West Bengal: పంచాయితీ ఎన్నికలు.. విపక్ష పార్టీల అభ్యర్థులకు టీఎంసీ వినూత్న స్వాగతం!

పశ్చిమ బెంగాల్‌ (West Bengal)లో అధికార టీఎంసీ (TMC) వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పంచాయితీ ఎన్నికల కోసం నామినేషన్ దాఖలు చేసేందుకు వస్తోన్న విపక్ష పార్టీల అభ్యర్థులకు టీఎంసీ నాయకులు గులాబీ పూలు, వాటర్‌ బాటిళ్లతో స్వాగతం పలుకుతున్నారు.

Updated : 13 Jun 2023 19:37 IST

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌ (West Bengal)లో స్థానిక సంస్థల ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. రాష్ట్రంలోని పంచాయితీలు, పంచాయితీ సమితి, జిల్లా పరిషత్‌తో కలిపి  జులై 8న ఎన్నికలు జరగనున్నాయి. ప్రధాన పార్టీల నుంచి వేల సంఖ్యలో అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. త్వరలో లోక్‌సభ ఎన్నికలు జరగనుండటంతో రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు ఈ పంచాయితీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అయితే, రాష్ట్రంలో అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్‌ (TMC), ఇతర పార్టీల అభ్యర్థులను నామినేషన్లు వేయనీయకుండా అడ్డుకుంటూ.. దాడులు చేస్తోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ ఆరోపణలను టీఎంసీ నేతలు ఖండించారు. తమ పార్టీ కార్యకర్తలు ఎవరిపైనా దాడులు చేయడంలేదని చెబుతూ.. వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

పశ్చిమ బర్దమాన్‌ (West Bardhman) జిల్లాలో సాలన్‌పూర్‌ (Salanpur)లో పంచాయితీ ఎన్నికల్లో నామినేషన్లు దాఖలు చేస్తున్న భాజపా (BJP), సీపీఎం (CPM) అభ్యర్థులకు స్థానిక టీఎంసీ నాయకులు గులాబీ పూలు, మంచి నీళ్ల బాటిళ్లతో స్వాగతం పలికారు. తమ పార్టీ కూడా శాంతియుత వాతావరణంలో ఎన్నికలు జరగాలని కోరుకుంటోందని టీఎంసీ నాయకులు తెలిపారు. రాష్ట్రంలో స్థానిక సంస్థలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన తొలి రోజు ముర్షిదాబాద్‌ ప్రాంతంలో టీఎంసీ, సీపీఎం, కాంగ్రెస్‌ (Congress) పార్టీ అభ్యర్థులు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. స్థానిక కాంగ్రెస్‌ నాయకుణ్ని గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపడంతో ఘర్షణ చోటుచేసుకుంది. ఈ హత్య అధికార టీఎంసీ చేసిందని పశ్చిమ బెంగాల్ పీసీసీ ప్రెసిడెంట్‌ అధిర్‌ రంజన్‌ చౌదరి ఆరోపించారు. మరోవైపు నామినేషన్లు దాఖలు గడువును పొడిగించాలని కోరుతూ భాజపా, కేంద్ర బలగాల పర్యవేక్షణలో ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ కాంగ్రెస్‌లు కోల్‌కతా హైకోర్టును ఆశ్రయించాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని