తెదేపా డీఎన్‌ఏ బీసీలు

‘‘తెదేపా డీఎన్‌ఏ బీసీలు...బీసీల గుండెల్లో తెదేపా.. జయహో బీసీ’’ అని తెదేపా అధినేత చంద్రబాబు బుధవారం ట్వీట్‌ చేశారు.

Published : 08 Dec 2022 04:42 IST

తెదేపా అధినేత చంద్రబాబు

ఈనాడు డిజిటల్‌, అమరావతి : ‘‘తెదేపా డీఎన్‌ఏ బీసీలు...బీసీల గుండెల్లో తెదేపా.. జయహో బీసీ’’ అని తెదేపా అధినేత చంద్రబాబు బుధవారం ట్వీట్‌ చేశారు.

బీసీ నేతల్ని హత్య చేయించినందుకా?: నారా లోకేశ్‌

రాష్ట్రంలో బీసీ నేతల్ని, కార్యకర్తల్ని అంతమొందించినందుకా ‘జయహో బీసీ సభ’ అని తెదేపా ప్రధానకార్యదర్శి నారా లోకేశ్‌ ధ్వజమెత్తారు. బీసీ సబ్‌ప్లాన్‌ నిధులు దారిమళ్లించడం, స్థానికసంస్థల్లో తెదేపా కల్పించిన రిజర్వేషన్లను తగ్గించడం, ఆదరణ పథకాలను నిలిపివేయడం బీసీ ద్రోహం కాదా? అని ట్విటర్‌లో ప్రశ్నించారు. వెనకబడినవర్గాల వెన్ను విరిచిన జగన్‌కు బీసీల పేరెత్తే అర్హత లేదని మండిపడ్డారు.

సభలో సగం మంది వాలంటీర్లు, పోలీసులే: బుద్దా వెంకన్న

బీసీ సభలో సగం మంది వాలంటీర్లు, పోలీసులు, బారికేడ్లే ఉన్నాయని తెదేపా ప్రధానకార్యదర్శి బుద్దా వెంకన్న ఎద్దేవాచేశారు. ‘మత్స్యకారుల నోట్లో మట్టికొట్టిన జగన్‌రెడ్డి.. సీదిరి అప్పలరాజుకు మంత్రి పదవిస్తే సరిపోతుందా? కల్లు గీత కార్మికుల జీవితాల్ని తన నకిలీ మద్యానికి బలిచేసి.. జోగి రమేశ్‌కు పదివిస్తే న్యాయం జరుగుతుందా? ఎన్నికల స్టంట్‌గానే జగన్‌ బీసీ జపం మొదలుపెట్టారు’ అని పేర్కొన్నారు.

బీసీ సభ పెట్టే అర్హత జగన్‌కు లేదు: అయ్యన్న

బీసీ సభ పెట్టే అర్హత జగన్‌కు లేదని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యులు చింతకాయల అయ్యన్నపాత్రుడు విమర్శించారు. ‘బీసీలు అధికంగా ఉండే ఉత్తరాంధ్రలో సైతం రెడ్డి సామంతరాజే పాలిస్తున్నారు. మంత్రులు ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణలు వై.వి.సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి కాళ్లు పట్టుకుని పనులు చేయించుకుంటున్నారు. వైకాపా పాలనలో 26 మంది బీసీ నాయకులను చంపేశారు. 2,650 మందిపై అక్రమ కేసులు పెట్టార’ని విమర్శించారు.

రెండింటిలో ఒక పదవి బీసీకి ఇవ్వండి: తులసిరెడ్డి

బీసీపై వైకాపాకు ప్రేముంటే ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్ష పదవుల్లో ఏదో ఒకటి ఆ వర్గానికి కేటాయించాలని ఏపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎన్‌.తులసిరెడ్డి డిమాండ్‌ చేశారు. 56 బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసి...రూపాయి నిధులివ్వకుండా ఛైర్మన్లను ఉత్సవ విగ్రహాలను చేసిన జగన్‌ దీనికి ఏం సమాధానం చెబుతారు? అని ప్రశ్నించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని