Updated : 02 Jul 2022 09:27 IST

Russia: ముప్పేట దాడులు తాళలేకే?.. స్నేక్‌ ఐలాండ్‌ను విడిచిన రష్యా

సద్భావన చర్య అంటూ సమర్థన

ఉక్రెయిన్‌పై సైనిక చర్య చేపట్టిన ఆరంభంలో నల్ల సముద్రంలోని ‘స్నేక్‌ ఐలాండ్‌’ను ఆక్రమించిన రష్యా... ఇప్పుడు దాన్ని వదులుకోవడం తీవ్ర సంచలనంగా మారింది. ఆ ద్వీపం నుంచి కేవలం 35 కిలోమీటర్ల దూరంలోనే కీలకమైన ఉక్రెయిన్‌ తీర ప్రాంతాలు, రేవులు ఉన్నాయి. దీంతో అక్కడి నుంచి వాటిపై దాడులు చేయడం చాలా సులభమని మాస్కో భావించింది. అవసరమైతే, అక్కడి నుంచి నాటో సభ్య దేశమైన రొమేనియాపైనా దాడులు చేసేందుకు అనుకూలంగా ఉంటుందని యోచించింది. ఈ క్రమంలోనే పుతిన్‌ సేనలు నల్ల సముద్ర తీరంలో ఆధిపత్యం చాటుకున్నాయి. అజోవ్‌ సముద్ర తీరాన్ని పూర్తిగా తమ స్వాధీనంలోకి తెచ్చుకున్నాయి. అక్కడున్న ఉక్రెయిన్‌, విదేశీ రవాణా నౌకలు కదలకుండా అడ్డుపడ్డాయి. ఈ పరిణామాలతో ఉక్రెయిన్‌ బలగాలు నీరసించిపోలేదు. స్నేక్‌ ద్వీపమే లక్ష్యంగా నాలుగు నెలలుగా దాడులుచేస్తూ వచ్చాయి. మరీ ముఖ్యంగా అక్కడికి రష్యా చేరవేస్తున్న భారీ ఆయుధాలపైనా, యుద్ధ సామగ్రితో తరలివెళ్తున్న నౌకలపైనా బాంబులతో తీవ్రంగా విరుచుకుపడ్డాయి. రష్యా నౌక ‘మస్కోవా’ గత ఏప్రిల్‌లో ఇలాగే సముద్రం పాలైంది. ఈ పరిణామంతో పుతిన్‌ సేనలు ఆత్మరక్షణలో పడ్డాయి.

రవాణా నౌకలకు ఇబ్బంది తొలగించేందుకే..
పుతిన్‌ సేనలు అనూహ్యంగా గురువారం స్నేక్‌ ద్వీపాన్ని విడిచిపెట్టడం యుద్ధ నిపుణులను సైతం ఆశ్చర్యపరిచింది. నల్ల సముద్రంలో నిలిచిపోయిన ఉక్రెయిన్‌, విదేశీ రవాణా నౌకలకు ఇబ్బంది కలుగకూడదనే ఉద్దేశంతోనే, సద్భావన చర్యగా తాము ఐలాండ్‌ను విడిచిపెట్టినట్టు రష్యా పేర్కొంది. ఈ చర్యతో ఆఫ్రికా, మధ్యప్రాచ్యం సహా పలు దేశాలకు ఆహార ధాన్యాలు, వ్యవసాయ ఉత్పత్తుల సరఫరాకు ఇబ్బంది ఉండదని పేర్కొంది. ఉక్రెయిన్‌ మాత్రం ఈ వాదనను కొట్టిపారేసింది. రష్యా నిజంగానే సదుద్దేశంతో స్నేక్‌ ద్వీపాన్ని విడిచిపెట్టి ఉంటే... తమ ఆహార నిల్వలపై ఎందుకు దాడులు కొనసాగిస్తోందని ప్రశ్నించింది. ఉక్రెయిన్‌పై సైనిక చర్యను చాలామంది రష్యన్లు వ్యతిరేకిస్తున్నారు. నల్ల సముద్రంలో నౌకలను అడ్డుకోవడం ద్వారా పలు దేశాల్లో ఆహార కొరతకు రష్యా వైఖరే కారణమన్న విమర్శలూ లేకపోలేదు. స్నేక్‌ ఐలాండ్‌ను విడిచిపెట్టడం ద్వారా ఆహార ధాన్యాల సరఫరాకు తాము వ్యతిరేకం కాదన్న సందేశం ఇవ్వొచ్చని మాస్కో వర్గాలు భావించినట్టు విశ్లేషకులు చెబుతున్నారు. ఇందులో భాగంగానే తమ ఆధీనంలో ఉన్న ఉక్రెయిన్‌లోని బెర్డియాన్స్‌ రేవు నుంచి 7 వేల టన్నుల ధాన్యంతో కూడిన నౌకను రష్యా అధికారులు సాగనంపారు.

వదిలించుకోవాలనే..
స్నేక్‌ ఐలాండ్‌ అన్ని వైపుల నుంచి దాడులకు అనుకూలంగా ఉంది. ముఖ్యంగా జల, వాయు మార్గాల్లో సవాళ్లు తీవ్రంగా ఎదురవుతున్నాయి. దీంతో దీన్ని వదిలించుకోవడమే మంచిదని రష్యా నిర్ణయానికి వచ్చినట్టు భావిస్తున్నారు. ఈ ద్వీపంలో ఎవరు బలగాలను మోహరించినా అది తెలివితక్కువ పనే అవుతుందని, దాడులకు ఇది అత్యంత అనువుగా ఉండటమే ఇందుకు కారణమని ఉక్రెయిన్‌కు చెందిన సైనిక విశ్లేషకుడు ఒలేహ్‌ జ్దానోవ్‌ పేర్కొన్నారు.

ఈ ద్వీపం నుంచి వైదొలగినా, నల్ల సముద్రంపై రష్యా తన ఆధిపత్యాన్ని వదులుకునే పరిస్థితులు లేవని; పుతిన్‌ షరతులను కాదని ఉక్రెయిన్‌ నౌకా రవాణా చేపట్టడం అంత సులభమేమీ కాదని లండన్‌ విశ్వవిద్యాలయంలో ఉక్రెయిన్‌ వ్యవహారాలపై అధ్యయనం సాగిస్తున్న ప్రొఫెసర్‌ ఆండ్రూ విల్సన్‌ విశ్లేషించారు. వచ్చే పది రోజుల్లో కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశముందని, నౌకల రవాణా విషయంలో రష్యా వైఖరి మరింత స్పష్టమవుతుందని ఆయన పేర్కొన్నారు.

- ఈనాడు ప్రత్యేక విభాగం

Read latest Related stories News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని