జాతీయ పార్టీ ఏర్పాటు మంచిదే: కె.నారాయణ

భారత రాష్ట్ర సమితి ఎదిగే తీరు, ఎంచుకున్న విధానాలను బట్టి ఆ పార్టీకి ప్రాధాన్యం ఉంటుందని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ పేర్కొన్నారు.

Published : 07 Oct 2022 04:59 IST

హిమాయత్‌నగర్‌ న్యూస్‌టుడే: భారత రాష్ట్ర సమితి ఎదిగే తీరు, ఎంచుకున్న విధానాలను బట్టి ఆ పార్టీకి ప్రాధాన్యం ఉంటుందని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ పేర్కొన్నారు. గురువారం హిమాయత్‌నగర్‌లోని మఖ్దూంభవన్‌లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తెరాసను భారాసగా మార్చడం సంతోషకరమని, భాజపాయేతర పార్టీలను ఏకం చేయడానికి ఇది దోహదపడుతుందన్నారు. దేశంలో రుణ యాప్‌ల వల్ల ఎంతో మంది మోసపోతున్నారని, ప్రాణాలు తీసుకుంటున్నారన్నారు. వీటిని నియంత్రించడంలో కేంద్రం ఎందుకు విఫలమవుతోందని ప్రశ్నించారు. బాధితులకు తమ పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. ఈనెల 14 నుంచి 18 వరకు విజయవాడలో నిర్వహించే పార్టీ జాతీయ మహాసభలకు ఏర్పాట్లు పూర్తయ్యాయని, బహిరంగ సభ కోసం జనసమీకరణ చేస్తున్నట్లు తెలిపారు. గద్దర్‌ ప్రజాశాంతి పార్టీలో చేరడంపై స్పందిస్తూ ‘కమ్యూనిస్టులు దిగజారితే గద్దర్‌లా ఉంటారు’ అని వ్యాఖ్యానించారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ.. మోదీ ప్రభుత్వ తీరుతో అన్ని రంగాల సూచికలలో భారత్‌ దిగజారుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.తనకు సంబంధం లేని బయ్యారం ఉక్కు పరిశ్రమ స్థాపన గురించి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఎలా మాట్లాడతారని ప్రశ్నించారు. సమావేశంలో జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్‌రెడ్డి, అజీజ్‌పాషా, నాయకులు పశ్య పద్మ, బాలమల్లేష్‌ తదితరులు పాల్గొన్నారు.


టీజీవోల మద్దతు...

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర సమితి స్థానంలో ఏర్పాటవుతున్న జాతీయపార్టీ...భారత్‌ రాష్ట్ర సమితికి తెలంగాణ గెజిటెడ్‌ అధికారుల సంఘం తమ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మమత, సత్యనారాయణ, ఇతర నేతలు కేసీఆర్‌ నిర్ణయాన్ని స్వాగతించారు. గురువారం జరిగిన సమావేశంలో ఈ మేరకు తీర్మానం చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని