Sanjay Raut: నాకూ గువాహటి ఆఫర్ వచ్చింది..!

మహా వికాస్ అఘాడీ (MVA) కూటమి ప్రభుత్వం కూలిన నేపథ్యంలో శివసేన నేత సంజయ్ రౌత్ నుంచి కీలక వ్యాఖ్యలు వచ్చాయి.

Updated : 02 Jul 2022 12:27 IST

ముంబయి: మహా వికాస్ అఘాడీ (MVA) కూటమి ప్రభుత్వం కూలిన నేపథ్యంలో శివసేన నేత సంజయ్ రౌత్ నుంచి కీలక వ్యాఖ్యలు వచ్చాయి. తనకు కూడా గువాహటి ఆఫర్ వచ్చిందని వెల్లడించారు. ‘నాకు కూడా గువాహటి నుంచి ఆఫర్ వచ్చింది. కానీ నేను బాలాసాహెబ్‌ అడుగుజాడల్లోనే నడుస్తాను. అందుకే నేను అక్కడికి వెళ్లలేదు. నీవైపు నిజం ఉన్నప్పుడు భయం ఎందుకు..?’అని మహారాష్ట్రలో జరిగిన పరిణామాలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఎంవీఏ ప్రభుత్వంపై తిరుగుబాటు చేసిన ఏక్‌నాథ్ శిందే నాయకత్వంలో పదుల సంఖ్యలో ఎమ్మెల్యేలు అస్సాంలోని గువాహటి హోటల్‌లో మకాం పెట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వారంతా గోవాలో ఉన్నారు. ఈ రోజు ముంబయికి రానున్నట్లు తెలుస్తోంది.  

అలాగే నిన్న జరిగిన ఈడీ విచారణపైనా స్పందించారు. ‘ఒక దర్యాప్తు సంస్థ నాకు సమన్లు జారీచేస్తే.. ఒక బాధ్యతాయుతమైన పౌరుడిగా, ఎంపీగా హాజరవడం నా బాధ్యత. మహారాష్ట్ర రాజకీయ సంక్షోభంలో ఉన్న సమయంలో ఈ సమన్లు రావడమే అసలు సమస్య. విచారణ సమయంలో అధికారులు నాతో మంచిగా మెలిగారు. అవసరమైతే మళ్లీ వస్తానని కూడా వారికి చెప్పాను’ అని వెల్లడించారు. నిన్న పదిగంటల పాటు విచారణ సాగింది.

సంజయ్‌ రౌత్‌ భార్య, ఆయన స్నేహితుల ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు వచ్చిన ముంబయిలోని గోరెగావ్‌ పాత్రచాల్‌ భూకుంభకోణం, ఇతర ఆర్థిక వ్యవహారాల్లో చోటుచేసుకున్న నగదు అక్రమ చలామణీకి సంబంధించిన కేసు దర్యాప్తులో భాగంగా రౌత్‌కు సమన్లు జారీ అయ్యాయి. మహారాష్ట్రలో ఓ పక్క అధికార శివసేన శాసనసభ్యులు తిరుగుబాటు చేయడం, మహా వికాస్‌ అఘాడీ (ఎంవీఏ) ప్రభుత్వం భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిన తరుణంలో ఆయనకు ఈడీ సమన్లు జారీ చేయడం గమనార్హం. చివరకు ఎంవీఏ ప్రభుత్వం కూలిపోయి, భాజపా మద్దతుతో అసమ్మతి నేత ఏక్‌నాథ్‌ శిందే నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు కావడంతో ఆ రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితి తొలగింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని