111 జీఓ రద్దు వెనుక భారీ కుంభకోణం

జీఓ 111 రద్దు వెనుక రూ.లక్షల కోట్ల కుంభకోణం దాగుందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు.

Published : 23 May 2023 03:36 IST

పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి

ఈనాడు, హైదరాబాద్‌: జీఓ 111 రద్దు వెనుక రూ.లక్షల కోట్ల కుంభకోణం దాగుందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. ఈ కుంభకోణంలో ఎంత దోపిడీ జరుగుతుందో లెక్కించాలంటే ప్రత్యేక వ్యవస్థనే ఏర్పాటు చేయాల్సి వస్తుందన్నారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు వీహెచ్‌, కోదండరెడ్డి, షబ్బీర్‌ అలీ, బలరాం నాయక్‌, శోభారాణి, వినోద్‌ తదితరులతో కలసి సోమవారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడారు. ‘‘కేసీఆర్‌ తీసుకున్న జీఓ రద్దు నిర్ణయంతో హైదరాబాద్‌ నగరం భవిష్యత్తులో వరదల్లో మునిగి, వేల మంది మృత్యువాత పడే భయానక పరిస్థితి వస్తుంది. ఈ జీఓ పరిధిలోని గ్రామాల్లో భారాస నేతలకు ఫాంహౌసులు ఉన్నాయి. 2019 తర్వాత వారంతా ఈ గ్రామాల్లో పేదల నుంచి తక్కువ ధరలకు పెద్ద ఎత్తున భూములను కొనేశారు. ఇప్పుడవి చాలావరకు కేసీఆర్‌ బంధుగణం, బినామీల చేతుల్లోకి వెళ్లాయి. ఈ తంతంగం ముగిసిన తర్వాత వారికి లబ్ధి చేకూర్చేందుకు జీఓను రద్దు చేశారు. భాజపాకు భారాస నుంచి వాటాలు అందుతుండటంతోనే కేంద్ర ప్రభుత్వం కేసీఆర్‌ అవినీతిపై కేసులు పెట్టకుండా చోద్యం చూస్తోంది. ఈ వాటాలు అందకుంటే కేసీఆర్‌పై కేంద్రం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో బండి సంజయ్‌, కిషన్‌రెడ్డిలు చెప్పాలి. 111 జీఓ రద్దు అణు విస్ఫోటం లాంటిది. జపాన్‌లోని హిరోషిమా, నాగసాకి పట్టణాలపై రెండో ప్రపంచయుద్ధంలో అణుబాంబులు వేసినప్పుడు జరిగినంత నష్టంలాంటి విపత్తు ఈ జీఓ రద్దుతో హైదరాబాద్‌కు వాటిల్లే ప్రమాదముంది. ఈ రద్దు వెనుక సీనియర్‌ ఐఏఎస్‌ అధికారుల పాత్ర ఉంది. జీఓ రద్దు వ్యవహారంపై క్షేత్రస్థాయి విచారణకు కాంగ్రెస్‌ తరఫున నిజనిరార్ధణ కమిటీని వేస్తాం’’ అని రేవంత్‌రెడ్డి ప్రకటించారు.

11 ఎకరాలు కేటాయించుకున్నారు

కోకాపేటలో రూ.600 కోట్ల విలువైన 11 ఎకరాల భూమిని రూ.40 కోట్లకే ‘ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ఎక్స్‌లెన్స్‌, హ్యూమన్‌ రిసోర్స్‌ డెవలప్‌మెంట్‌’ పేరిట భారాస కార్యాలయం కోసం కేసీఆర్‌ కేటాయించుకున్నారని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ‘‘గతంలో కాంగ్రెస్‌ హయాంలో బంజారాహిల్స్‌లో ఎకరా భూమిని అప్పటి తెరాస కార్యాలయం కోసం కేటాయించారు. అది సరిపోదన్నట్లు హైదరాబాద్‌ భారాస కార్యాలయం కోసమంటూ మరో ఎకరం భూమిని కేసీఆర్‌ తీసుకున్నా(రు. దీంతోపాటు 33 జిల్లాల్లో భారాస కార్యాలయాలకు వందల ఎకరాలు తీసుకున్నారు. కాంగ్రెస్‌ పార్టీకి హైదరాబాద్‌లో సొంత కార్యాలయం లేదు. గాంధీభవన్‌లో అద్దెకు ఉంటోంది. ఉమ్మడి రాష్ట్రంలో గాంధీభవన్‌ పక్కన హౌసింగ్‌ బోర్డు 5,100 చదరపు అడుగుల స్థలం కేటాయించగా దానిపై సుప్రీంకోర్టులో కేసు నడుస్తోంది. కేసీఆర్‌ అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్‌కు ఆ స్థలం అవసరం లేదంటూ 2016లో కేసును ఉపసంహరించుకున్నారు. మరి ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్‌కు భూమి ఇవ్వరా...?’’ అని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని