Chandrababu Arrest: ‘మీ అందరి మద్దతు చూసి గర్వపడుతున్నా’: ఐటీ ఉద్యోగులతో నారా బ్రాహ్మణి

తెదేపా అధినేత చంద్రబాబుకు మీ అందరి మద్దతు చూసి గర్వపడుతున్నానని ఐటీ ఉద్యోగులతో నారా బ్రాహ్మణి అన్నారు. చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ ఐటీ ఉద్యోగులు హైదరాబాద్‌ నుంచి రాజమహేంద్రవరం వరకు కార్లలో సంఘీవ ర్యాలీ నిర్వహించారు.

Updated : 24 Sep 2023 19:42 IST

రాజమహేంద్రవరం: తెదేపా అధినేత చంద్రబాబుకు మీ అందరి మద్దతు చూసి గర్వపడుతున్నానని ఐటీ ఉద్యోగులతో నారా బ్రాహ్మణి అన్నారు. చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ ఐటీ ఉద్యోగులు హైదరాబాద్‌ నుంచి రాజమహేంద్రవరం వరకు కార్లలో సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. పోలీసుల అడ్డంకులు ఛేదించుకుని రాజమహేంద్రవరం చేరుకున్న వారంతా నారా బ్రాహ్మణిని కలిసి సంఘీభావం తెలిపారు. ‘‘ చంద్రబాబు అరెస్టు అక్రమం. ఒక విజనరీ లీడర్‌ను జైలులో పెట్టడం చాలా బాధకలిగిస్తోంది. హైదరాబాద్‌లో ఐటీ రంగ ఉన్నతికి ఎంతో కృషి చేశారు. లక్షల మందికి ఉద్యోగాలు కల్పించిన చంద్రబాబు అరెస్టు కక్షపూరిత చర్య. ఆయన అరెస్టును జీర్ణించుకోలేకపోతున్నాం’’ అని ఐటీ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు..

హైదరాబాద్‌లో పనిచేస్తున్న తాము రాజమహేంద్రవరం వస్తుంటే ఏపీ పోలీసులు అనేక ఆంక్షలు పెట్టి ఇబ్బందులకు గురి చేశారని బ్రాహ్మణికి వివరించారు. తెలిపారు. సొంత రాష్ట్రానికి వస్తుంటే అడ్డంకులు, కేసులు పెడతామని బెదిరింపులు ఏంటో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ ఫోన్లు కూడా పోలీసులు తీసుకున్నారని, వాట్సాప్‌ చాటింగ్‌లు కూడా చెక్‌ చేశారని తెలిపారు. రాజమహేంద్రవరంలో హోటల్‌ రూమ్‌లో ఉంటే పోలీసులు వచ్చి గదిలో పెట్టి తాళం వేశారని, రాష్ట్రంలో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదన్నారు. సైబరాబాద్‌ నిర్మాణంలో చంద్రబాబు చేసిన కృషిని ఈ సందర్భంగా వారు గుర్తు చేసుకున్నారు. 25 ఏళ్ల క్రితం రాళ్లు, రప్పలతో ఉన్న ప్రాంతం నేడు ఈ స్థాయిలో అభివృద్ది చెంది లక్షల మందికి ఉపాధినిచ్చే కేంద్రంగా మారడం వెనుక చంద్రబాబు కృషిని ఎవరూ చెరిపివేయలేరని ఉద్యోగులు నారా బ్రాహ్మణితో అన్నారు.

ఐటీ ఉద్యోగులపై ఆంక్షలు దారుణం: బ్రాహ్మణి

చంద్రబాబుకు మద్దతు తెలిపేందుకు హైదరాబాద్‌ నుంచి వస్తున్న ఐటీ ఉద్యోగులపై ఆంక్షలు, బెదిరింపులు దారుణమని నారా బ్రాహ్మణి అన్నారు. వాహనదారుల ఫోన్‌లు చెక్ చేయడం, చాట్‌లు పరిశీలించడం షాక్‌కు గురి చేసిందన్నారు. పోలీసుల చర్యల ప్రజల వ్యక్తిగత గోప్యత హక్కును హరించడమేనన్నారు. సామాన్య ప్రజల ఫోన్‌లు చెక్ చేసే హక్కు ఎవరిచ్చారని ప్రశ్నించారు. ఏ కారణంతో ఉద్యోగుల రాకపై ఆంక్షలు పెట్టారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. ‘‘రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడైనా ఉందా?. చంద్రబాబుకు సంఘీభావం తెలిపేందుకు అనేక వ్యయ ప్రయాసలకోర్చి, ప్రభుత్వ నిర్బంధాలను దాటుకుని వచ్చిన ఉద్యోగులను చూసి గర్వపడుతున్నా. వారికి ధన్యవాదాలు. చంద్రబాబు నాయుడు ఈ కష్ట సమయాన్ని అధిగమిస్తారు. సంక్షోభాలను అవకాశంగా మార్చుకునే శక్తివంతమైన నాయకుడు. యువత అందరూ  ఓట్లు చెక్‌ చేసుకోవాలి. రానున్న రోజుల్లో ఈ ప్రభుత్వానికి ఓటు హక్కుతో బుద్ధి చెప్పాలి. ఆన్ లైన్ ద్వారా ఓటు నమోదు చేసుకోవడంతో పాటు, అక్రమంగా ఎవరూ తమ ఓట్లు తొలగించకుండా ప్రజలను చైతన్య పరిచే బాధ్యత తీసుకోవాలి’’ అని తనను కలిసిన ఉద్యోగులను బ్రాహ్మణి కోరారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని