Punjab: సోనియాతో అమరిందర్‌సింగ్‌ భేటీ

పంజాబ్‌లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా.. ఇప్పటికే రాజకీయ వేడి మొదలైంది. అధికార కాంగ్రెస్‌లో అంతర్గత పోరు కొనసాగుతున్న వేళ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమరిందర్‌సింగ్ మంగళవారం కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీతో భేటీ అయ్యారు....

Published : 07 Jul 2021 01:22 IST

దిల్లీ: పంజాబ్‌లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా.. ఇప్పటికే రాజకీయ వేడి మొదలైంది. అధికార కాంగ్రెస్‌లో అంతర్గత పోరు కొనసాగుతున్న వేళ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమరిందర్‌సింగ్ మంగళవారం కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీతో భేటీ అయ్యారు. సీఎంపై అసంతృప్తితో ఉన్న ఆ రాష్ట్ర మాజీ మంత్రి నవ్‌జ్యోత్‌ సింగ్‌ సిద్ధూ సోమవారం రాహుల్‌ గాంధీ, ప్రియాంకా గాంధీతో భేటీ అయ్యారు. ఆ మరుసటి రోజే అమరిందర్‌సింగ్‌.. సోనియా గాంధీతో సమావేశమవడం ప్రాధాన్యతను సంతరించుకొంది. చండీగఢ్‌ నుంచి ప్రత్యేక చాపర్‌లో బయల్దేరి దిల్లీ వెళ్లిన అమరిందర్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియాను కలిశారు. భేటీ అనంతరం అమరిందర్‌ మీడియాతో మాట్లాడుతూ.. అధిష్ఠానం ఏ నిర్ణయం తీసుకున్నా దానికి సమ్మతమేనని పేర్కొన్నారు.

తన వద్ద ఉన్న కీలక శాఖను సీఎం తొలగించారన్న కినుకతో సిద్ధూ 2019లో కేబినెట్‌ నుంచి వైదొలిగిన విషయం తెలిసిందే. అయితే, మళ్లీ మంత్రివర్గంలో చేరికపై సీఎం అమరీందర్‌ సింగ్‌తో జరిపిన చర్చలు సఫలం కాలేదు. పంజాబ్ కాంగ్రెస్‌ పార్టీలో లుకలుకలు కొనసాగుతుండటంతో రాహుల్‌గాంధీ అక్కడి పార్టీ నేతలతో గత కొద్ది రోజులుగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ నేతలందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి అధికారం నిలుపుకోవాలని కాంగ్రెస్‌ అదిష్ఠానం ప్రయత్నాలు చేస్తోంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని