Raghu Rama Krishna Raju: కేసీఆర్‌కు జగన్‌ ఝలక్‌!

దిల్లీ మద్యం కుంభకోణంలో కొందరు కీలక వ్యక్తుల పాత్ర గురించి చెప్పడానికే ఆ కేసులో నిందితుడిగా ఉన్న అరబిందో ఫార్మా డైరెక్టర్‌ శరత్‌చంద్రారెడ్డి అప్రూవర్‌గా మారినట్లు కనిపిస్తోందని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు.

Updated : 02 Jun 2023 12:51 IST

వివేకా కేసులో కీలక వ్యక్తి పేరు బయటకు రాకుండా కొత్త ఎత్తులు
అందుకే మద్యం కేసులో అప్రూవర్‌గా శరత్‌చంద్రారెడ్డి
ఎంపీ రఘురామకృష్ణ రాజు ఆరోపణ

ఈనాడు, దిల్లీ: దిల్లీ మద్యం కుంభకోణంలో కొందరు కీలక వ్యక్తుల పాత్ర గురించి చెప్పడానికే ఆ కేసులో నిందితుడిగా ఉన్న అరబిందో ఫార్మా డైరెక్టర్‌ శరత్‌చంద్రారెడ్డి అప్రూవర్‌గా మారినట్లు కనిపిస్తోందని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. శరత్‌చంద్రారెడ్డి మద్యం కేసులో కొందరి పాత్రను వెల్లడిస్తే.. వివేకా కేసులో ఓ కీలక వ్యక్తి పేరు బయటకురాకుండా చూస్తామని కొందరు చెప్పినట్లుగా వార్తలు వచ్చాయని, దీంతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి మోసం చేస్తున్నట్లు అర్థమవుతోందని విశ్లేషించారు. ఆయన గురువారం ఇక్కడ విలేకర్లతో మాట్లాడారు. ‘‘దిల్లీ మద్యం కుంభకోణంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత పాత్ర ఉన్నట్లుగా సాక్షి పత్రికలో కథనాన్ని రాశారు. ఈ కేసులో కీలక నిందితుడిగా అరెస్ట్‌ అయి, బెయిల్‌ పొందిన శరత్‌ చంద్రారెడ్డి అప్రూవర్‌గా మారారు. ఆయన జగన్‌కు అత్యంత సన్నిహితుడు. విజయసాయిరెడ్డి అల్లుడికి అన్న. అలాంటి శరత్‌ అప్రూవర్‌గా మారబోతున్నారని రెండు రోజుల క్రితమే పత్రికల్లో వార్త వచ్చింది. అదే నిజమైంది.

అది నిజమైనప్పుడు, శరత్‌ చంద్రారెడ్డి కొన్ని పేర్లను చెబితే వివేక హత్య కేసులోని కుట్ర కోణం నుంచి కీలక వ్యక్తి పేరు రాకుండా చేస్తామని చెప్పినట్లుగా వచ్చిన వార్తా కథనాలను కూడా నమ్మాల్సి వస్తుంది. దీంతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను జగన్మోహన్‌ రెడ్డి మోసగిస్తున్నారని అర్థం అవుతోంది. గత ఎన్నికల్లో మా పార్టీ నెగ్గడానికి కేసీఆర్‌ ఎంతో సహకరించారని వాదనలు ఉన్నాయి. జగన్‌ ఆయనకు ద్రోహం చేయడం బాధ కలిగించే అంశం. మద్యం కుంభకోణంలో శరత్‌ ఎవరెవరి పేర్లను చెబుతారో, దాని పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి. అప్రూవర్‌గా మారే అవకాశం నిందితులకే తప్పితే సాక్షులకు ఉండదు. వివేకా కేసులో నిందితుడైన దస్తగిరి అప్రూవర్‌గా మారితే సీఎం జగన్‌, సజ్జల అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయన్ను జైల్లో పెట్టాలన్నారు. ఇప్పుడు మద్యం కేసులో అప్రూవర్‌గా మారిన శరత్‌చంద్రారెడ్డిని జైల్లో పెట్టాలని ఎమ్మెల్సీ కవిత పిటిషన్‌ దాఖలు చేస్తే ఆయన్ని అరెస్టు చేస్తారా? చేయరు కదా’’ అని రఘురామకృష్ణరాజు వ్యాఖ్యానించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని