INDIA: ‘ఇండియా’ పేరు.. నీతీశ్‌కు నచ్చలేదట..!

విపక్షాల కూటమికి ఇండియా (INDIA) అనే పేరుపై నేతల మధ్య విస్తృతంగా చర్చ జరిగింది. అయితే, ఈ పేరుపై తొలుత నీతీశ్ కుమార్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

Updated : 19 Jul 2023 12:01 IST

బెంగళూరు: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయేపై ఉమ్మడి పోరుకు జట్టు కట్టిన విపక్షాలు (Opposition alliance).. తమ కూటమికి ఇండియా (INDIA)గా నామకరణం చేశాయి. ఈ పేరును కూటమిలోని అన్ని పార్టీలు ఏకాభిప్రాయంతో సమ్మతించాయని విపక్ష నేతలు తెలిపారు. అయితే, బిహార్‌ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్‌ (Nitish Kumar) మాత్రం ఈ పేరును తీవ్రంగా వ్యతిరేకించినట్లు విశ్వసనీయ వర్గాలు తాజాగా వెల్లడించాయి. ఇతర పార్టీల నేతలు సర్దిచెప్పడంతో చివరకు ఆయన అంగీకరించినట్లు పేర్కొన్నాయి.

విపక్షాల ఇండియా.. ట్విటర్‌లో మార్పు చేసిన హిమంత: కాంగ్రెస్‌ కౌంటర్‌

ప్రతిపక్షాల కూటమి (Opposition alliance) పేరు గురించి కాంగ్రెస్‌ (Congress) ముందుగా ఎలాంటి చర్చలు జరపలేదట. విపక్ష నేతల భేటీ సమయంలో ఉన్నట్టుండి ‘ఇండియా (INDIA)’ అనే పేరును హస్తం పార్టీ నేతలు ప్రతిపాదించారని సదరు వర్గాలు తెలిపాయి. ఆ పేరు వినగానే నీతీశ్ కుమార్‌ షాక్‌ అయ్యారని పేర్కొన్నాయి. ‘‘ప్రతిపక్షాల కూటమికి INDIA అనే పేరు ఎలా పెడతారు? పైగా ఇందులో భాజపాకు చెందిన NDA కూటమి అక్షరాలున్నాయి?’’ అని బిహార్‌ సీఎం ప్రశ్నించినట్లు తెలుస్తోంది.

కొందరు లెఫ్ట్‌ పార్టీ నేతలు కూడా ఈ పేరుపై సంకోచించి.. ప్రత్యామ్నాయ పేర్లను సూచించినట్లు సమాచారం. అయితే, అత్యధిక పార్టీలు ఈ పేరును ఆమోదించడంతో నీతీశ్ (Nitish Kumar) కూడా అంగీకరించక తప్పలేదని సదరు వర్గాలు తెలిపాయి. ‘‘ఓకే.. మీ అందరికీ INDIA పేరు నచ్చినట్లయితే.. నాకూ ఓకేనే’’ అని నీతీశ్ అన్నారట..!

విపక్ష కూటమి ఇండియా

విపక్షాల కూటమికి ‘ఇండియా’ పేరును కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ, పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సూచించారని కొందరు నేతలు వెల్లడించారు. అయితే తొలుత ఇందులోని డి అనే అక్షరానికి డెమోక్రటిక్‌ (ప్రజాతంత్ర) అని ప్రతిపాదించారు. ఎన్డీయేలో డి అక్షరానికి అదే అర్థం ఉన్నందువల్ల దీనిని డెవలప్‌మెంటల్‌గా మారుద్దామని కొందరు నేతలు సవరించారు. నేషనల్‌ అనే పదాన్ని తీసేద్దామని కూడా ఒక దశలో అనుకున్నా చివరకు దానిని ఉంచాలనే నిర్ణయించారు. అలా చివరకు విపక్షాల కూటమికి ‘ఇండియన్‌ నేషనల్‌ డెవలప్‌మెంటల్‌ ఇన్‌క్లూజివ్‌ అలయెన్స్‌ (ఐఎన్‌డీఐఏ- ఇండియా)’ పేరును ఖరారు చేశారు.

ట్యాగ్‌లైన్‌.. జీతేగా భారత్‌

విపక్షాల కూటమికి నిన్న పేరును ఖరారు చేయగా.. నేడు ట్యాగ్‌లైన్‌ ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో భాజపాను ఓడించడమే లక్ష్యంగా ‘జీతేగా భారత్ (ఇండియా విల్‌ విన్‌)’ అనే ట్యాగ్‌లైన్‌ను పెట్టాలని నిర్ణయించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. మంగళవారం అర్ధరాత్రి దాకా సాగిన సమావేశాల్లో దీన్ని ఖరారు చేసినట్లు తెలుస్తోంది. కూటమి పేరు ‘ఇండియా’ కింద పలు ప్రాంతీయ భాషల్లో ఈ ట్యాగ్‌లైన్‌ కన్పించనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని