Himanta Biswa Sarma: విపక్షాల ఇండియా.. ట్విటర్‌లో మార్పు చేసిన హిమంత: కాంగ్రెస్‌ కౌంటర్‌

ప్రతిపక్షాల కూటమి నిర్ణయించిన ఇండియా పేరు ప్రకటన అనంతరం అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ(Himanta Biswa Sarma) తన ట్విటర్ ఖాతాలో మార్పు చేశారు. హిమంత నుంచి వచ్చిన స్పందనపై కాంగ్రెస్ కౌంటర్ ఇచ్చింది. 

Published : 19 Jul 2023 10:30 IST

దిల్లీ: పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తోన్న తరుణంలో దేశ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఎన్డీయేను ఎదుర్కోవడానికి ఇండియన్‌ నేషనల్‌ డెవలప్‌మెంటల్‌ ఇన్‌క్లూజివ్‌ అలయెన్స్‌(ఐఎన్‌డీఐఏ- ఇండియా) పేరుతో 2024 సార్వత్రిక ఎన్నికల బరిలో దిగాలని విపక్షాలు నిర్ణయించాయి. ఈ క్రమంలో అస్సాం ముఖ్యమంత్రి, భాజపా నేత హిమంత బిశ్వ శర్మ(Assam Chief Minister Himanta Biswa Sarma) ట్విటర్ బయో( Twitter Bio)లో చేసిన మార్పు ఆసక్తిగా మారింది.

హిమంత తన ట్విటర్ బయోలో  ఉన్న ఇండియా(India) అనే పదాన్ని తొలగించి దాని స్థానంలో భారత్‌(Bharat) అనే పదాన్ని ఉంచారు. అలాగే బ్రిటిష్ పాలకులు మన దేశానికి ఇండియా అని పేరు పెట్టారని, ఈ వలసవాద వారసత్వం నుంచి దేశాన్ని విముక్తి చేయడానికి ఇప్పుడు అంతా పోరాటం చేయాలని విపక్షాల కూటమిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. ‘మన పూర్వీకులు భారత్‌ కోసం పోరాడారు. ఇప్పుడు మనం కూడా భారత్‌ కోసం పనిచేయాలి.  భారత్‌ కోసమే భాజపా ఉంది’ అంటూ విపక్షాల కూటమి ఇండియా(Indian National Developmental Inclusive Alliance)కు కౌంటర్ ఇచ్చారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ స్పందించింది.

విపక్ష కూటమి ఇండియా

‘‘ఇండియా’ పేరుతో అస్సాం సీఎం ఉడికిపోతున్నారు. హిమంత శర్మ కొత్త మెంటార్‌.. మనకు స్కిల్ ఇండియా, స్టార్టప్‌ ఇండియా, డిజిటల్ ఇండియా అని పేర్లు పెట్టారు. ఆ మెంటార్‌.. అన్ని రాష్ట్రాల సీఎంలు కలిసి టీమిండియా(Team India)లా పనిచేయాలని అన్నారు. అలాగే ఇండియాకు ఓటు వేయాలని కోరారు. ఇప్పుడు 26 రాజకీయ పార్టీలు ఇండియాను ఏర్పాటు చేస్తున్నట్లు పిలుపునివ్వగానే.. వలసవాద మనస్తత్వమని ఆయన(హిమంత) అంటున్నారు. అదే విషయాన్ని ఆయన బాస్‌(మోదీ)కు చెప్పాలి’ అని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్‌ ఎద్దేవా చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని