UP Polls: భాజపాకు బిగ్‌ షాక్‌.. ఓ మంత్రి సహా ముగ్గురు ఎమ్మెల్యేలు రాజీనామా!

అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోన్న వేళ.. ఉత్తర్‌ప్రదేశ్‌లో భాజపాకు షాక్‌ తగిలింది.

Updated : 11 Jan 2022 22:12 IST

ఎన్నికల వేళ మొదలైన రాజకీయ వలసలు

లఖ్‌నవూ: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఉత్తర్‌ప్రదేశ్‌లో భాజపాకు గట్టి షాక్‌ తగిలింది. యోగి ఆదిత్యనాథ్‌ కేబినెట్‌లో మంత్రిగా ఉన్న స్వామి ప్రసాద్‌ మౌర్య తన పదవితో పాటు పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆయన బాటలోనే మరో ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. భాజపాకు రాజీనామా చేసిన వీరు త్వరలోనే సమాజ్‌వాదీ పార్టీలో చేరేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతోన్న సమయంలో ఒకేరోజు మంత్రితో పాటు పలువురు ఎమ్మెల్యేలు పార్టీని వీడడం భాజపాను కలవరపాటుకు గురిచేస్తోంది. వరుసగా రెండోసారి అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తోన్న భాజపాకు ఈ పరిణామాలు గట్టి ఎదురుదెబ్బగా రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.

అందుకే రాజీనామా..

తన భావజాలం భిన్నమైనప్పటికీ యోగి మంత్రివర్గంలో అంకితభావంతో పనిచేశానని స్వామి ప్రసాద్‌ మౌర్య తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. రైతులు, దళితులు, ఓబీసీలు, నిరుద్యోగులు, చిరు వ్యాపారులు అణచివేతకు గురవుతున్నందున పార్టీని వీడుతున్నట్లు పేర్కొన్నారు. స్వామి ప్రసాద్‌ మౌర్య 2017లో ఎన్నికల ముందు బహుజన్‌ సమాజ్‌ పార్టీ (BSP) నుంచి నుంచి భాజపాలో చేరారు. ఆయన పద్రౌనా శాసనసభ స్థానం నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నిక కావడం విశేషం. అంతేకాకుండా ఆయన కుమార్తె సంఘమిత్ర మౌర్య ప్రస్తుతం భాజపాలో ఉండగా.. బదౌన్‌ లోక్‌సభ స్థానం నుంచి ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

మద్దతుగా మరో ముగ్గురు..

మంత్రి రాజీనామా అనంతరం మరో ముగ్గురు భాజపా ఎమ్మెల్యేలు కూడా పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. మౌర్యకు మద్దతుగా తింద్వారీ ఎమ్మెల్యే బ్రజేష్‌ ప్రజాపతి, తిహాడ్‌ ఎమ్మెల్యే రోషన్‌లాల్‌ వర్మ, బిహౌర్‌ ఎమ్మెల్యే భగ్వాతి సాగర్‌లు భాజపాకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. వీరందరూ కొన్ని గంటల వ్యవధిలోనే రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడం గమనార్హం. అయితే, వీరి రాజీనామాలను పార్టీ ఆమోదించడంపై స్పష్టత లేదు.

స్వాగతించిన అఖిలేశ్‌ యాదవ్‌..

స్వామి ప్రసాద్‌ మౌర్యతోపాటు పలువురు ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరేందుకు సిద్ధంకావడం పట్ల సమాజ్‌వాదీ పార్టీ అధినేత, మాజీ సీఎం అఖిలేశ్‌ యాదవ్‌ హర్షం వ్యక్తం చేశారు. వారందరినీ సాదరంగా తమ పార్టీలోకి స్వాగతిస్తున్నామని అన్నారు. సామాజిక న్యాయం, సమానత్వం కోసం పోరాడే నాయకులందరికీ తమ పార్టీలో ఆహ్వానం ఉంటుందన్నారు. భాజపాను వీడి మౌర్య తమ పార్టీలో చేరడం సామాజిక న్యాయం సాధించే దిశగా ఓ విప్లవం ప్రారంభమైందని పేర్కొంటూ అఖిలేశ్‌ ట్వీట్‌ చేశారు.

తోసిపుచ్చిన కుమార్తె..

భాజపాను వీడిన స్వామి ప్రసాద్‌ మౌర్య సమాజ్‌వాదీ పార్టీలో చేరడంపై వస్తోన్న వార్తలను ఆయన కుమార్తె సంఘమిత్ర ఖండించారు. తన తండ్రి ఇప్పటివరకు ఏ పార్టీలోనూ చేరలేదని స్పష్టం చేశారు. అయితే, కచ్చితంగా రాజీనామా చేశారన్న ఆమె.. ఎస్‌పీతోపాటు మరే పార్టీలోనూ చేరలేదన్నారు. ఆయన వ్యూహాన్ని మరో రెండు రోజుల్లోనే వెల్లడిస్తామన్నారు. మౌర్యతో కలిసి ఉన్న ఫొటోను అఖిలేష్‌ యాదవ్‌ ట్విటర్‌లో షేర్‌ చేయడంపై స్పందించిన ఆమె.. గతంలోనూ (2016లో) శివ్‌పాల్‌ యాదవ్‌ తన తండ్రితో ఉన్న ఫొటోను సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ చేశారని గుర్తుచేశారు.

స్పందించిన భాజపా..

కేబినెట్‌ మంత్రిగా ఉన్న స్వామి ప్రసాద్‌తోపాటు పలువురు పార్టీని వీడుతున్నట్లు ప్రకటించడంపై భాజపా స్పందించింది. ఏ కారణాల వల్ల రాజీనామా చేశారో ఇప్పటికీ అర్థంకావడం లేదని యూపీ ఉపముఖ్యమంత్రి కేశవ్‌ ప్రసాద్‌ మౌర్య పేర్కొన్నారు. తొందరపాటుతో తీసుకున్న నిర్ణయాలు మంచివి కాదని ఆయన హితవు పలికారు.

అమిత్‌షా ఆదిత్యనాథ్‌ భేటీ..

ఉత్తరప్రదేశ్‌లో అధికారంలో ఉన్న భాజపా.. వరుసగా రెండోసారి అధికారంలోకి రావాలనే ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే ప్రధానమంత్రితోపాటు పలువురు కేంద్ర మంత్రులు యూపీ ఎన్నికలపై దృష్టి సారించారు. తాజాగా ఎన్నికల షెడ్యూల్‌ విడుదల కావడంతో అభ్యర్థుల ఖరారు అంశంపై చర్చించేందుకు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌, ఉపముఖ్యమంత్రి కేశవ్‌ ప్రసాద్‌ మౌర్యతో కలిసి దిల్లీలో అమిత్‌ షాతో భేటీ అయ్యారు. ఇదే సమయంలో కీలక నేతలు పార్టీని వీడుతున్నట్లు ప్రకటించడం భాజపాకు ఎదురుదెబ్బ తగిలినట్లు అయ్యింది.

ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించిన కొన్ని రోజుల్లోనే ఉత్తర్‌ప్రదేశ్‌లో రాజకీయ వలసలు ఊపందుకున్నాయి. ఇప్పటికే పలువురు నేతలు భాజపాకు రాజీనామా చేయగా.. యోగి మంత్రివర్గంలో ఉన్న స్వామి ప్రసాద్‌ మౌర్య తాజాగా తన మంత్రిపదవికి రాజీనామా చేశారు. ఓబీసీ వర్గంలో గట్టి పట్టున్న నేతగా ఉన్న మౌర్య.. భాజపాను వీడడం శాసనసభ ఎన్నికల్లో ఆ పార్టీ గెలుపుపై ప్రభావం చూపించే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా కుషీనగర్‌, ప్రతాప్‌గఢ్‌, కాన్పుర్‌ దెహాత్‌, షాజహాన్‌పుర్‌ ప్రాంతాల్లో దాదాపు 20 అసెంబ్లీ స్థానాల్లో ప్రభావం చూపనున్నట్లు తెలుస్తోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని