icon icon icon
icon icon icon

భాజపా అంటే.. బ్రిటిష్‌ జనతా పార్టీ

‘‘వందల ఏళ్ల క్రితం భారతీయులను విభజించి పాలించిన ఈస్ట్‌ ఇండియా కంపెనీ తరహాలోనే ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌ షా ప్రవర్తిస్తున్నారు.

Updated : 26 Apr 2024 05:28 IST

హామీలు అమలు చేయనందుకే కార్ఖానాకు కారు
జీహెచ్‌ఎంసీలో విలీనంతోనే కంటోన్మెంట్‌ సమస్యల పరిష్కారం
అత్తాపూర్‌, కంటోన్మెంట్‌ రోడ్‌షోల్లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

ఈనాడు-హైదరాబాద్‌, రాజేంద్రనగర్‌, బోయిన్‌పల్లి కార్ఖానా, న్యూస్‌టుడే: ‘‘వందల ఏళ్ల క్రితం భారతీయులను విభజించి పాలించిన ఈస్ట్‌ ఇండియా కంపెనీ తరహాలోనే ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌ షా ప్రవర్తిస్తున్నారు. సముద్రం పక్కన వ్యాపారం చేసుకుంటామంటూ ఈస్ట్‌ ఇండియా కంపెనీ గుజరాత్‌లోని సూరత్‌లో ప్రస్థానాన్ని ప్రారంభించి.. భారత్‌ను ఆక్రమించింది. బ్రిటిష్‌వారు పాలించినప్పుడు రిజర్వేషన్లు లేవు. వారి ఆలోచనలనే మోదీ, అమిత్‌షా అమలు చేయాలని చూస్తున్నారు. అందుకే భాజపా అంటే భారతీయ జనతా పార్టీ కాదు.. బ్రిటిష్‌ జనతా పార్టీ. ఆ పార్టీ అభ్యర్థులను చిత్తుచిత్తుగా ఓడించండి’’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. గురువారం కాంగ్రెస్‌ పార్టీ చేవెళ్ల ఎంపీ అభ్యర్థి గడ్డం రంజిత్‌రెడ్డికి మద్దతుగా హైదరాబాద్‌లోని అత్తాపూర్‌ చౌరస్తాలో, కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా అన్నానగర్‌ చౌరస్తాలో నిర్వహించిన రోడ్‌షోల్లో ఆయన ప్రసంగించారు.

నమో అంటే నమ్మించి మోసం..

‘‘పదేళ్లుగా ప్రధానిగా ఉన్న నరేంద్ర మోదీని నమో అంటున్నారు. నమో అంటే నమ్మించి మోసం చేయడం. రైతుల ఆదాయాన్ని అదానీ, అంబానీ, అమెజాన్‌ కంపెనీలకు తాకట్టు పెట్టారు. రాష్ట్ర విభజన అంశాల్లో కీలకమైన బయ్యారం ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేయలేదు. రైల్‌ కోచ్‌ ఫ్యాక్టరీని కాజీపేట నుంచి లాతూర్‌కు తరలించారు. ట్రిపుల్‌ ఐటీ ఇవ్వలేదు. ఐటీఐఆర్‌ను రద్దు చేశారు. అతికష్టమ్మీద గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఇచ్చారు.

ప్రజల పట్ల కేసీఆర్‌ దుర్మార్గం..

సీఎంగా తొమ్మిదిన్నరేళ్లు పాలించిన    కేసీఆర్‌... ప్రజల పట్ల దుర్మార్గంగా ప్రవర్తించారు. ఇచ్చిన హామీలను అమలు చేయనందుకే ఆయన కారును ప్రజలు కార్ఖానాకు పంపించారు. కంటోన్మెంట్‌ ఎమ్మెల్యేగా పనిచేసిన సాయన్న విషయంలో కేసీఆర్‌ అనుచితంగా వ్యవహరించారు. ఆయన అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించలేదు. ఉద్యమకారుడు గద్దర్‌.. కేసీఆర్‌ను కలిసేందుకు ప్రగతిభవన్‌కు వెళ్తే నాలుగు గంటలపాటు బయటే నిలబెట్టి వెనక్కి పంపించారు. ప్రగతిభవన్‌ తలుపులు కేవలం కాంట్రాక్టర్లు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులకే తెరిచారు. సాయన్న, గద్దర్‌ల ఉసురు తగలడం వల్లే ఎన్నికల్లో కేసీఆర్‌ ఓడిపోయారు. చేవెళ్లలో మంచివారైన కాసాని జ్ఞానేశ్వర్‌కు టికెట్‌ ఇచ్చి.. విశ్వేశ్వర్‌రెడ్డికి ఓట్లు వేయాలంటూ కేసీఆర్‌ సైగలు చేస్తున్నారు. ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లు తొలగిస్తామంటూ దేశాన్ని భాజపా కలుషితం చేస్తోంది. విశ్వేశ్వర్‌రెడ్డి కుటుంబానికి మంచి చరిత్ర ఉంది. ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తూ.. మీ కుటుంబ చరిత్రను కలుషితం చేసుకోవద్దు.

రంజిత్‌రెడ్డిని గెలిపిస్తే మూసీ ప్రక్షాళన

మూసీనది ప్రక్షాళనకు రూ.లక్ష కోట్లు అవసరం. కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు, నిధులు రావాలంటే చేవెళ్ల ఎంపీగా రంజిత్‌రెడ్డిని గెలిపించాలి. మూసీతో పాటు జంట జలాశయాలను అభివృద్ధి చేస్తాం. వికారాబాద్‌ను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతాం. సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ ప్రజల సమస్యలు పరిష్కారం కావాలంటే ఈ ప్రాంతాన్ని గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ)లో కలపాలి. అందుకు ప్రత్యామ్నాయంగా ప్రభుత్వ భూములు ఇస్తామన్నా ససేమిరా అన్నారు. ఎంపీ హోదాలో కంటోన్మెంట్‌ ప్రాంతంలోని సమస్యల్లో సాధ్యమైనన్ని పరిష్కరించాను.

కరోనా సమయంలో మిలిటరీ ఆసుపత్రి మూతపడితే.. రూ.5 కోట్ల నిధులిచ్చి తెరిపించాను. ప్రజలకు వైద్యసేవలు అందించాలన్న లక్ష్యంతో అల్వాల్‌లో టిమ్స్‌ ఆసుపత్రి నిర్మాణాన్ని వేగవంతం చేశాం’’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. కార్యక్రమంలో ఎంపీ అభ్యర్థులు గడ్డం రంజిత్‌రెడ్డి(చేవెళ్ల), సునీతా మహేందర్‌రెడ్డి(మల్కాజిగిరి), కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీగణేశ్‌, ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి, నాయకులు అనితా హరినాథ్‌రెడ్డి, చిగురింత పారిజాతారెడ్డి, కస్తూరి నరేందర్‌, నిజాముద్దీన్‌, పామేన భీంభరత్‌ తదితరులు పాల్గొన్నారు. అత్తాపూర్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి సిక్కులు పాగా చుట్టి.. కృపాణం బహూకరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img