Pawan Kalyan: జగన్‌ సీబీఐ దత్తపుత్రుడు.. వైకాపా చర్లపల్లి షటిల్‌ టీమ్‌: పవన్‌ కల్యాణ్‌

ఆర్థిక నేరాలకు పాల్పడి 16 నెలలు జైల్లో కూర్చున్న జగన్‌, ఆయన బృందం తనకు నీతులు చెప్పడం దారుణమని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్ మండిపడ్డారు.

Updated : 13 Apr 2022 05:13 IST

అనంతపురం: ఆర్థిక నేరాలకు పాల్పడి 16 నెలలు జైల్లో కూర్చున్న జగన్‌, ఆయన బృందం తనకు నీతులు చెప్పడం దారుణమని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్ మండిపడ్డారు. అనంతపురం జిల్లా పర్యటనలో ఉన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ... వైకాపా విమర్శలను తిప్పికొట్టారు. ఇంకోసారి తనను సీబీఎన్‌ దత్తపుత్రుడు అంటే.. జగన్‌ను సీబీఐ దత్తపుత్రుడు అంటామని హెచ్చరించారు. అలాగే.. తెలుగుదేశం బీ-టీమ్‌ అని సంబోధిస్తే వైకాపాను చర్లపల్లి షటిల్‌ టీమ్‌ అంటామని తేల్చి చెప్పారు. జనసేన కార్యకర్తలు, నాయకులు కూడా ఈ మాటలు అనాలని సూచించారు.

‘‘మేం ప్రజల పక్షాన పాలసీలపై మాట్లాడుతుంటే.. వైకాపా అగ్రనాయకత్వం వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారు. వైకాపా సమూహానికి అనంతపురం జిల్లా నుంచి ఒకటే చెప్పదల్చుకున్నా.. నేను విదేశాల్లో చదువుకుని రాలేదు, లండన్‌ రాయల్‌ ఫ్యామిలీ కాదు. చీరాల, పేరాల, ప్రకాశం జిల్లాలోని గోపాలనగరం ఇలాంటి చోట పెరిగిన వాడ్ని. మీరు తిట్టే భాషకంటే ఇంకా మంచి భాష నాకూ వచ్చు. కానీ, ఇలాంటి భాష రాజకీయాలకు వాడి ప్రజా సమస్యలను పక్కదోవ పట్టించడం నాకిష్టం లేదు. మేం పాలసీలపై మాట్లాడుతున్నప్పుడు మీరు.. సీబీఎన్‌కు దత్తపుత్రుడు అంటే మేం సీబీఐ దత్తపుత్రుడు అనాల్సి వస్తుంది. జనసేన నాయకులు, కార్యకర్తలకు ప్రతి ఒక్కరికీ చెబుతున్నా... ఈసారి వైకాపాకు సంబంధించిన వ్యక్తులు కానీ, నాయకులు కానీ సీబీఎన్‌ దత్తపుత్రుడు అంటే జగన్‌ సీబీఐ దత్తపుత్రుడు అని గట్టిగా చెప్పండి.

వైకాపాలోని ముఖ్య నాయకులు చాలా మందిని సీబీఐ కోర్టు దత్తత తీసుకుంటుంది. ఆ విషయం మీరు మర్చిపోవద్దు. 2019 సార్వత్రిక ఎన్నికల నుంచి జనసేనను మీరు తెదేపా బీ టీమ్‌ అంటున్నారు. ఏదైనా అంటే ఏడుస్తారని భరిస్తూ వచ్చా.. నాక్కూడా సహనం పోయింది. ఈ సారి గనుక మమ్మల్ని తెదేపా బీ టీమ్‌ అంటే.. మిమ్మల్ని చర్లపల్లి జైలు షటిల్‌ టీమ్‌ అనాల్సి వస్తుంది. ఎందుకంటే... చర్లపల్లి జైల్లో చక్కగా 16 నెలలు షటిల్‌ ఆడుకున్నారు. మీరేదో దేశ సేవ చేయలేదు. వల్లభాయ్‌ పటేల్‌ కాదు.. సుభాష్ చంద్రబోస్‌లు కాదు మీరు.. ఆర్థిక నేరాలు చేసి జైల్లో కూర్చున్నారు. మీరు మాకు నీతులు చెప్పొద్దు. మమ్మల్ని విమర్శించే హక్కు.. ఆ స్థాయి కూడా మీకు లేదు’’ అని పవన్‌ కల్యాణ్‌ ఘాటుగా స్పందించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని