Bihar Cabinet Expansion: నీతీశ్ వద్దే హోం.. మంత్రివర్గంలోకి తేజ్ ప్రతాప్

బిహార్‌లో జేడీ(యూ)తో కూడిన మహా కూటమి ప్రభుత్వ కొత్త మంత్రి వర్గం కొలువుదీరింది.

Updated : 16 Aug 2022 13:25 IST

పట్నా: బిహార్‌లో జేడీ(యూ)తో కూడిన మహా కూటమి ప్రభుత్వ కొత్త మంత్రి వర్గం కొలువుదీరింది. కూటమిలో అత్యధిక సభ్యులు కలిగిఉన్న ఆర్జేడీకి 16 మంత్రి పదవులు దక్కాయి. నీతీశ్‌ పార్టీ నుంచి 11 మంది ప్రమాణ స్వీకారం చేయగా.. కాంగ్రెస్‌ నుంచి ఇద్దరు, హిందుస్థానీ ఆవామ్‌ మోర్చా నుంచి ఒకరు మంత్రివర్గంలో చేరారు. మొత్తంగా సుమారు 30 మంది మంత్రులుగా ఈ రోజు ప్రమాణ స్వీకారం చేశారు.  

2020 భాజపాతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన జేడీ(యూ).. ఈ నెలలో కమలం పార్టీతో బంధాన్ని తెంచుకుంది. ఆర్జేడీ, ఇతర పార్టీలతో కూడిన కూటమితో జట్టుకట్టింది. ఎనిమిదో సారి నీతీశ్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకోగా.. ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌ ఉప ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. ఈ మంత్రివర్గంలోకి తేజస్వి సోదరుడు తేజ్‌ ప్రతాప్‌ చేరారు. నీతీశ్ కుమార్‌ మునుపటి మంత్రులను దాదాపుగా కొనసాగించారు. అలాగే హోం శాఖను తన చెంతే ఉంచుకున్నారు. బిహార్‌ కేబినెట్‌లో ముఖ్యమంత్రితో సహా 36 మంది సభ్యులకు స్థానం ఉంది. తదుపరి విస్తరణలో ఆ స్థానాలు నిండనున్నాయి. 

ఇదిలా ఉండగా.. ప్రస్తుత కూటమి బలం 163గా ఉంది. ఒక స్వతంత్ర అభ్యర్థి కూడా నీతీశ్‌ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడంతో ఆ సంఖ్య 164కు చేరింది. ఇక ఈ కొత్త ప్రభుత్వం ఆగస్టు 24న బలపరీక్షకు వెళ్లనుంది.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని