కొలువుదీరిన మహాకూటమి

ఆర్జేడీ, జేడీ(యు), కాంగ్రెస్‌ సహా ఏడు పార్టీలతో కూడిన మహాకూటమి ప్రభుత్వం బిహార్‌లో కొలువుదీరింది. భాజపాతో తెగదెంపులు చేసుకున్న జేడీ(యు) నేత నీతీశ్‌ కుమార్‌ రికార్డు స్థాయిలో ఎనిమిదో సారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో నిరాడంబరంగా

Published : 11 Aug 2022 06:11 IST

 బిహార్‌ సీఎంగా నీతీశ్‌ ఎనిమిదోసారి ప్రమాణం
 ఉప ముఖ్యమంత్రిగా తేజస్వి.. 

పట్నా: ఆర్జేడీ, జేడీ(యు), కాంగ్రెస్‌ సహా ఏడు పార్టీలతో కూడిన మహాకూటమి ప్రభుత్వం బిహార్‌లో కొలువుదీరింది. భాజపాతో తెగదెంపులు చేసుకున్న జేడీ(యు) నేత నీతీశ్‌ కుమార్‌ రికార్డు స్థాయిలో ఎనిమిదో సారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో నిరాడంబరంగా నిర్వహించిన కార్యక్రమంలో నీతీశ్‌కుమార్‌, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌లతో గవర్నర్‌ ఫాగూ చౌహాన్‌ ప్రమాణం చేయించారు. మంత్రి మండలిపై కసరత్తు పూర్తి కానందున బుధవారం నాటి కార్యక్రమం వారిద్దరికే పరిమితమైంది. తేజస్వీని ఉప ముఖ్యమంత్రిగా పేర్కొంటూ త్వరలో నోటిఫికేషన్‌ వెలువడనుంది. కూటమిలోని భాగస్వాములతో చర్చించిన తర్వాత మంత్రివర్గ విస్తరణ చేపట్టనున్నారు. రాజ్‌భవన్‌లో కార్యక్రమానికి విపక్ష భాజపా నేతలు గైర్హాజరయ్యారు. తమకు ఆహ్వానాలు అందలేదని ఆ పార్టీ సీనియర్‌ నేత సుశీల్‌కుమార్‌ మోదీ తెలిపారు. తేజస్వీ సతీమణి రాజశ్రీ, తల్లి రబ్రీ దేవి, సోదరుడు తేజ్‌ ప్రతాప్‌ తదితరులు పాల్గొన్నారు. ప్రమాణ స్వీకారానికి ముందు ఆర్జేడీ అధినేత, మాజీ సీఎం లాలూ ప్రసాద్‌ యాదవ్‌తో నీతీశ్‌ ఫోన్లో మాట్లాడారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలను ఆయనకు వివరించారు. నీతీశ్‌ నిర్ణయాన్ని లాలూ సమర్థించి.. ఆయనను అభినందించినట్లు ఆర్జేడీ వర్గాలు వెల్లడించాయి.

స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం

ప్రస్తుత బిహార్‌ అసెంబ్లీ స్పీకర్‌ విజయ్‌ కుమార్‌ సిన్హాపై నీతీశ్‌ కుమార్‌- తేజస్వీ యాదవ్‌ నేతృత్వంలోని మహాకూటమి నేతలు అవిశ్వాసం ప్రకటించారు. ఈ మేరకు 50 మంది ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన లేఖను బుధవారం బిహార్‌ విధానసభ కార్యదర్శికి సమర్పించారు. ప్రస్తుతం భాజపాకు 77 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నందున స్పీకర్‌ పదవిని కాపాడుకోవడం ఆ పార్టీకి కష్టమే. నీతీశ్‌-తేజస్వీ ఒప్పందంలో భాగంగా ఆర్జేడీకి స్పీకర్‌ పదవి దక్కే అవకాశముంది. మిత్రపక్షమైన కాంగ్రెస్‌కు నాలుగు మంత్రి పదవులు, కూటమిలో పెద్ద భాగస్వామి అయిన ఆర్జేడీకి అత్యధిక మంత్రి పదవులు దక్కనున్నాయి. సీఎం నీతీశ్‌...కీలకమైన హోంమంత్రి పదవిని తన వద్దే ఉంచుకుంటారని సమాచారం.

ఈడీ, సీబీఐలకు భయపడం: జేడీ(యు)

భాజపా కూటమి నుంచి వైదొలగినందున తమ పార్టీ వారిపై కక్ష సాధింపులకు పాల్పడే అవకాశం ఉందని జేడీ(యు) జాతీయాధ్యక్షుడు రాజీవ్‌ రంజన్‌ సింగ్‌(లలన్‌ సింగ్‌) తెలిపారు. ఈడీ, సీబీఐ దాడులకు భయపడబోమన్నారు. దర్యాప్తు సంస్థలను కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగపరుస్తోందని ఆరోపించారు.

‘ప్రధాని పదవి రేసులో లేను’

మహాకూటమి ప్రభుత్వం 2025 వరకు పూర్తికాలం అధికారంలో ఉంటుందని ముఖ్యమంత్రి నీతీశ్‌కుమార్‌ ధీమా వ్యక్తం చేశారు. కొత్త సర్కారు ఎక్కువ రోజులు మనుగడ సాగించలేదన్న భాజపా నేతల వ్యాఖ్యల్ని ఆయన కొట్టిపారేశారు.  ప్రధాని మోదీపైనా వాగ్బాణాలు సంధించారు. ‘2014లో విజయం సాధించిన వ్యక్తి 2024లో గెలుస్తారా’ అని ప్రశ్నించారు. ప్రధాని పదవి రేసులో తానులేనని నీతీశ్‌ స్పష్టం చేశారు. 2024 సార్వత్రిక ఎన్నికలను సమర్థంగా ఎదుర్కొనేలా ప్రతిపక్షాలను ఏకం చేసేందుకు ప్రయత్నిస్తానని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని