Janasena: ఆంధ్రప్రదేశ్‌లో ‘సలహాల’ ఖర్చు రూ.680 కోట్లు: నాదెండ్ల మనోహర్‌

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నియమించిన సలహాదారులపై జనసేన పీఏసీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు.

Updated : 01 Feb 2024 17:55 IST

విజయవాడ: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌ను స్వాగతిస్తున్నట్లు జనసేన పీఏసీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ తెలిపారు. దేశవ్యాప్తంగా 81 కోట్ల మందికి ఉచిత రేషన్‌ ఇవ్వడం గొప్ప విషయమని.. దీన్ని 2029 వరకు పొడిగించడం అభినందనీయమన్నారు. పర్యటక రంగాన్ని ప్రోత్సహించే విధంగా కేంద్రం సహకరిస్తోందన్నారు. ముఖ్య పట్టణాలకు మెట్రో విస్తరించాలని నిర్ణయం తీసుకోవడాన్ని స్వాగతిస్తున్నట్లు చెప్పారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నాదెండ్ల మాట్లాడారు.

‘‘సీఎం జగన్‌ హయాంలో 2019 నుంచి ఇప్పటివరకు సుమారు 80 నుంచి 90 మంది సలహాదారులు, ఉప సలహాదారులను నియమించారు. వీరంతా ప్రభుత్వానికి ఏ విధంగా సలహాలు ఇస్తున్నారో అర్థం కావడం లేదు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ వీరికి అనవసరంగా నిధులు కేటాయిస్తున్నారని గతంలో హైకోర్టులో పిల్‌ వేశాం. న్యాయస్థానం స్పందిస్తూ.. దేని కోసం ఇంతమందిని నియమించారు? ఎలాంటి సలహాలు ఇస్తున్నారు? వాటిని ఎక్కడైనా అమలు చేస్తున్నారా? సలహాదారుల విధానం అనవసరం అని కోర్టు అభిప్రాయపడింది. సలహాదారుల నియామకానికి సంబంధించి పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది’’ అని నాదెండ్ల చెప్పారు.

సలహాదారుల నియామకంలో నూతన విధానాన్ని తీసుకొస్తున్నట్లు మార్చి 2023లో హైకోర్టుకు ప్రభుత్వం నివేదిక ఇచ్చింది. అర్హులనే నియమిస్తున్నట్లు పేర్కొంది. అయితే, సలహాదారులుగా నియమితులైనప్పటికీ సీఎంను కూడా కలవలేకపోతున్నామని కొందరు వాపోతున్నారు. ఈ అడ్వైజర్లకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు వెచ్చించింది సుమారు రూ.680 కోట్లు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కోసమే రూ.140 కోట్లు ఖర్చు చేయడం గమనార్హమని నాదెండ్ల పేర్కొన్నారు. 

అసలు వీరంతా ఎవరనేది ప్రజలకు తెలియాలి, ప్రభుత్వం వారి పేర్లను ప్రకటించాలి. ఎవరెవర్ని ఏ శాఖకు కేటాయించారనేది రాబోయే శాసనసభ సమావేశాల్లో సీఎం జగన్‌ చెప్పాలి అని నాదెండ్ల డిమాండ్ చేశారు. అలాగే ఆ సలహాదారులు పరిపాలనకు ఏ విధంగా ఉపయోగపడుతున్నారు అనేది కూడా చెప్పాలని డిమాండ్‌ చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని