ఆ చీకటి రోజులు మరవొద్దు

భారత్‌లో ప్రజాస్వామ్యాన్ని అణచివేసేందుకు 1975లో అత్యయిక స్థితి రూపంలో ఒక ప్రయత్నం జరిగిందని.. దాన్ని దేశ ప్రజలు తిప్పికొట్టారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆదివారం ఆయన ‘మన్‌ కీ బాత్‌’ కార్యక్రమంలో అత్యయిక స్థితి పరిణామాలను ప్రస్తావిస్తూ పరోక్షంగా కాంగ్రెస్‌పై విమర్శలు చేశారు.

Published : 27 Jun 2022 05:48 IST

  ‘మన్‌ కీ బాత్‌’లో అత్యయిక స్థితిని ప్రస్తావిస్తూ కాంగ్రెస్‌ లక్ష్యంగా మోదీ విమర్శలు

దిల్లీ: భారత్‌లో ప్రజాస్వామ్యాన్ని అణచివేసేందుకు 1975లో అత్యయిక స్థితి రూపంలో ఒక ప్రయత్నం జరిగిందని.. దాన్ని దేశ ప్రజలు తిప్పికొట్టారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆదివారం ఆయన ‘మన్‌ కీ బాత్‌’ కార్యక్రమంలో అత్యయిక స్థితి పరిణామాలను ప్రస్తావిస్తూ పరోక్షంగా కాంగ్రెస్‌పై విమర్శలు చేశారు. ఆ చీకటి రోజులు మరవొద్దని ప్రజలకు పిలుపునిచ్చారు. ‘‘అత్యయిక స్థితి సమయంలో పౌరుల నుంచి అన్ని హక్కులను లాగేసుకున్నారు. ఇందులో రాజ్యాంగంలోని అధికరణం 21 ప్రసాదించిన జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛ కూడా ఉంది. న్యాయస్థానాలు, ఇతర రాజ్యాంగ సంస్థలు, ప్రచార సాధనాలపై నియంత్రణ విధించారు. అన్నింటిపైనా సెన్సార్‌షిప్‌ ఉంది. అధికారంలో ఉన్నవారిని పొగడలేదని కిశోర్‌కుమార్‌ లాంటి గాయకుడిపైనా నిషేధం విధించారు. ప్రజలు చాలా కష్టాలు పడ్డారు. వేలాది మంది అరెస్టు అయ్యారు. అయినా ప్రజాస్వామ్యంపై భారత ప్రజల నమ్మకం సడలలేదు. చివరకు ప్రజాస్వామ్య పద్ధతిలోనే అత్యయిక స్థితిపై విజయం సాధించారు. ఒక నియంతృత్వపు మనస్తత్వాన్ని ప్రజాస్వామ్య మార్గంలో ఓడించిన ఇలాంటి సంఘటన.. బహుశా ప్రపంచంలోనే లేదేమో’’ అని మోదీ తెలిపారు.


అంతరిక్ష రంగంలో వందకుపైగా అంకుర సంస్థలు

అంతరిక్ష రంగంలో భారత యువత దూసుకుపోతోందని ప్రధాని పేర్కొన్నారు. దాదాపు వందకుపైగా అంకుర సంస్థలు ప్రస్తుతం ఈ రంగంలో పనిచేస్తున్నాయని అన్నారు. చెన్నై, హైదరాబాద్‌కు చెందిన అగ్నికుల్‌, స్కైరూట్‌, త్రూస్పేస్‌ తదితర సంస్థల గురించి ప్రస్తావించారు.


సకాలంలో ‘బూస్టర్‌’ తీసుకోండి

దేశంలోని ప్రతిఒక్కరూ తమ కుటుంబసభ్యులతో సహా కొవిడ్‌ బూస్టర్‌ డోసు టీకాను సకాలంలో తీసుకోవాలని ప్రధాని.. ప్రజలను కోరారు. చేతులను పరిశుభ్రంగా ఉంచుకుంటూ మాస్కులు ధరించాలని సూచించారు. ప్రత్యేకంగా వృద్ధులు బూస్టర్‌ డోసు పొంది తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని