ఆ సీఎం ఆస్తి ₹54లక్షలు: సొంత కారు లేదు!

అసెంబ్లీ ఎన్నికల వేళ  కేరళలో నామినేషన్ల కోలాహలం నెలకొంది. సీపీఎం నేత, ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ సోమవారం కన్నూరు జిల్లా ధర్మడం నుంచి......

Updated : 22 Aug 2022 14:53 IST

తిరువనంతపురం: అసెంబ్లీ ఎన్నికల వేళ  కేరళలో నామినేషన్ల కోలాహలం నెలకొంది. సీపీఎం నేత, ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ సోమవారం కన్నూరు జిల్లా ధర్మడం నుంచి నామినేషన్‌ వేశారు. ఈ సందర్భంగా ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్‌లో తన ఆస్తుల వివరాలను ప్రకటించారు. వీటి ప్రకారం.. ముఖ్యమంత్రి విజయన్‌ మొత్తం ఆస్తుల విలువ రూ.54లక్షలు. 2020-21లో తన వార్షిక ఆదాయం రూ.2.87లక్షలుగా పేర్కొన్న ఆయన.. రెండు సొంత ఇళ్లు ఉన్నాయని, వ్యక్తిగత వాహనం లేదని వెల్లడించారు. తన పేరిట రూ.51.95లక్షల విలువైన స్థిరాస్తులు, 2.04 లక్షల విలువ చేసే చరాస్తులు ఉన్నట్టు విజయన్‌ పేర్కొన్నారు. ఉపాధ్యాయురాలిగా పనిచేసి రిటైరైన తన సతీమణి పేరిట రూ.35లక్షల విలువ చేసే స్థిరాస్తులు, రూ.29.7లక్షల చరాస్తులు ఉన్నట్టు ఎన్నికల అఫిడవిట్‌లో వెల్లడించారు. ఇద్దరి పేరిటా అప్పులేమీ లేవని తెలిపారు.

2016-17 నుంచి 2020-21 మధ్య కాలంలో తన వార్షిక ఆదాయం రూ.2లక్షల నుంచి 3లక్షల మధ్య ఉన్నట్టు విజయన్‌ తెలిపారు. 2018-19లో మాత్రం వార్షికాదాయం అత్యధికంగా రూ.3.40లక్షలుగా ఉన్నట్టు పేర్కొన్నారు.  2020-21 ఆర్థిక సంవత్సరంలో తన సతీమణి ఆదాయం రూ.16,400లుగా ఉందని తెలిపారు. తన పేరుతో సొంత వాహనం గానీ, బంగారు ఆభరణాలు గానీ లేవని అఫిడవిట్‌లో స్పష్టం చేశారు.

తన సతీమణికి మాత్రం రూ.3.3లక్షలు విలువైన 80 గ్రాముల బంగారు ఆభరణాలు ఉన్నట్టు తెలిపారు. ఇక విజయన్‌ స్థిరాస్తుల విషయానికి వస్తే.. తన సొంత జిల్లా కన్నూరులో 0.78 ఎకరాల వ్యవసాయ భూమితో పాటు ఇల్లు ఉందని పేర్కొన్నారు. అలాగే, పథిరియాడ్‌లో మరో నివాస భవనం ఉన్నట్టు సీఎం తెలిపారు. తనపై రెండు క్రిమినల్‌ కేసులు ఉన్నాయని ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని