గిరిజనులకు కేంద్రం ద్రోహం

భాజపా ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణలోని గిరిజనులకు తీరని ద్రోహం చేస్తోందని రాష్ట్ర గిరిజన, మహిళా సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ ఆరోపించారు. పోడు చట్టం తెచ్చి గిరిజనులు, ఆదివాసీలకు కేంద్రం అన్యాయం

Published : 21 Jan 2022 04:57 IST

మంత్రి సత్యవతి, ఎంపీ, ఎమ్మెల్యేలు, పల్లా ధ్వజం

విలేకరుల సమావేశంలో మంత్రి సత్యవతి, ఎమ్మెల్యే రవీంద్రనాయక్‌, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌ రెడ్డి,

ఎంపీ మాలోతు కవిత, ఎమ్మెల్యే హరిప్రియనాయక్‌

ఈనాడు, హైదరాబాద్‌: భాజపా ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణలోని గిరిజనులకు తీరని ద్రోహం చేస్తోందని రాష్ట్ర గిరిజన, మహిళా సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ ఆరోపించారు. పోడు చట్టం తెచ్చి గిరిజనులు, ఆదివాసీలకు కేంద్రం అన్యాయం చేసిందన్నారు. విభజన చట్టంలోని హామీలను అమలు చేయలేదని, ఎస్టీ రిజర్వేషన్ల పెంపుదలకు రాష్ట్ర ప్రభుత్వం పంపిన తీర్మానాన్ని ఆమోదించడం లేదని విమర్శించారు. ఈ నేపథ్యంలో గిరిజనులు, ఆదివాసీల తరఫున మాట్లాడే హక్కు రాష్ట్ర భాజపా అధ్యక్షుడు బండి సంజయ్‌కు ఏ మాత్రం లేదని మంత్రి సత్యవతి రాథోడ్‌ పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌ హయాంలో గిరిజనులు ఆత్మగౌరవంతో బతుకుతున్నారని, పోడు భూములపై మంత్రివర్గ ఉపసంఘాన్ని వేశారని, త్వరలోనే ఆ సమస్య పరిష్కారమవుతుందని తెలిపారు. గురువారం తెరాస శాసనసభాపక్ష కార్యాలయంలో రైతుబంధు సమితి ఛైర్మన్‌ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎంపీ మాలోతు కవిత, ఎమ్మెల్యేలు రవీంద్రనాయక్‌, హరిప్రియనాయక్‌లతో కలిసి సత్యవతి విలేకరులతో మాట్లాడారు.

ఒక్కచోటా డిపాజిటు రాదు

‘‘గిరిజన నియోజకవర్గాలను గెలుచుకుంటామని రాష్ట్ర భాజపా నేతలు పగటి కలలు కంటున్నారు. ఎన్నికల్లో ఆ పార్టీకి ఒక్క చోటా డిపాజిటు రాదు. పోడు చట్టం కేంద్రం పరిధిలో ఉంటుందని తెలుసుకోకుండా తామే ఉద్యమం చేస్తామని సంజయ్‌ చెప్పడం సిగ్గుచేటు. విభజన చట్టం హామీల మేరకు గిరిజన విశ్వవిద్యాలయం, బయ్యారం ఉక్కు కర్మాగారాన్ని ఇవ్వడం లేదు. దమ్ముంటే మేడారం జాతరకు సంజయ్‌ రూ. 1000 కోట్లు తేవాలి. ఇవన్నీ చేయకుండా తెలంగాణ గిరిజన తండాల్లో తిరిగితే పంజాబ్‌ లో మీ ప్రధానికి పట్టిన గతి మీకు పడుతుంది’’ అని సత్యవతి, పల్లా, కవిత, రవీంద్రనాయక్‌, హరిప్రియనాయక్‌లు పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని