రాష్ట్రంలో ప్రతిపక్షం ఉండకూడదా?

‘విశాఖలో అధికార పార్టీ ప్రతినిధులపై ఒక రాయి పడిందని జనసేనకు చెందిన 120 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు.

Updated : 06 Dec 2022 06:25 IST

అధికారం పోతుందనే ఆందోళనతోనే వైకాపా దౌర్జన్యాలు

రౌడీయిజాన్ని ప్రోత్సహిస్తున్న మంత్రి పెద్దిరెడ్డి

‘ఈటీవీ ప్రతిధ్వని’ చర్చలో వివిధ పార్టీల నేతలు

ఈటీవీ, అమరావతి: ‘విశాఖలో అధికార పార్టీ ప్రతినిధులపై ఒక రాయి పడిందని జనసేనకు చెందిన 120 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. పుంగనూరులో బీసీ నేత ఇంటిపైకి వందల మంది వైకాపా కార్యకర్తలు వెళ్లి దాడి చేస్తే వారేం చేస్తున్నారు’ అని తెదేపా, జనసేన, భాజపా నాయకులు నిలదీశారు. రౌడీయిజాన్ని ప్రోత్సహించడం ద్వారా సీనియర్‌ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి... ఇతరులకు ప్రేరణగా నిలుస్తున్నారా? అని ప్రశ్నించారు. వైకాపా మూకల వీరంగంతో ప్రజలకు రక్షణ కరవైందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ప్రతిపక్షం ఉండకూడదనేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అధికారానికి దూరమవుతామనే అభద్రతాభావం వైకాపాలో రోజురోజుకూ పెరుగుతోందని, సీఎం, మంత్రుల మాటలే అందుకు అద్దం పడుతున్నాయని విమర్శించారు. ‘రాష్ట్రంలో ప్రతిపక్షం ఉండకూడదా?’ అనే అంశంపై సోమవారం ‘ఈటీవీ-ప్రతిధ్వని’ చర్చలో వివిధ పార్టీల ప్రతినిధులు పాల్గొని తమ అభిప్రాయాలను వెల్లడించారు.


ఒక్క అవకాశం ఇంత భయంకరంగా ఉంటుందా?

కావలి గ్రీష్మ, తెలుగుదేశం అధికార ప్రతినిధి

ప్రజల గొంతుగా నిలిచే ప్రతిపక్షం మాట్లాడకూడదనేలా ఏపీలో అధికార పార్టీ వ్యవహరిస్తోంది. రాష్ట్రంలో ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదం కనిపిస్తోంది. శాసనమండలి రద్దు చేస్తామన్న ప్రభుత్వం ఇప్పుడు ఎగువ సభలో మెజారిటీ కోసం ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ల జాబితాలోనూ అనేక అవకతవకలకు, తప్పిదాలకు పాల్పడుతోంది. అనర్హుల పేర్లను జాబితాల్లో చేరుస్తోంది. కాంపౌండర్లు, స్వీపర్లను టీచర్లుగా నమోదు చేయడం కంటే దారుణం మరొకటి లేదు. ఒకప్పుడు బిహార్‌, ఝార్ఖండ్‌ వంటి రాష్ట్రాలంటే భయపడే పరిస్థితి ఉండేది. ఇప్పుడా రాష్ట్రాలు బాగుపడ్డాయి. మన రాష్ట్రం పాతాళానికి పడిపోయింది. అంతా బాగుందనే భ్రమ కలిపించేందుకు ముఖ్యమంత్రి నుంచి మంత్రుల వరకు గొప్పగా నటిస్తున్నారు. ప్రతిపక్షాలను అణచివేస్తున్నారు. ఒక్క అవకాశం ఇంత భయంకరంగా ఉంటుందా? అని ప్రజలంతా ఆందోళన చెందుతున్నారు.


ఎన్నికలకు ఇక్కడి పోలీసులు వద్దు

కిరణ్‌ రాయల్‌, జనసేన నాయకుడు

వైకాపా తప్ప ఏ పార్టీ కనిపించకూడదనేలా పోలీసులే... ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ మీద నమ్మకం పోయింది. శాసనసభ ఎన్నికలకు ఆరు నెలల ముందు ఇక్కడి పోలీసులను వేరే రాష్ట్రానికి పంపించి, మిలటరీని తీసుకొచ్చి ఎన్నికలు నిర్వహించాలి. నోటీసు ఇవ్వకుండానే పోలీసులు నన్ను నానా ఇబ్బందులు పెట్టారు. రక్షకభటులు ఇంత దారుణంగా ప్రవర్తించడం గతంలో ఏ ప్రభుత్వ హయాంలోనూ లేదు. పుంగనూరు నియోజకవర్గంలో రైతుల కోసం కార్యక్రమం చేస్తామన్న బీసీ నేత ఇంటిపైకి 500 మందికి పైగా వైకాపా కార్యకర్తలు వెళ్లి విధ్వంసం సృష్టించారు. అధికారపక్షాన్ని కాదని వేరే పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తే... ప్రతిపక్షాలే కాదు ఓటర్లను కూడా ఉండనీయరా? పాలకులు, పోలీసుల చర్యల్ని చూస్తుంటే... ప్రతిపక్ష పార్టీలు, ప్రజలను బెదరగొట్టేలా ఉన్నాయి. ముఖ్యమంత్రి నుంచి దిగువస్థాయి కార్యకర్త వరకు అందరిదీ ఒకే ధోరణి. ప్రజలకూ పక్క రాష్ట్రాలకు వెళ్లడం మినహా మరో గత్యంతరం లేదేమో.


రాష్ట్రంలో బాధితులే దోషులవుతున్నారు

కె.ఆంజనేయరెడ్డి, భాజపా అధికార ప్రతినిధి

ఈ ప్రభుత్వంలో బాధితులే దోషులవుతున్నారు. అన్యాయం జరిగిందని ఫిర్యాదు చేస్తే... వారిపైనే పోలీసులు కేసులు పెడుతున్నారు. పెద్దిరెడ్డి వంటి సీనియర్‌ మంత్రి.. విధ్వంసానికి దిగడం ఏమిటి? ఎన్నికలు దగ్గరకు వచ్చే కొద్దీ దౌర్జన్యాలు, దాష్టీకాలు ఇంకా పెరుగుతాయి. అధికార పార్టీయే శాంతిభద్రతల సమస్య సృష్టిస్తోంది. 2024లో అధికారం దక్కదనే ఆందోళన వారిలో కనిపిస్తోంది. ముఖ్యమంత్రి అనేక సందర్భాల్లో చేసిన వ్యాఖ్యల్ని పరిశీలిస్తే అది అర్థమవుతోంది. రోడ్డు బాగోలేదని పోస్టు పెడితే కూడా కేసులా? సీఎం తాను సంక్షేమ పథకాలకు నేరుగా బటన్‌ నొక్కి లబ్ధి చేకూరుస్తున్నానని అంటూ... ప్రశ్నించే ప్రజలు, ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారు. ఇప్పటికిప్పుడు ప్రజలు వీధుల్లోకి వచ్చి నిరసన తెలియజేయకపోవచ్చు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా బయటకొస్తే ఎదురవుతున్న దమనకాండను చూసి వెనుకంజ వేస్తున్నారు. ఇది తాత్కాలికమే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని