icon icon icon
icon icon icon

నినాదాలు తప్ప.. నిధులివ్వని మోదీ

‘మోదీ వల్లే తెలంగాణకు అన్యాయం జరిగింది. భాజపా పదేళ్ల పాలనలో ఏ వర్గానికీ న్యాయం జరగలేదు. తీవ్ర నష్టం జరిగింది. మేకిన్‌ ఇండియా, సబ్‌కా సాథ్‌- సబ్‌కా వికాస్‌, బేటీ బచావో, బేటీ పఢావో లాంటి నినాదాలు తప్ప మోదీ రాష్ట్రానికి నిధులిచ్చింది లేదు.

Published : 26 Apr 2024 03:32 IST

ఆయన వల్లే తెలంగాణకు అన్యాయం
భువనగిరిలో భాజపా, కాంగ్రెస్‌ కుమ్మక్కు
రైతులంటే కాంగ్రెస్‌ ప్రభుత్వానికి లెక్కలేదు
రోడ్‌షోలో భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌

ఈనాడు, నల్గొండ: ‘మోదీ వల్లే తెలంగాణకు అన్యాయం జరిగింది. భాజపా పదేళ్ల పాలనలో ఏ వర్గానికీ న్యాయం జరగలేదు. తీవ్ర నష్టం జరిగింది. మేకిన్‌ ఇండియా, సబ్‌కా సాథ్‌- సబ్‌కా వికాస్‌, బేటీ బచావో, బేటీ పఢావో లాంటి నినాదాలు తప్ప మోదీ రాష్ట్రానికి నిధులిచ్చింది లేదు. దేశవ్యాప్తంగా దళితులు, మహిళలపై దాడులు, నిరుద్యోగం, పేదరికం పెరిగాయి. 18 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే ఏ ఒక్కటీ నింపలేదు. భాజపా ఓట్ల కోసం వస్తుంటే.. కాంగ్రెస్‌ ఒట్లతో వస్తోంది. యువత, రైతులు, మహిళలు ఆలోచించి పరిణతితో భారాసకు ఓటేయాలి’ అని ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. కేసీఆర్‌ ‘పోరుబాట బస్సుయాత్ర’ రెండోరోజు ఉమ్మడి నల్గొండ జిల్లాలో కొనసాగింది. భువనగిరిలో గురువారం రాత్రి ఏర్పాటు చేసిన రోడ్‌షోలో కేసీఆర్‌ పాల్గొన్నారు. అనంతరం పార్టీ అభ్యర్థి క్యామ మల్లేశ్‌కు మద్దతుగా నిర్వహించిన కూడలి సమావేశంలో ప్రసంగించారు. డాలర్‌తో రూపాయి విలువ దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రూ.83కి చేరిందని.. ఇదంతా భాజపా, మోదీ పాలన ఫలితమేనని కేసీఆర్‌ దుయ్యబట్టారు. రాష్ట్రంలో రైతుల పరిస్థితిని కాంగ్రెస్‌ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. మైనార్టీలను ఉద్దేశించి మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్‌కు ఓటేస్తే భాజపాకు ఓటేసినట్లేనని, భారాస లౌకిక పార్టీ అన్నారు. తన బిడ్డను అరెస్టు చేసినా భయపడటం లేదని, మోదీతో పోరాడతామని తెలిపారు. మళ్లీ భారాస సర్కారే వస్తుందని, మైనార్టీలకు గతంలో ఇచ్చిన అన్ని పథకాలనూ అందిస్తామన్నారు.

భువనగిరిలో భాజపా, కాంగ్రెస్‌ మిలాఖత్‌

‘యాదాద్రిలో అద్భుతంగా దేవాలయం నిర్మించుకున్నాం. యాదగిరిగుట్టను ఏనాడూ ఓట్ల కోసం వాడుకోలేదు. భాజపాకు భారాస బీటీం అని కొంత మంది విమర్శిస్తున్నారు. భువనగిరి మున్సిపాలిటీలో భాజపా, కాంగ్రెస్‌ మిలాఖత్‌ అయి.. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన వ్యక్తికి ఛైర్మన్‌, భాజపాకు వైస్‌ ఛైర్మన్‌ ఇచ్చారు. ఇప్పుడు ఎవరు ఎవరికి బీ టీం? భాజపా హయాంలో ఒక్క నవోదయ పాఠశాల, వైద్య కళాశాల రాలేదు. ఎన్నోసార్లు లేఖలు రాసినా, దిల్లీ వెళ్లి మొరపెట్టుకున్నా కేంద్ర ప్రభుత్వం సాయం చేయలేదు. ప్రస్తుతం భాజపా నుంచి పోటీ చేస్తున్న వ్యక్తి గతంలో ఎంపీగా ఉన్నప్పుడు నవోదయ పాఠశాల తీసుకురాలేదు. అప్పుడు పని చేయనప్పుడు ఇప్పుడెలా చేస్తారు? ఆయనకు ఎందుకు ఓటేయాలి?

అక్షింతలు, ప్రసాదాలు, పులిహోరలపైనే దృష్టి

రాష్ట్రంలో గత ఎన్నికల్లో నలుగురు భాజపా ఎంపీలను గెలిపిస్తే ఒకరు కేంద్ర మంత్రి అయ్యారు. ఆయన రాష్ట్రానికి ఒక్క రూపాయి తీసుకురాలేదు. ఒక్క పనీ చేయలేదు. మళ్లీ వాళ్లను ఎందుకు గెలిపించాలి? అక్షింతలు, ప్రసాదాలు, పులిహోరల పంపిణీపైనే వారి దృష్టి. మా వయసు మీద పడుతోంది. రేపటి తెలంగాణ మీది. యువత, మహిళలు, రైతులు ఆలోచించి బుద్ధితో భారాసకు ఓటెయ్యాలి. ఎవరు గెలిస్తే లాభమో ఆలోచించాలి. సమైక్య పాలనలో తెలంగాణలో వలసలు, వ్యాపారాలు దెబ్బతింటే పదేళ్ల భారాస పాలనలో అన్ని వర్గాలకూ న్యాయం జరిగింది.

స్కూటీలు లేవు లూటీలే

ఎన్నికల్లో అడ్డగోలు హామీలతో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చింది. విద్యార్థినులకు ఎలక్ట్రిక్‌ స్కూటీలు ఇస్తామని హామీ ఇచ్చారు. వారికి స్కూటీలు రాలేదు కానీ.. రాష్ట్రంలో లూటీ జరుగుతోంది. రైతులు మళ్లీ రాత్రిపూట పొలానికి వెళ్లి నీళ్లు పెట్టుకునే దుస్థితి వచ్చింది. గతంలో బంద్‌ అయిన రైతు ఆత్మహత్యలు మళ్లీ మొదలయ్యాయి. ఆత్మహత్యలు చేసుకున్న రైతుల వివరాలు 48 గంటల్లో ఇవ్వాలని ముఖ్యమంత్రి సవాల్‌ చేస్తే.. 4 గంటల్లో 225 మంది వివరాలు సెల్‌ఫోన్‌ నంబర్లతో సహా ఇచ్చాం. కానీ ముఖ్యమంత్రి సహా ఎవరూ బాధిత కుటుంబాలను పరామర్శించలేదు. ఈ ప్రభుత్వానికి రైతులపై ప్రేమలేదు. గురుకులాల్లో కల్తీ, విషాహారం పెడుతున్నారు. ఇప్పటికే భువనగిరిలో ఒక విద్యార్థి మరణించాడు. మెగా డీఎస్సీని దగా చేశారు. వరికి రూ.500 బోనస్‌ బోగస్‌ అయింది. ప్రైవేటు కాలేజీలకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇవ్వలేదు. నిరుద్యోగ భృతి అందలేదు. జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటించలేదు’ అని కేసీఆర్‌ విమర్శించారు.

ఉమ్మడి నల్గొండలోనే రెండో రోజు

బస్సుయాత్రలో తొలిరోజు బుధవారం మిర్యాలగూడ, సూర్యాపేటల్లో రోడ్‌షో నిర్వహించిన కేసీఆర్‌.. రాత్రి సూర్యాపేటలోనే బస చేశారు. రెండోరోజు గురువారం అక్కడి నుంచి సాయంత్రం 4 గంటలకు బయల్దేరి సూర్యాపేట జిల్లా అర్వపల్లి, తిరుమలగిరి మీదుగా జనగామ జిల్లా దేవరుప్పలకు చేరుకున్నారు. దారి పొడవునా భారాస కార్యకర్తలు, ప్రజలు, కేసీఆర్‌కు పూలతో స్వాగతం పలికారు. అనంతరం ఆయన జనగామ బైపాస్‌ మీదుగా ఆలేరు నుంచి భువనగిరికి చేరుకున్నారు. స్థానిక గాంధీ పార్కు నుంచి వినాయక చౌరస్తా వరకు ఎమ్మెల్యేలు జగదీశ్‌రెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, లోక్‌సభ అభ్యర్థి క్యామ మల్లేశ్‌లతో కలిసి రోడ్‌షో నిర్వహించారు. అనంతరం అక్కడి నుంచి ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రానికి పయనమయ్యారు. మాజీ ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్‌రెడ్డి, గొంగిడి సునీత, చిరుమర్తి లింగయ్య, గాదరి కిశోర్‌, భిక్షమయ్యగౌడ్‌, మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, నాయకులు చింతల వెంకటేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


దేవుడు నన్ను తెలంగాణ కోసమే పుట్టించాడు

భారాస ఓడినా బాధలేదు. క్యాడర్‌, ప్రజలు నాతోనే ఉన్నారు. తెలంగాణ ప్రజల గుండె చీలిస్తే కనిపించేది కేసీఆర్‌. కేసీఆర్‌ గుండె చీలిస్తే కనిపించేది తెలంగాణ. నన్ను తెలంగాణ కోసమే దేవుడు పుట్టించాడు. రాష్ట్రంలో రైతులకు, మహిళలకు ఏ కష్టం వచ్చినా నా ప్రాణం ఉన్నంత వరకు పోరాడతాను. రైతులకు మోసం జరిగితే సహించను.

భారాస అధినేత కేసీఆర్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img