భూముల సెటిల్మెంట్లలో సీఎం కుటుంబం

ధనిక రాష్ట్రమైన తెలంగాణను కేసీఆర్‌ తన పాలనలో రూ.5 లక్షల కోట్ల అప్పులపాల్జేశారని.. ఇంకా రుణాలు కావాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని బ్లాక్‌మెయిల్‌

Published : 26 Sep 2022 04:11 IST

కేంద్రంపై విషప్రచారం చేయడమే కేటీఆర్‌ ఎజెండా

కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ధ్వజం

ఈనాడు- హైదరాబాద్‌, గన్‌ఫౌండ్రి- న్యూస్‌టుడే: ధనిక రాష్ట్రమైన తెలంగాణను కేసీఆర్‌ తన పాలనలో రూ.5 లక్షల కోట్ల అప్పులపాల్జేశారని.. ఇంకా రుణాలు కావాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ధ్వజమెత్తారు. దేశంలో ప్రతిపక్షాల ఏకీకరణ పేరుతో రాజకీయాలు చేస్తూ, పార్టీలకు ఇస్తామంటూ డబ్బు సంచులతో రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారని విమర్శించారు. కల్వకుంట్ల కుటుంబం రెండేళ్లు పాక్‌, బంగ్లాదేశ్‌, శ్రీలంక దేశాల్లో జీవించి వచ్చి, అప్పుడు ఆర్థిక పరిస్థితుల గురించి మాట్లాడాలని డిమాండ్‌ చేశారు. సీఎం కుటుంబం రాష్ట్రంలో పెద్దపెద్ద భూముల సెటిల్మెంట్లు చేస్తోందని..నిజాం కాలంనాటి భూముల వివాదాలనూ పరిష్కరిస్తోందని ఆరోపించారు. పండిట్‌ దీనదయాళ్‌ ఉపాధ్యాయ జయంతిని పురస్కరించుకుని భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం జరిగిన కార్యక్రమం సందర్భంగా, అనంతరం విలేకరులతోనూ కిషన్‌రెడ్డి మాట్లాడారు. ‘‘పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం రూపాయి నిధులివ్వలేదు. దేశ ఆర్థికవ్యవస్థను పాక్‌, బంగ్లా, శ్రీలంక, చైనాలతో పోలుస్తున్నారు. మోదీ పాలనలో దేశ ఎగుమతులు పెరిగాయి. ఆగస్టులో రికార్డు స్థాయిలో జీఎస్‌టీతో కేంద్రానికి రూ.1.60 లక్షల కోట్ల ఆదాయం వచ్చింది. జీడీపీ గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది 13% పెరిగింది. తెరాస నేతలు కుంటలు, చెరువుల, శిఖం భూముల్ని ఆక్రమించుకుంటున్నారు. ఎనిమిదేళ్లయినా రేషన్‌కార్డులు ఏపీ పేరుతోనే ఉన్నాయి. 4 లక్షల ‘ధరణి’ దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. రాష్ట్రంలో భాజపా అధికారంలోకి రాగానే గిరిజనులకు 10% రిజర్వేషన్లు అమలుచేస్తుంది. కేటీఆర్‌ చేస్తున్నదంతా విషప్రచారమే.. హైదరాబాద్‌ను ఇస్తాంబుల్‌, కరీంనగర్‌ని లండన్‌ చేశారా? హుస్సేన్‌సాగర్‌ని కొబ్బరినీళ్లతో నింపారా?. కేంద్ర సంస్థలు హెచ్‌ఎంటీ, ఐడీపీఎల్‌కు అధిక భూములిచ్చామంటూ వెనక్కిస్తే అమ్ముకుంటామని రాష్ట్ర ప్రభుత్వం అంటోంది’’ అని కిషన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. రాజ్యసభ సభ్యుడు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ మాట్లాడుతూ..మహిళా సంఘాలకు కేంద్రం రూ.20 లక్షల వడ్డీ లేని రుణాన్ని అందించేందుకు ముందుకు వస్తే.. రాష్ట్రం తన వాటా చెల్లించకపోవడంతో అమలు కాలేని దుస్థితి నెలకొందన్నారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts