60 ఏళ్లు దాటితే రైతు కాదంటారా?: షర్మిల

రైతుబీమాకు వయోపరిమితిని 59 ఏళ్లుగా ఎలా నిర్ణయిస్తారని, 60 ఏళ్లు దాటిన వారు రైతులు కాదా? అని వైతెపా అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. లోటస్‌పాండ్‌లో గురువారం ఆమె విలేకరుల

Published : 28 Jan 2022 04:07 IST

ఈనాడు, హైదరాబాద్‌: రైతుబీమాకు వయోపరిమితిని 59 ఏళ్లుగా ఎలా నిర్ణయిస్తారని, 60 ఏళ్లు దాటిన వారు రైతులు కాదా? అని వైతెపా అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. లోటస్‌పాండ్‌లో గురువారం ఆమె విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. రాష్ట్రంలో ఏడేళ్లలో 8 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, అందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ సిగ్గుపడాలని మండిపడ్డారు. ‘మేం చేపట్టిన రైతు ఆవేదన యాత్రలో ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు చెందిన 12 మందిని పరామర్శిస్తే 10 మందికి భూమి ఉండి కూడా రైతుబీమా అందని పరిస్థితి. ఎందుకిలా అని అడిగితే రైతు వయసు 59 ఏళ్లు దాటితే ఇవ్వరని చెప్పారు. 67 ఏళ్లున్న కేసీఆర్‌ సీఎం కావచ్చు. ఆయన ఇంటిల్లిపాదీ పదవులు అనుభవించవచ్చు. కేసీఆర్‌ ఒక్క ఎకరాలోనే కోటి రూపాయలు సంపాదించొచ్చు. కానీ సాధారణ రైతు మాత్రం 59 ఏళ్ల లోపు చనిపోవాలి. ఇదేనా కేసీఆర్‌ చెప్పే న్యాయం?’ అంటూ దుయ్యబట్టారు. గతంలో సెంటు భూమి ఉన్న రైతు చనిపోయినా 15 రోజుల్లో రైతుబీమా ఇస్తానన్న కేసీఆర్‌ ఇప్పుడు మాటమార్చారని విమర్శించారు. ‘రైతుబీమా చూస్తుంటే ఆత్మహత్యలను ప్రోత్సహిస్తున్నట్లే ఉంది. పూర్తిస్థాయిలో రైతుబీమా వర్తింపజేయాలని కేంద్రానికి, రాష్ట్రానికి లేఖ రాస్తున్నాం. కేసీఆర్‌ స్పందించకపోతే ప్రభుత్వంపై కేసు పెడతాం’ అని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని