రహస్య బ్యాలెట్‌ స్ఫూర్తిని దెబ్బతీసిన అధికార పార్టీ

శాసనసభ్యుల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా వైకాపా నాయకులు రహస్య ఓటింగ్‌ స్ఫూర్తిని దెబ్బతీసేలా వ్యవహరించారు.

Updated : 24 Mar 2023 09:51 IST

వైకాపా ఎమ్మెల్యేల్లో ఒక్కొక్కరికి ఒక్కో ఫార్మాట్‌
అనురాధకు 23 ఓట్లు వచ్చాయని తెలిశాక బ్యాలెట్‌ పత్రాల పునఃపరిశీలన

ఈనాడు, అమరావతి: శాసనసభ్యుల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా వైకాపా నాయకులు రహస్య ఓటింగ్‌ స్ఫూర్తిని దెబ్బతీసేలా వ్యవహరించారు. తెదేపా ఎమ్మెల్సీ అభ్యర్థి పంచుమర్తి అనురాధకు 23 ఓట్లు వచ్చాయని అధికారికంగా ప్రకటించిన తర్వాత... ఆమెకు పడ్డ బ్యాలెట్‌ పత్రాల్ని పునఃపరిశీలించేందుకు అధికార పార్టీ నేతలు అధికారులపై తీవ్ర ఒత్తిడి తెచ్చారు. తెదేపా కౌంటింగ్‌ ఏజెంట్లుగా ఉన్న ఎమ్మెల్యేలు అభ్యంతరం తెలిపినప్పటికీ వినిపించుకోకుండా తెదేపా అభ్యర్థికి పడ్డ ప్రతి బ్యాలెట్‌ పత్రాన్ని వైకాపా కౌంటింగ్‌ ఏజెంట్లుగా ఉన్న ఎమ్మెల్యేలకు అధికారులు చూపించారు. వైకాపా ఎమ్మెల్యేల్లో తెదేపా అభ్యర్థికి ఓటు వేసినవారెవరో..వారిలో ప్రతి ఒక్కరికీ విడివిడిగా కేటాయించిన రహస్య ఫార్మాట్‌ ఆధారంగా కనిపెట్టేందుకే బ్యాలెట్‌ పత్రాల పునఃపరిశీలనకు వైకాపా నేతలు పట్టుబట్టినట్లు సమాచారం.

జరిగింది ఇదీ.. వైకాపా ఎమ్మెల్యేల్లో కొందరు తెదేపా అభ్యర్థికి ఓటు వేస్తారేమోనని మొదటి నుంచీ అనుమానిస్తున్న వైకాపా అధిష్ఠానం వారిని కట్టడి చేసేందుకు ప్రతి ఎమ్మెల్యేకూ విడివిడిగా ప్రత్యేక ఫార్మాట్‌ ఇచ్చింది. ఎమ్మెల్యేలు రెండు నుంచి ఏడు వరకు వేసే ప్రాధాన్యతా ఓట్లలో... రకరకాల కాంబినేషన్లు సృష్టించి, ఒక్కొక్కరికీ ఒక్కో ఫార్మాట్‌ను కేటాయించింది. ఓట్ల లెక్కింపు సందర్భంగా అధికారులు బ్యాలెట్‌ పత్రాన్ని చూపించినప్పుడు, వైకాపా కౌంటింగ్‌ ఏజెంట్లుగా ఉన్న వారు... ఎమ్మెల్యేలు ప్రాధాన్యతా ఓట్లు ఏ ఫార్మాట్‌లో వేశారో నోట్‌ చేసుకున్నారు. వైకాపా ఎమ్మెల్యేలు ఎవరైనా తెదేపా అభ్యర్థికి ఓటు వేస్తే ఆ ఫార్మాట్‌ ఆధారంగా కనిపెట్టాలన్నది వైకాపా అధినాయకత్వం ఆలోచన. ఓట్ల లెక్కింపు సందర్భంగా.... పోటీలో ఉన్న 8 మంది అభ్యర్థుల కోసం అధికారులు ఎనిమిది ట్రేలు ఏర్పాటు చేశారు. ప్రతి బ్యాలెట్‌ పత్రాన్నీ... తెదేపా, వైకాపా కౌంటింగ్‌ ఏజెంట్లకు చూపించి, మొదటి ప్రాధాన్యతా ఓటు వచ్చిన అభ్యర్థికి సంబంధించిన ట్రేలో ఆ బ్యాలెట్‌ పత్రాన్ని వేశారు. అలా తెదేపా అభ్యర్థి పంచుమర్తి అనురాధకి వచ్చిన ఓట్లను బట్టి ఆమెకు కేటాయించిన ట్రేలో 23 బ్యాలెట్‌ పత్రాలు వేశారు. ఆ బ్యాలెట్‌ పత్రాలన్నీ సక్రమంగానే ఉన్నాయని... వైకాపా కౌంటింగ్‌ ఏజెంట్లు కూడా ధ్రువీకరించిన తర్వాతే వాటిని అనురాధకు కేటాయించిన ట్రేలో అధికారులు వేశారు. మొదటిసారి బ్యాలెట్‌ పత్రాన్ని చూపించినప్పుడే... వైకాపా కౌంటింగ్‌ ఏజెంట్లు వాటిలో ప్రాధాన్యతా ఓట్లను ఏ క్రమంలో వేశారో నోట్‌ చేసుకున్నారు. తెదేపా అభ్యర్థికి 23 ఓట్లు రావడంతో...ఆమె గెలిచారని తెలిశాక, వైకాపా కౌంటింగ్‌ ఏజెంట్లు ఆ 23 బ్యాలెట్‌ పత్రాల పునఃపరిశీలనకు పట్టుబట్టారు. దానికి తెదేపా కౌంటింగ్‌ ఏజెంట్లుగా ఉన్న పయ్యావుల కేశవ్‌, నిమ్మల రామానాయుడు తీవ్ర అభ్యంతరం చెప్పారు. ఆ బ్యాలెట్‌ పత్రాలన్నీ సక్రమంగానే ఉన్నాయని వైకాపా కౌంటింగ్‌ ఏజెంట్లు కూడా అంగీకరించిన తర్వాతే తెదేపా అభ్యర్థికి చెందిన ట్రేలో వేశారని, కావాలంటే వాటిని మళ్లీ లెక్కపెట్టుకోవాలే తప్ప, పునఃపరిశీలన కుదరదని అభ్యంతరం చెప్పారు. అయినా వినిపించుకోని ఒక ఉన్నతాధికారి... తెదేపా అభ్యర్థికి పడ్డ ప్రతి బ్యాలెట్‌ పత్రాన్నీ వైకాపా కౌంటింగ్‌ ఏజెంట్లకు మళ్లీ చూపించడం విశేషం.వాటిని మొదటిసారి చూపించినప్పుడు... ఎమ్మెల్యేలు ప్రాధాన్యతా క్రమంలో వేసిన ఓట్ల ఫార్మాట్‌ను వేగంగా నోట్‌ చేసుకోలేకపోతే మళ్లీ రాసుకునేందుకు, ఒకవేళ మొదటిసారి రాసుకున్నా కూడా... తెదేపా అభ్యర్థికి ఓట్లు వేసిన వైకాపా ఎమ్మెల్యేలెవరో మరోసారి పరిశీలించి రూఢి చేసుకునేందుకు వీలుగా ఆ బ్యాలెట్‌లను రెండోసారి వారికి చూపించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని