icon icon icon
icon icon icon

రిజర్వేషన్ల రద్దుకు భాజపా కుట్ర

ప్రస్తుత ఎన్నికలు రిజర్వేషన్లు ఉండాలా, రద్దు కావాలా అన్న అంశంపై రిఫరెండం అని పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. రిజర్వేషన్లు ఉండాలని కాంగ్రెస్‌ పార్టీ చెబుతోందని, వాటిని రద్దు చేయడం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీల హక్కులను కాలరాయాలని భాజపా కుట్ర చేస్తోందని ఆయన ఆరోపించారు.

Updated : 26 Apr 2024 05:40 IST

వాటి కొనసాగింపుపై ఈ ఎన్నికలు రిఫరెండం
రిజర్వేషన్లు కావాలంటే కాంగ్రెస్‌కు ఓటేయండి
పీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్‌రెడ్డి
పదేళ్ల భాజపా పాలనపై ఛార్జిషీట్‌ విడుదల

ఈనాడు, హైదరాబాద్‌: ప్రస్తుత ఎన్నికలు రిజర్వేషన్లు ఉండాలా, రద్దు కావాలా అన్న అంశంపై రిఫరెండం అని పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. రిజర్వేషన్లు ఉండాలని కాంగ్రెస్‌ పార్టీ చెబుతోందని, వాటిని రద్దు చేయడం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీల హక్కులను కాలరాయాలని భాజపా కుట్ర చేస్తోందని ఆయన ఆరోపించారు. రిజర్వేషన్లను పెంచే బాధ్యతను కాంగ్రెస్‌ తీసుకుంటుందని, ఓబీసీలకు 50 శాతానికి పైబడి రిజర్వేషన్లు ఇవ్వాలనేది తమ పార్టీ విధానమని పేర్కొన్నారు. రిజర్వేషన్లు వద్దనుకుంటే భాజపాకు, కావాలనుకుంటే కాంగ్రెస్‌కు ఓటేయాలన్నారు. ‘‘నయవంచన- పదేళ్ల మోసం.. వందేళ్ల విధ్వంసం’’ పేరుతో భాజపా పాలనపై రాష్ట్ర కాంగ్రెస్‌ రూపొందించిన ఛార్జిషీట్‌ను గాంధీభవన్‌లో సీఎం గురువారం విడుదల చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు.

‘‘ఈ దేశాన్ని ఎక్స్‌రే తీసి.. కులాలు, ఉప కులాల వారీగా జనాభాను లెక్కించి, వాటి ప్రకారం రిజర్వేషన్లు పెంచుతామని రాహుల్‌ గాంధీ ప్రకటించారు. కాంగ్రెస్‌ గెలిస్తే రిజర్వేషన్లు 75 శాతానికి చేరతాయని, వాటిని రద్దు చేయాలని భాజపా కుట్ర చేస్తోంది. మండల్‌ కమిషన్‌ సిఫారసులు వచ్చినప్పుడు కమండల్‌ నినాదంతో భాజపా నేత ఆడ్వాణీ రథయాత్ర చేశారు. రెండు జాతుల మధ్య చిచ్చుపెట్టి ఆ సిఫారసులు అమలు కాకుండా ఆ పార్టీ అడ్డుకుంది. ఇప్పుడు కూడా కాంగ్రెస్‌పై విషప్రచారం చేసి.. ఎన్నికల్లో నెగ్గి రిజర్వేషన్లను రద్దు చేయాలని భాజపా చూస్తోంది. నోట్ల రద్దు, సీఏఏ అమలు వంటి వాటి విషయంలో భాజపా ఎలా వ్యవహరించిందో అందరూ చూశారు. భాజపాకు వేసే ప్రతి ఓటు రిజర్వేషన్ల రద్దుకు ఉపయోగపడుతుంది. ఆ పార్టీ ఒక్క సీటు గెలిచినా ఎస్సీ, ఎస్టీ, బీసీల హక్కులను కాలరాయడానికే ఉపయోగించుకుంటుంది. ఎస్సీ వర్గీకరణ కోసం పోరాడుతున్నవారు తాత్కాలిక రాజకీయ లబ్ధి కోసం భాజపాకు మద్దతిస్తే నూటికి నూరు శాతం రిజర్వేషన్ల రద్దుకు దారితీస్తుంది. ఆర్‌ఎస్‌ఎస్‌ విధానాన్ని గతంలో భాజపా అమలు చేసింది. ట్రిపుల్‌ తలాక్‌, 370 ఆర్టికల్‌ వంటివి రద్దు చేసింది. ప్రతిపక్షాలు అభ్యంతర పెడుతున్నా రైతు వ్యతిరేక చట్టాలను తెచ్చింది. కర్షకుల పోరాటంతో వాటిని రద్దు చేసింది. వచ్చే సంవత్సరం ఆర్‌ఎస్‌ఎస్‌ ఏర్పడి 100 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా రిజర్వేషన్లు రద్దు చేయాలన్న పట్టుదలతో ఉంది.

రిజర్వేషన్లు రద్దు చేస్తామని ఆర్‌ఎస్‌ఎస్‌ పెద్దలు, భాజపా ఎంపీలు చాలా సందర్భాల్లో చెప్పారు. అందుకు లోక్‌సభలో 400 సీట్లు కావాలి. పార్లమెంటులో బిల్లును ఆమోదించడంతో పాటు అన్ని రాష్ట్రాలపై ఒత్తిడి తేవడానికి భాజపా కుట్ర పన్నుతోంది. పదేళ్లలో ఎన్డీయే ప్రభుత్వ వైఫల్యం, భాజపా కుట్రలను ప్రజలకు వివరించాల్సిన బాధ్యత కాంగ్రెస్‌ శ్రేణులపై ఉంది. ఏటా 2 కోట్ల ఉద్యోగాలిస్తామన్నారు. పదేళ్లలో 20 కోట్లకు బదులు.. 7,21,681 ఉద్యోగాలిచ్చామని పార్లమెంటులో నేను అడిగిన ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వం సమాధానమిచ్చింది. సామాన్యులు బతకలేని విధంగా నిత్యావసర ధరలను విపరీతంగా పెంచారు. చేనేత వస్త్రాలు మొదలు కుటీర పరిశ్రమల వరకు జీఎస్టీ పెంచి, దోపిడీకి పాల్పడుతున్నారు. అగర్‌బత్తీలనూ జీఎస్టీ నుంచి మినహాయించలేదు. ‘కుక్క పిల్ల, అగ్గి పుల్ల, సబ్బు బిల్ల కాదేదీ కవిత్వానికి అనర్హం’ అని శ్రీశ్రీ చెప్పినట్లుగా చెప్పినట్లుగా ఈరోజు మోదీ కూడా ఏదీ అనర్హం కాదన్న రీతిలో జీఎస్టీ వేస్తున్నారు. పెన్సిళ్లు, రబ్బర్లు, అగర్‌బత్తీలను సైతం జీఎస్టీ నుంచి మినహాయించలేదు. 1947 నుంచి 2014 వరకూ 13 మంది ప్రధాన మంత్రులు రూ.55 లక్షల కోట్ల రుణాలు తీసుకుంటే, 2014 నుంచి 2024 వరకూ పదేళ్లలో మోదీ ఒక్కరే రూ.113 లక్షల కోట్ల అప్పులు తెచ్చారు. దేశాన్ని అప్పుల ఊబిలో ముంచారు. పోర్టులు, జాతీయ రహదారులు, నవరత్న కంపెనీలు వంటి రూ.60 లక్షల కోట్ల ఆస్తులను కాంగ్రెస్‌ పాలనలో కష్టపడి సృష్టిస్తే.. గత పదేళ్లలో రూ.6 లక్షల కోట్లకే కార్పొరేట్‌ కంపెనీలకు అమ్మేశారు’’ అని రేవంత్‌రెడ్డి అన్నారు.

మతకల్లోలాలు సృష్టించేందుకు భాజపా యత్నం: భట్టి

మతకల్లోలాలు సృష్టించేందుకు భాజపా యత్నిస్తోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆరోపించారు. దేశ సంపదను కొద్దిమందికి కట్టబెట్టేందుకు మోదీ ప్రయత్నిస్తున్నారని, కులగణన చేపట్టి అధిక శాతం జనాభాకు పంచడమే రాహుల్‌ ధ్యేయమని తెలిపారు. పదేళ్లుగా దేశ ప్రజలను మోదీ ప్రభుత్వం ఎలా మోసం చేసిందో చూశామని, రాబోయే ఎన్నికల్లో గెలుపొందేందుకు మళ్లీ మోసపూరిత హామీలు ఇస్తున్నారని ఆయన విమర్శించారు. నల్లధనాన్ని వెలికితీసి దేశంలోని పేదల ఖాతాల్లో రూ.15 లక్షల చొప్పున జమ చేస్తానని మోదీ గతంలో హామీ ఇచ్చారని, ఏ ఒక్కరి ఖాతాలోనూ జమ కాలేదన్నారు. పెద్దనోట్ల రద్దుతో నల్లధనాన్ని అరికడతామని చెప్పారని, ఎంత అరికట్టారనే సమాచారం కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం లేదన్నారు. ఛార్జిషీట్‌లో పేర్కొన్న ప్రతి విషయాన్ని ప్రతి పౌరునికి చేరేలా కాంగ్రెస్‌ సైన్యం కృషి చేయాలని భట్టి కోరారు. ఏఐసీసీ తెలంగాణ ఇన్‌ఛార్జి దీపా దాస్‌మున్షీ మాట్లాడుతూ రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు కాంగ్రెస్‌కు ఓటేయాలని కోరారు. ఇక్కడ గెలిచే కాంగ్రెస్‌ ఎంపీలు పార్లమెంటులో తెలంగాణ హక్కుల పరిరక్షణకు పోరాడతారని పేర్కొన్నారు. కార్యక్రమంలో మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌, కొండా సురేఖ, ఏఐసీసీ కార్యదర్శి రోహిత్‌ చౌధరి, పార్టీ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్లు మహేశ్‌కుమార్‌గౌడ్‌, జగ్గారెడ్డి, ఎంపీ అనిల్‌కుమార్‌ యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.


పదేళ్ల కన్నీళ్లను యాదుంచుకుందాం
భాజపా పాలనపై ఛార్జిషీట్‌లో కాంగ్రెస్‌ పిలుపు

ఈనాడు, హైదరాబాద్‌: ‘పదేళ్ల కన్నీళ్లను యాదుంచుకుందాం.. ప్రజా ద్రోహుల పాలనను అంతం చేద్దాం’ అని ఛార్జిషీట్‌లో కాంగ్రెస్‌ ప్రజలకు పిలుపునిచ్చింది. ‘నయవంచన’ శీర్షికన నాలుగు పేజీల్లో దీన్ని ముద్రించింది. మొత్తం 14 ఉప శీర్షికలతో భాజపా పాలనలో విఫలమైందంటూ ప్రస్తావించింది. సీఎం రేవంత్‌రెడ్డి గురువారం విడుదల చేసిన ఈ ఛార్జిషీట్‌లో ‘తెలంగాణకు భాజపా చేసిన ద్రోహాల చిట్టా’ పేజీలో 4 ఉప శీర్షికల కింద పేర్కొన్న పలు అంశాల్లో కొన్ని...

  • తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తామని భాజపా కాకినాడ డిక్లరేషన్‌లో పేర్కొన్నా పట్టించుకోలేదు. పైగా రాష్ట్రం ఏర్పాటైన తరవాత పార్లమెంటు సాక్షిగా మోదీ పదే పదే తెలంగాణ ఏర్పాటును ఎగతాళి చేశారు.
  • ఖమ్మం జిల్లాలో 7 మండలాల పరిధిలోని 211 గ్రామాలను బలవంతంగా ఆంధ్రాలో విలీనం చేశారు.
  • బయ్యారం స్టీల్‌ ప్లాంటు, కాజీపేట రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ, గిరిజన, ఉద్యాన విశ్వవిద్యాలయాలు, 2400 మెగావాట్ల ఎన్టీపీసీ విద్యుత్‌ ప్లాంటు వంటి విభజన చట్టంలోని ఏ ఒక్క హామీని భాజపా ప్రభుత్వం అమలు చేయలేదు.
  • పన్నుల రాబడిలో తెలంగాణ వాటాను 27 శాతానికి పైగా తగ్గించారు. తెలంగాణ నుంచి కేంద్రానికి రూపాయి పంపితే 43 పైసలను మాత్రమే తిరిగిస్తున్నారు. బిహార్‌కు రూపాయికి రూ.7.06, యూపీకి రూ.2.73, అస్సాంకు రూ.2.63, మధ్యప్రదేశ్‌కు రూ.2.42 చొప్పున ఇస్తున్నారు.
  • జీఎస్టీ పరిహారం కింద తెలంగాణకు రావాల్సిన రూ.4 వేల కోట్లు, నీతీ ఆయోగ్‌ సిఫారసు చేసిన రూ.24,205 కోట్లు, వెనుకబడిన జిల్లాల అభివృద్థి గ్రాంటు రూ.1800 కోట్లను భాజపా ప్రభుత్వం విడుదల చేయలేదు.
  • ఈ ఏడాది(2024-25) కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు ఒక్క పైసా ఇవ్వలేదు. ములుగులోని గిరిజన వర్సిటీ, నిజామాబాద్‌ పసుపు బోర్డుకు రూపాయి కూడా కేటాయించలేదు. కుంభమేళాకు రూ.100 కోట్లు ఇవ్వగా.. సమ్మక్క-సారలమ్మ జాతరకు రూ.3.14 కోట్లు మాత్రమే ఇచ్చారు.
  • 2020లో హైదరాబాద్‌లో తీవ్ర వరదలొస్తే ఎలాంటి సాయం చేయలేదు. 2023లో మహారాష్ట్రకు రూ.1,420.80 కోట్లు, ఒడిశాకు రూ.707.60 కోట్లు, బిహార్‌కు రూ.624.40 కోట్లు, గుజరాత్‌కు రూ.584 కోట్లను విపత్తు సాయం నిధుల కింద ఇచ్చిన భాజపా ప్రభుత్వం తెలంగాణను చిన్నచూపు చూసింది.
  • కృష్ణా జలాల్లో తెలంగాణకు దక్కాల్సిన వాటా మేరకు కేటాయించకుండా అన్యాయం చేస్తోంది.
  • 2022 నాటికి ప్రతి పేద కుటుంబానికి ఇల్లు ఇస్తామని హామీ ఇచ్చిన భాజపా.. రాష్ట్రంలో అసలు ఇళ్లే నిర్మించలేదు.
  • రాష్ట్రంలోని ఏ ఒక్క సాగునీటి ప్రాజెక్టుకూ జాతీయ హోదా ఇవ్వలేదు.
  • గతంలో కాంగ్రెస్‌ హయాంలో తెలంగాణకు ఇచ్చిన ఐటీఐఆర్‌ ప్రాజెక్టును భాజపా ప్రభుత్వం రద్దు చేయడంతో 13.9 లక్షల ఉద్యోగాలు, రూ.2.19 లక్షల కోట్ల పెట్టుబడుల నష్టం వాటిల్లింది.  
  • హైదరాబాద్‌ నుంచి వరంగల్‌, నాగ్‌పుర్‌ పారిశ్రామిక కారిడార్లు, ఫ్యాబ్‌ సిటీ, సీలేరు పవర్‌ ప్రాజెక్టు, నారాయణపేట చేనేత పార్కు, ఆదిలాబాద్‌ సిమెంటు పరిశ్రమ పునరుద్ధరణను కేంద్రం గాలికొదిలేసింది.
  • తెలంగాణకు ఐఐఎం, ట్రిపుల్‌ ఐటీ, వైద్య కళాశాలలను, నవోదయ విద్యాలయాలు, సైనిక్‌ స్కూళ్లు, కేంద్రీయ విశ్వవిద్యాలయాలను ఇవ్వలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img