వంద రోజులు జనంలోనే.. భాజపా నిర్ణయం

శాసనసభ ఎన్నికల నేపథ్యంలో భాజపా శ్రేణులు, నాయకులు వంద రోజులు పూర్తిస్థాయిలో పార్టీ కార్యక్రమాల్లో భాగస్యాములు కావాలని.. జనంలోనే ఉండాలని నిర్ణయించారు.

Updated : 22 Jul 2023 06:12 IST

ఈనాడు, హైదరాబాద్‌: శాసనసభ ఎన్నికల నేపథ్యంలో భాజపా శ్రేణులు, నాయకులు వంద రోజులు పూర్తిస్థాయిలో పార్టీ కార్యక్రమాల్లో భాగస్యాములు కావాలని.. జనంలోనే ఉండాలని నిర్ణయించారు. ఈ మేరకు వంద రోజుల కార్యాచరణే లక్ష్యంగా భాజపా విస్తృత స్థాయి సమావేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అధ్యక్షతన శుక్రవారమిక్కడ జరిగింది. ఓ హోటల్‌లో జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర ఎన్నికల ఇన్‌ఛార్జి ప్రకాశ్‌ జావడేకర్‌, పార్టీ రాష్ట్ర ఇన్‌ఛార్జి తరుణ్‌ఛుగ్‌, భాజపా మాజీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్‌, రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ అధ్యక్షుడు ఈటల రాజేందర్‌ సహా ముఖ్యనేతలు పాల్గొన్నారు. భారాస ఎన్నికల హామీలు అమలు చేయలేదన్న విషయాన్ని విస్తృత స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. రెండు పడక గదుల ఇళ్ల పంపిణీలో జాప్యంపై ఈ నెల 24, 25లలో చేపట్టే నిరసన కార్యక్రమాలతోపాటు జిల్లా, రాష్ట్ర స్థాయిలో పక్కా ప్రణాళిక ప్రకారం కార్యక్రమాలు చేపట్టడంపై చర్చించారు. కేంద్రం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించారు. తెలంగాణలో భారాసను ఓడించే పార్టీ భాజపాయేననే విశ్వాసాన్ని ప్రజల్లో కల్పించాలని.. దళితవాడల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి భారాస వైఫల్యాలను వివరించాలని అనుకున్నారు. మొత్తంమీద ఆగస్టు 1 నుంచి కార్యక్రమాలను ఉద్ధృతం చేయాలనే నిర్ణయానికి వచ్చారు.


ఇప్పటికైనా హామీలను అమలు చేయండి
సీఎంకు కిషన్‌రెడ్డి లేఖ

భారాస ప్రభుత్వం మిగిలి ఉన్న నాలుగైదు నెలల్లోనైనా రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కోరారు. ఈ మేరకు శుక్రవారం సీఎంకు బహిరంగలేఖ రాశారు. ‘‘ఏకమొత్తంలో లక్ష రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పి ప్రజలను మోసం చేశారు. హామీ మేరకు రూ.3,016 నిరుద్యోగ భృతి ఇవ్వాలి. తక్షణమే రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ రెండు పడకగదుల ఇళ్లు నిర్మించి ఇవ్వాలి. కొత్త పింఛన్లు, రేషన్‌కార్డులు ఇవ్వాలి. అర్హతలున్న ప్రతి దళిత కుటుంబానికి తక్షణమే ‘దళితబంధు’ ఇవ్వాలి. కులవృత్తులపై ఆధారపడ్డ బీసీలకు రూ.1 లక్ష సాయం చేయాలి. రూ.500 కోట్లతో గల్ఫ్‌బాధితుల కోసం ఏర్పాటు చేస్తామన్న ప్రత్యేక నిధి హామీ విషయంలో ఒక్క అడుగూ ముందుకు పడలేద]ు. ధరణి వల్ల ఉత్పన్నమైన సమస్యలను తక్షణమే పరిష్కరించాలి’’ అని లేఖలో కిషన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని