మజ్లిస్‌... భారాస మాటా.. మాటా

గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో అధికార భారాస, దానికి మిత్రపక్షంగా ఉన్న మజ్లిస్‌ మధ్య మాటల యుద్ధానికి శనివారం నాటి శాసనసభ వేదిక అయింది.

Updated : 05 Feb 2023 07:18 IST

జీహెచ్‌ఎంసీ దక్షిణ జోన్‌లో అభివృద్ధిపై ప్రశ్నించడం తప్పా?
అధికార పక్షానికి సహనం తగ్గిపోతోంది: ఒవైసీ
గొంతు చించుకుంటే ప్రయోజనం ఉండదు: మంత్రి కేటీఆర్‌

ఈనాడు, హైదరాబాద్‌: గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో అధికార భారాస, దానికి మిత్రపక్షంగా ఉన్న మజ్లిస్‌ మధ్య మాటల యుద్ధానికి శనివారం నాటి శాసనసభ వేదిక అయింది. ఈ పరిణామాలను సభ్యులు ఎంతో ఆసక్తిగా ఆలకించారు. ‘ప్రభుత్వం, గవర్నర్‌ వ్యవస్థల మధ్య రాజీ కుదరటం సంతోషం. కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి అన్యాయం జరిగింది. అయినా గవర్నర్‌ ప్రసంగంలో ఆ ప్రస్తావనే లేదు. ఈ ప్రసంగాన్ని మంత్రివర్గం ఆమోదించిందో? లేదో? గవర్నర్‌ ఏవైనా అంశాలను తొలగించారో ఏమిటో మంత్రులకు, ప్రభుత్వ పక్షానికే తెలియాలి’ అని మజ్లిస్‌ శాసనసభా పక్ష నేత అక్బరుద్దీన్‌ అన్నారు. ‘అవును... మంత్రివర్గం ఆమోదించింది’ అని మంత్రి ప్రశాంత్‌రెడ్డి అనగా... ‘సంతోషం.. అదే విషయాన్ని మైక్‌లో ఆన్‌రికార్డుగా చెప్పండి’ అని అక్బరుద్దీన్‌ అన్నారు. మంత్రి స్పందించలేదు. ఆయన తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ.. ‘‘మైనార్టీలకు రూ.వెయ్యి కోట్లు ఇస్తామన్నారు ఇవ్వలేదు. గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌లోని మా దక్షిణ జోన్‌లో అభివృద్ధి పనులు సక్రమంగా జరగటం లేదు. ఇది అడగటం తప్పా? మంత్రులను కలుద్దామంటే ఒక్కరూ దొరకరు. కనీసం వారి సహాయకుల్ని కలవండని చెప్పినా కలిసేందుకు మేము సిద్ధం. సభా నాయకుడు కూడా సభలో లేరు. గడిచిన నాలుగేళ్లలో అసెంబ్లీ సమావేశాలు కేవలం 64 రోజులు మాత్రమే జరిగాయి’ అని అన్నారు.

బీఏసీకే రాని వ్యక్తి సమావేశాలపై మాట్లాడటంలో అర్ధం లేదు: మంత్రి

ఏడుగురు సభ్యులన్న మజ్లిస్‌ పార్టీ నాయకుడికే అంత సమయం ఇస్తే 105 మంది ఉన్న తమ పార్టీకి ఎంత సమయం ఇవ్వాలని స్పీకర్‌ను ఉద్దేశించి మంత్రి కేటీఆర్‌ అన్నారు. ‘‘ఆయన(అక్బరుద్దీన్‌) గవర్నర్‌ ప్రసంగంపై మాట్లాడకుండా బడ్జెట్‌ మీదో, మున్సిపల్‌ పద్దులపైనో మాట్లాడినట్లు మాట్లాడితే ఎలా? బీఏసీ సమావేశానికి రాని వ్యక్తి, సమావేశాలు తక్కువ రోజులు జరుగుతున్నాయని మాట్లాడటంలో అర్థం లేదు. కరోనాతో రెండు సంవత్సరాలు పోయిందన్న విషయాన్ని ఆయన చాలా వీలుగా, అనుకూలంగా వదిలేశారు. సభా నాయకుడితో ఒవైసీకి సంబంధం ఏమిటి? శాసనసభా వ్యవహారాల మంత్రి అందుబాటులో ఉన్నారు కదా? గొంతు చించుకుని మాట్లాడితే ప్రయోజనం లేదు. చెప్పదలచుకున్న విషయాన్ని క్లుప్తంగా చెప్పవచ్చు. అర్థవంతంగా చర్చ ఉండాలి. బాధ్యతగా మాట్లాడాలి’’ అని అన్నారు. తాను బీఏసీ సమావేశానికి రాకపోయిప్పటికీ ఎలాంటి అంశాలు ఎజెండాలో ఉండాలి... సభ ఎన్ని రోజులు జరిగితే బాగుంటుంది తదితర అంశాలపై స్పీకర్‌కు ముందుగానే లేఖ పంపామని అక్బరుద్దీన్‌ చెప్పారు. ‘‘ఒకవేళ ఆ విషయం మంత్రి కేటీఆర్‌కు తెలియకపోతే ఆ లేఖను ఆయనకూ పంపుతాం. అయినా అధికార పక్షానికి సహనం తగ్గిపోతోంది. నేనేమీ ఇప్పుడే సభకు వచ్చిన వాడిని కాను. సభలో మాట్లాడటం మొదటిసారేమీ కాదు. ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడితే గంటలు గంటలు సమయమిస్తారు’’ అని అక్బరుద్దీన్‌ అన్నారు.

ఎవరు ఎవరికి బి టీమ్‌ అవుతారో తెలియదు: ఒవైసీ

నోట్ల రద్దు విషయాన్ని అప్పట్లో తాము వ్యతిరేకించామని, మీరు అప్పట్లో కేంద్రానికి మద్దతుగా నిలిచారని ఒవైసీ అన్నారు. ‘‘ఇప్పుడు మీరు దగ్గరకెళ్లే కొద్దీ ఆ పార్టీ మీకు దూరం అవుతోంది. గతంలో మా పార్టీని కొందరు బి టీమ్‌ అన్నారు. ఇప్పుడు మీరు జాతీయ రాజకీయాల్లోకి వెళుతున్నారు. జాగ్రత్తగా అడుగులు వేయండి. ఇప్పుడు ఎవరు ఎవరికి బి టీమ్‌ అవుతారో తెలియదు. వయసులో నా కన్నా కేటీఆర్‌ చిన్న వారే కదా ఆవేశం ఎక్కువగా ఉంటుంది. బాగా చదువుకున్న వారు. ఆలోచించి ముందుకు సాగండి.

రాష్ట్రంపై కేంద్ర వివక్ష గురించి ప్రస్తావన లేదు

ఇటీవల మంత్రి కేటీఆర్‌ దావోస్‌(స్విట్జర్లాండ్‌) వెళ్లి వేల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకువచ్చారు. అభినందనీయం. కనీసం ఆ విషయం కూడా గవర్నర్‌ ప్రసంగంలో లేకపోవటం ఏమిటి? రాష్ట్రంపై కేంద్రం చూపిస్తున్న వివక్ష కూడా కనిపించలేదు. పన్నుల రూపంలో రాష్ట్రం నుంచి కేంద్రానికి వెళ్తున్నది ఎంత? రాష్ట్రానికి ఇస్తున్నది ఎంత అన్నదీ లేదు. రాష్ట్రానికి అన్ని రకాలుగా అన్యాయం జరిగింది... జరుగుతోంది. దేశవ్యాప్తంగా మంజూరు చేసిన మెడికల్‌, నర్సింగ్‌ కళాశాలల్లో తెలంగాణకు ఒక్కటి కూడా ఇవ్వలేదు. ఆ అంశం ప్రస్తావనా లేదు. విభజన చట్టంలోని అంశాలు ఇంకా పెండింగులో ఉన్నాయన్న విషయమూ చెప్పలేదు. 2021లో గవర్నర్‌ ప్రసంగం 42 పేజీలు ఉంటే ఇప్పటిది 21 పేజీలే ఉంది. ప్రభుత్వం పేద ప్రజల అభ్యున్నతికి ఎన్నో పథకాలను అమలు చేస్తుండటం అభినందనీయం.

పాతనగరంలో మెట్రో ఏమైంది?

హైదరాబాద్‌ నగరంలో ప్రత్యేకించి దక్షిణ జోన్‌లో అమలు చేసే విషయాన్ని మాత్రం ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. ఉస్మానియా ఆస్పత్రి అభివృద్ధి ఏమైంది? పాతనగరంలో మెట్రో ఏమైంది? పాతనగరం అంశాలపై సమావేశం నిర్వహిస్తామని ఏడాది కిందట అసెంబ్లీలోనే ప్రకటించారు. ఇప్పటి వరకు ఎందుకు నిర్వహించలేదు’’ అంటూ ఇలా పలు అంశాలపై ఒవైసీ తీవ్రస్థాయిలో మాట్లాడారు. గవర్నర్‌ జీడీపీ, తలసరి ఆదాయంపై మాట్లాడారని, తలసరి అప్పు అంశాన్ని ఎందుకు ప్రస్తావించలేదని ప్రశ్నించారు. ‘ఉద్యోగులకు డీఏ ఎప్పుడు ఇస్తారు? వేతన సవరణ గడువు ముగిసింది. దాన్ని ఎప్పుడు అమలు చేస్తారు’ అని అడిగారు.  పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేయాలని ఉద్యోగులు కోరుతున్నారని దాన్ని అమలు చేయాలని కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని