసం చేసిన గవర్నర్‌.. ఎమ్మెల్యేలందరూ రాజ్యాంగబద్ధంగా పనిచేయాలని.. ప్రజాస్వామ్యం హుందాతనాన్ని కాపాడేలా వ్యవహరించాలని సూచించారు. కేవలం ఒక్క నిమిషంలోనే తన ప్రసంగాన్ని ముగించి వెళ్లిపోవడం గమనార్హం. ఆ తర్వాత కరోనా వైరస్‌ ప్రభావంపై శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి ప్రస్తావించగా.. సభను ఈ నెల 26 వరకు వాయిదా వేస్తున్నట్టు స్పీకర్‌ ప్రజాపతి ప్రకటించారు. దీంతో కమల్‌నాథ్‌ సర్కార్‌కు కొంత ఊరట లభించినట్టయింది.

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని