దిల్లీ నగరం ఆప్‌దే

దేశ రాజధానిలోని నగరపాలక సంస్థ ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) విజయం సాధించింది. గత 15 ఏళ్లుగా ఇది భాజపా ఏలుబడిలో ఉంది.

Updated : 08 Dec 2022 05:12 IST

నగరపాలక సంస్థ ఎన్నికల్లో ఘన విజయం
కాషాయ కోటను బద్దలుకొట్టిన కేజ్రీవాల్‌
15 ఏళ్ల తర్వాత అధికారం కోల్పోయిన భాజపా
మరింత కుదించుకుపోయిన కాంగ్రెస్‌

దిల్లీ: దేశ రాజధానిలోని నగరపాలక సంస్థ ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) విజయం సాధించింది. గత 15 ఏళ్లుగా ఇది భాజపా ఏలుబడిలో ఉంది. 250 వార్డులకు జరిగిన ఎన్నికల ఫలితాలు బుధవారం వెల్లడయ్యాయి. 134 వార్డుల్లో ఆప్‌, 104 వార్డుల్లో భాజపా విజయం సాధించాయి. దేశవ్యాప్త విస్తరణకు ఉవ్విళ్లూరుతున్న చీపురు గుర్తు పార్టీకి నైతిక బలం లభించినట్లయింది. ఆధిక్యానికి అవసరమైన 126 స్థానాలను దాటగలగడంతో మేయర్‌ సీటు ఆప్‌ వశమైనట్లే. భాజపా దిల్లీ చీఫ్‌ ఆదేశ్‌ గుప్తా నియోజకవర్గమైన పటేల్‌నగర్‌లోని నాలుగు వార్డుల్లోనూ కాషాయ పార్టీ ఓడిపోయింది. కేవలం 9 స్థానాలకు పరిమితమై కాంగ్రెస్‌ పూర్తిగా చతికిలపడింది. మూడుచోట్ల స్వతంత్రులు విజయం సాధించారు. ఈసారి భాజపా ఘోరంగా విఫలం కాబోతోందని ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనా వేసినా ఫలితాలు దానికి కొంత భిన్నంగా వచ్చాయి. 2017లో దిల్లీలో మూడు నగరపాలక సంస్థలు ఉన్నప్పుడు 272 వార్డులకు గానూ భాజపా 181 వార్డుల్లో గెలిచింది. ఆ ఎన్నికల్లో ఆప్‌ 48, కాంగ్రెస్‌ 30 చోట్ల నెగ్గాయి.

మోదీ ఆశీర్వదించాలి: కేజ్రీవాల్‌

దిల్లీ నగరపాలక సంస్థ (ఎంసీడీ) ఎన్నికల్లో విజయంపై ఆప్‌ జాతీయ కన్వీనర్‌, ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ హర్షం వ్యక్తంచేశారు. రాజధానిలో పౌర సదుపాయాలు మెరుగుపరచడానికి అన్ని వర్గాలతో పాటు ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర ప్రభుత్వం ‘ఆశీస్సులు’ అందించాలని కోరారు. తననొక కుమారుడిగా, సోదరుడిగా భావించి ఎంసీడీని నిర్వహించే బాధ్యతను అప్పగించినందుకు ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. విజయోత్సవ సభలో ఆయన ప్రసంగించారు. నగరపాలక సంస్థలో ప్రస్తుతం ఉన్న లంచగొండితనాన్ని నిర్మూలించి అవినీతి రహితంగా మారుస్తామన్నారు. దిల్లీ ప్రజలు యావత్‌ దేశానికి ఓ సందేశం ఇచ్చారని పేర్కొన్నారు.

ఒకటి..మూడు..ఒకటి

1958లో ఏర్పాటైన ఎంసీడీని 2012లో నాటి ముఖ్యమంత్రి షీలా దీక్షిత్‌ హయాంలో మూడు కార్పొరేషన్లుగా విభజించారు. వాటిని ఈ ఏడాది విలీనం చేసి ఎంసీడీని పునరుద్ధరించారు. గుజరాత్‌ ఎన్నికల ఫలితాలు గురువారం వెలువడనున్న వేళ.. దీని ఫలితాలు ఆప్‌ శ్రేణుల్లో ఉత్సాహం నింపాయి. పార్టీ కార్యాలయం వద్ద కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు.


ఫలించని కమలనాథుల పథకం

గుజరాత్‌, హిమాచల్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలకు సమాంతరంగా ఎంసీడీ ఎన్నికలు జరిగాయి. కేజ్రీవాల్‌ సహా ఆప్‌ కీలక నేతలు ఆ రాష్ట్రాల ప్రచారంలోనే బిజీగా ఉన్నారు. అదే సమయంలో ఎంసీడీ ఎన్నికల షెడ్యూల్‌ వచ్చింది. తమ పార్టీని ఇబ్బంది పెట్టేందుకే భాజపా ఇలాంటి కుట్ర పన్నిందని ఆప్‌ ఆరోపించింది కూడా. కేజ్రీవాల్‌ సహా పార్టీ కీలక నేతలు పెద్దగా ప్రచారం చేయకపోయినా ఆప్‌ విజయం సాధించింది. ఒక వార్డులో ఆప్‌ అభ్యర్థిగా ట్రాన్స్‌జెండర్‌ వ్యక్తి విజయం సాధించారు. మేయర్‌ స్థానం తమ వశం అయ్యేందుకు అవకాశాలు లేకపోలేదని భాజపా అంటోంది. నామినేటెడ్‌ కౌన్సిలర్ల ఓట్లు సహా వివిధ సంఖ్యాబలాలు కీలకమని పేర్కొంది. చండీగఢ్‌ను ఉదాహరించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని