Panneer selvam: ‘సుప్రీం’ తీర్పు మాకు ఎదురుదెబ్బ కాదు.. ప్రజా కోర్టుకే వెళ్తాం: పన్నీర్ సెల్వం
అన్నాడీఎంకేలో ఆధిపత్య పోరు తమిళ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఈపీఎస్‌కు సుప్రీంకోర్టులో అనుకూల తీర్పు రావడంతో ఆ వర్గం సంబరాల్లో మునిగితేలుతోంది. ‘సుప్రీం’ తీర్పుపై ఓపీఎస్ తొలిసారి స్పందించారు.
చెన్నై: తమిళనాట అన్నాడీఎంకే(AIADMK) తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా పళనిస్వామి(Palaniswami) ఎన్నికను సమర్థిస్తూ సుప్రీంకోర్టు (Supreme Court) నిన్న ఇచ్చిన తీర్పుపై మాజీ సీఎం పన్నీర్ సెల్వం (Panneerselvam) తొలిసారి స్పందించారు. సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు తమకు ఎదురు దెబ్బేమీ కాదని.. ప్రజా కోర్టుకు వెళ్లి అక్కడే న్యాయం కోరతామని వ్యాఖ్యానించారు. పార్టీలో ఆధిపత్య పోరు తారస్థాయిలో కొనసాగుతున్న నేపథ్యంలో వచ్చిన ఈ తీర్పుపై పన్నీర్ అధికారికంగా శుక్రవారం స్పందించారు. చెన్నైలో ఆయన విలేకర్లతో మట్లాడుతూ.. ‘‘సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మాకు ఎదురుదెబ్బ కాదు. ఈ తీర్పు తర్వాత మా పార్టీ శ్రేణులు ఎంతో ఉత్సాహంతో ఉన్నాయి. మా ధర్మ యుద్ధం కొనసాగుతుంది. నేను, నా అనుచరగణమంతా ప్రజల్లోకి వెళ్తాం. త్వరలోనే క్యాంపెయిన్‌ను మొదలుపెడతాం. జిల్లాల వారీగా రాష్ట్ర వ్యాప్తంగా క్యాంపెయిన్ కొనసాగుతుంది. ధర్మం పక్షాన నిలబడి ప్రజల నుంచి న్యాయం కోరతాం. ఇప్పటి వరకు సుప్రీంకోర్టులో పోరాడాం. మా దృష్టంతా కోర్టు తీర్పుపైనే ఉంది. ఇక నుంచి ప్రజల్లోకి వెళ్లేందుకు కృషిచేస్తాం. ప్రజల నుంచి మంచి తీర్పు వస్తుందని ఆశిస్తున్నాం’’ అని పన్నీర్ సెల్వం అన్నారు
అలాగే, పన్నీర్ వర్గాన్ని డీఎంకేకు బీ-టీమ్‌గా పళని వర్గం ఆరోపణలపై విలేకర్లు అడిగిన ప్రశ్నలకు దీటుగా సమాధానం చెప్పారు. డీఎంకేకు తాము బీ-టీమ్ అయితే.. వాళ్లే A to Z టీమ్ అంటూ కౌంటర్ ఇచ్చారు. తమను ఒక్క విషయంలోనైనా నిందించలేరని.. కానీ వాళ్లకు సంబంధించి దాదాపు వెయ్యి అంశాలు ఉన్నాయన్నారు. ఒక్కొక్కటిగా బయటకు వస్తాయని చెప్పారు. పార్టీ క్రమశిక్షణతో పాటు అన్నాడీఎంకే విచ్ఛిన్నం కాకుండా ఉండేందుకు తాము ఓపికతో వ్యవహరిస్తున్నామన్నారు.
ఆధిపత్య పోరు మొదలైందిలా..
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మరణించాక పార్టీలో ప్రధాన కార్యదర్శి పదవిని రద్దు చేశారు. నాటి నుంచి పన్నీర్ సెల్వం సమన్వయకర్తగా, పళనిస్వామి సంయుక్త సమన్వయకర్తగా కొనసాగారు. అయితే, ద్వంద్వ నాయకత్వంతో నిర్ణయాలు తీసుకోవడం సమస్యాత్మకంగా మారిందని.. పార్టీ సర్వసభ్య సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. ఈ విషయంపై జిల్లా కార్యదర్శుల సమావేశం నిర్వహించి చర్చించారు. దానిలో పళని వర్గం ఏకనాయకత్వ వ్యవహారాన్ని తెరపైకి తెచ్చింది. ఇందుకు పన్నీర్ వర్గీయులు ససేమిరా అన్నారు. ఈ క్రమంలోనే 2022 జూన్ 23న సర్వసభ్య సమావేశం నిర్వహించగా ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఆ తర్వాత జులై 11న మరోసారి సమావేశం నిర్వహించారు. అందులో పార్టీలో ద్వంద్వ నాయకత్వాన్ని రద్దు చేస్తూ ఇచ్చిన తీర్మానానికి ఆమోదం తెలిపారు. కొత్తగా డిప్యూటీ జనరల్ సెక్రటరీ పదవిని తీసుకొచ్చారు. అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా పళనిస్వామిని ఎన్నుకున్నారు. దీనిపై పన్నీర్ సెల్వం తొలుత మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. గతేడాది జులై 11న జరిగిన పార్టీ సర్వసభ్య సమావేశం చెల్లదని, జూన్ 23కి ముందు పరిస్థితే ఉంటుందని గతేడాది ఆగస్టులో ప్రత్యేక న్యాయమూర్తి జస్టిస్ జయచంద్రన్ తీర్పునిచ్చారు.
అయితే, దీనిపై పళనిస్వామి మద్రాసు హైకోర్టులో అప్పీల్ చేయగా.. జస్టిస్ జయచంద్రన్ తీర్పును డివిజన్ బెంచ్ కొట్టివేసింది. జులై 11న జరిగిన అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశం చెల్లుతుందని పేర్కొంటూ.. జనరల్ సెక్రటరీగా పళనిస్వామి కొనసాగేందుకు అనుమతినిచ్చింది. అయితే, ఈ తీర్పును పన్నీర్ సెల్వం సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. దీనిపై గురువారం విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం ఓపీఎస్ పిటిషన్‌ను కొట్టివేసింది. హైకోర్టు, సుప్రీంకోర్టుల్లోనూ తీర్పు ఒకేలా రావడంతో పళనిస్వామి ఏకనాయకత్వానికి పెద్దబలం చేకూరింది. పార్టీ పగ్గాలు పూర్తిగా పళనిస్వామి చేతికే వెళ్లినట్లవుతోంది. సుప్రీం తీర్పుతో పళని వర్గం శ్రేణులు సంబరాల్లో మునిగితేలుతున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Manoj Manchu: మంచు మనోజ్ సరికొత్త టీవీ షో.. ఎక్కడో తెలుసా?
-
TTD: గరుడ వాహనంపై మలయప్పస్వామి.. భక్త జనసంద్రంగా తిరుమల
-
Manchu Lakshmi: నా సంపాదన.. నా ఖర్చు.. మీకేంటి నొప్పి: మంచు లక్ష్మి ట్వీట్
-
Antilia Case: అంబానీని భయపెట్టేందుకే.. ఆయన ఇంటి ముందు పేలుడు పదార్థాలు!
-
ISRO: విక్రమ్, ప్రజ్ఞాన్‌లతో కమ్యూనికేషన్‌కు యత్నం.. ఇస్రో ఏం చెప్పిందంటే!
-
Anantapuram: పాఠశాలలో దారుణం.. పుట్టిన రోజు నాడే చిన్నారి మృతి