Vijaysai Reddy: అంతటి సాయిరెడ్డే దిగి వచ్చి..!

అధికార పార్టీలో నం.2గా వెలుగుతున్న నాయకుడు, వైకాపా పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి శనివారం గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలంలోని చిలువూరు గ్రామానికి ఆకస్మికంగా వెళ్లారు.

Updated : 14 Jan 2024 10:56 IST

మండలస్థాయి నాయకులకు బుజ్జగింపు
లోకేశ్‌ను ఓడించేందుకు ఏ స్థాయికి వెళ్లేందుకైనా సిద్ధం
దుగ్గిరాల మండలంలోని ఒక గ్రామానికి వెళ్లి... మండలస్థాయి నాయకులతో భేటీ
తెదేపాలోకి వెళ్లవద్దని బతిమాలినా వినని వైకాపా నాయకులు

ఈనాడు, అమరావతి, దుగ్గిరాల, న్యూస్‌టుడే: అధికార పార్టీలో నం.2గా వెలుగుతున్న నాయకుడు, వైకాపా పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి శనివారం గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలంలోని చిలువూరు గ్రామానికి ఆకస్మికంగా వెళ్లారు. ముగ్గురు మండలస్థాయి వైకాపా నాయకులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు..! ఆయన వారిని బుజ్జగించారు, నచ్చజెప్పారు, బతిమాలారు.. ఎన్ని చేసినా ప్రయత్నాలేమీ ఫలించలేదు. ‘మేం ఒక నిర్ణయం తీసేసుకున్నాం. మమ్మల్ని వదిలేయండి’ అని వారు కరాఖండిగా చెప్పేసి, ఓ నమస్కారం పెట్టేశారు..! మంత్రులు, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలను తన చుట్టూ ప్రదక్షిణలు చేయించుకునే సాయిరెడ్డి నేరుగా ఓ గ్రామానికి వెళ్లి, మండలస్థాయి నాయకులను బతిమాలడమేంటని ఆశ్చర్యపోతున్నారా? అక్కడే ఉంది కిటుకు..! వచ్చే ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గంలో తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఓడించాలని లక్ష్యంగా పెట్టుకున్న వైకాపా అగ్రనాయకత్వం.. దాని కోసం ఏ స్థాయికైనా దిగుతోందనడానికి ఈ భేటీనే నిదర్శనం..!

దుగ్గిరాల మండలంలో వైకాపాలో కీలక నాయకులైన యడ్ల వెంకట్రావు, జయలక్ష్మి, కొరిటాల సురేష్‌, పాటిబండ్ల కృష్ణప్రసాద్‌ త్వరలోనే తెదేపాలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఈ పరిణామం వైకాపా నాయకత్వానికి మింగుడుపడటం లేదు. గత ఎన్నికల తరవాత దుగ్గిరాలలో తెదేపా బలపడింది. 2019 ఎన్నికల్లో లోకేశ్‌పై వైకాపా అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి దుగ్గిరాల మండలంలో సుమారు 5,300 ఓట్ల మెజారిటీ సాధించారు. ఇప్పుడా పరిస్థితి కనిపించడం లేదు. గత అయిదేళ్లలో ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి వైఖరితో విసిగిపోయిన.. దుగ్గిరాల మండలంలోని పార్టీ ముఖ్య నాయకులు తెదేపాలోకి క్యూ కడుతున్నారు.

దీంతో వారిని బతిమాలేందుకు సాయిరెడ్డి స్వయంగా రంగంలోకి దిగారు. జయలక్ష్మి ఇంటికి వెళ్లారు. జడ్పీటీసీ మాజీ సభ్యుడు యడ్ల వెంకట్రావు, పెనుమూలి పీఏసీఎస్‌ ఛైర్మన్‌ కొరిటాల సురేష్‌ కూడా హాజరయ్యారు. గత అయిదేళ్లలో పార్టీలో తమకు ఎదురైన అవమానాలను వారు వివరించారు. తాను ఉన్నానని, అన్నీ చక్కదిద్దుతానని, పార్టీని మాత్రం వీడొద్దని సాయిరెడ్డి వారిని బతిమాలినట్లు తెలిసింది. అయినా వారు వినలేదని, తెదేపాలో చేరతామని మాటిచ్చేశామని, ఇప్పుడు మాట తప్పితే ప్రాణం పోయినట్లేనని స్పష్టం చేశారని సమాచారం. పార్టీ మారాలన్న నిర్ణయం నుంచి వెనక్కి తగ్గబోమని వారు చెప్పినట్లు తెలిసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని