Marri Rajasekhar Reddy: మల్కాజిగిరి అభ్యర్థిగా రాజశేఖర్‌రెడ్డి!

మల్కాజిగిరి భారాస పార్లమెంటరీ పార్టీ ఇన్‌ఛార్జి, మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్‌రెడ్డి మల్కాజిగిరి శాసనసభ నియోజకవర్గం నుంచి భారాస అభ్యర్థిగా బరిలోకి దిగనున్నారు.

Updated : 27 Sep 2023 08:27 IST

జనగామలో పల్లా.. నర్సాపూర్‌లో సునీతా లక్ష్మారెడ్డి?
త్వరలో ప్రకటించనున్న భారాస అధిష్ఠానం

ఈనాడు, హైదరాబాద్‌: మల్కాజిగిరి భారాస పార్లమెంటరీ పార్టీ ఇన్‌ఛార్జి, మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్‌రెడ్డి మల్కాజిగిరి శాసనసభ నియోజకవర్గం నుంచి భారాస అభ్యర్థిగా బరిలోకి దిగనున్నారు. ఇక్కడి అభ్యర్థిగా ఇప్పటికే మైనంపల్లి హన్మంతరావును ప్రకటించగా.. ఆయన భారాసకు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ స్థానం నుంచి మర్రి రాజశేఖర్‌రెడ్డిని పోటీలో నిలపాలని భారాస అధినేత, సీఎం కేసీఆర్‌ నిర్ణయించినట్లు తెలిసింది. ఈయన మల్కాజిగిరి పార్లమెంట్‌ స్థానం నుంచి గత ఎన్నికల్లో భారాస అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఇక్కడ తలపడిన అనుభవం.. నియోజకవర్గ పార్టీ ఇన్‌ఛార్జిగా ప్రజలకు అందుబాటులో ఉండటం వంటి అంశాలు రాజశేఖర్‌రెడ్డికి ఈ ఎన్నికల్లో ఉపయోగపడతాయని పార్టీ అధిష్ఠానం భావిస్తోంది. ఇప్పటికే అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసిన సీఎం కేసీఆర్‌ అంతర్గతంగా వారికి సమాచారమివ్వడంతో.. బుధవారం మల్కాజిగిరి నియోజకవర్గంలో భారీ ప్రదర్శనకు ఏర్పాట్లు చేశారు. ఆనంద్‌బాగ్‌ నుంచి మల్కాజిగిరి క్రాస్‌రోడ్డు వరకూ సుమారు 15 వేల మందితో భారీ ర్యాలీ నిర్వహించడానికి పార్టీ శ్రేణులు సన్నద్ధమయ్యాయి. ఉదయం 10 నుంచి 11 గంటల వరకూ ప్రదర్శన.. అనంతరం విలేకరుల సమావేశాన్ని నిర్వహించనున్నట్లు మంత్రి మల్లారెడ్డి ‘ఈనాడు’తో తెలిపారు.

మరోవైపు జనగామ స్థానం నుంచి పల్లా రాజేశ్వర్‌రెడ్డి, నర్సాపూర్‌ నుంచి సునీతా లక్ష్మారెడ్డి పేర్లు కూడా ఖరారైనట్లు భారాస వర్గాలు తెలిపాయి. వీరికి కూడా అధిష్ఠానం నుంచి సమాచారం అందడంతో.. స్థానికంగా ప్రచార ఏర్పాట్లు చేసుకుంటున్నారు. గోషామహల్‌ స్థానానికి నందకిశోర్‌, ఆశీష్‌కుమార్‌ యాదవ్‌ల పేర్లు పరిశీలనలో ఉన్నాయి. వీరిద్దరిలో ఒకరికి సీటు వచ్చే అవకాశాలున్నాయి. ఈ అభ్యర్థుల పేర్లను అధికారికంగా త్వరలోనే ప్రకటించనున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని