Chennai Vs Punjab: పంజాబ్‌ బోల్తా.. చెన్నై సూపర్‌ విక్టరీ

ఐపీఎల్‌-17లో చెన్నై ఆరో విజయాన్ని నమోదు చేసింది. పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో 28 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

Updated : 05 May 2024 19:46 IST

ధర్మశాల: ఐపీఎల్‌-17లో చెన్నై ఆరో విజయాన్ని నమోదు చేసింది. పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో 28 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 168 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన పంజాబ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయి 139కే పరిమితమైంది. టాప్‌ ఆర్డర్‌ పూర్తిగా విఫలమైంది. ఓపెనర్‌ ప్రభ్‌ సిమ్రన్‌ (30) శశాంక్‌ (27) ఫర్వాలేదనిపించారు. బెయిర్‌స్టో (7), రొసోవ్‌ (0), సామ్ కరన్‌ (7), జితేశ్‌ శర్మ (0), అశుతోష్‌ శర్మ (3) పూర్తిగా విఫలమయ్యారు. చివర్లో రాహుల్‌ చాహర్‌ (16) హర్‌ప్రీత్‌ బ్రార్‌ (17*), రబాడ (11*) క్రీజులో నిలదొక్కుకోవడంతో పంజాబ్‌ ఆమాత్రం పోటీ అయినా ఇవ్వగలిగింది. చెన్నై బౌలర్లలో జడేజా 3 వికెట్లు పడగొట్టగా.. తుషార్‌, సిమర్‌జిత్ సింగ్‌ చెరో 2, మిచెల్‌ శాట్నర్‌, శార్దూల్ ఠాకూర్‌ తలో వికెట్‌ తీశారు. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో చెన్నై (12 పాయింట్లు) మూడో స్థానానికి ఎగబాకింది. 

తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. ఇన్నింగ్స్‌లో పెద్దగా మెరుపులేమీ కనిపించలేదు. బ్యాటింగ్‌ ప్రారంభించిన చెన్నైకి ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. రెండో ఓవర్లోనే ఓపెనర్‌ రహానే (9) ఔటయ్యాడు. అర్ష్‌దీప్‌ సింగ్‌ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి రబాడకు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. తొలి డౌన్‌లో వచ్చిన మిచెల్‌ (30; 19 బంతుల్లో 2×4, 1×6)తో కలిసి కెప్టెన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ (32; 21 బంతుల్లో 4×4, 1×6) ఇన్నింగ్స్‌ నిర్మించే ప్రయత్నం చేశాడు. క్రీజులో నిలదొక్కుకుంటున్న ఈ జోడీని రాహుల్‌ చాహర్‌ విడగొట్టాడు. 7.1వ బంతికి జితేశ్‌ శర్మకు క్యాచ్‌ ఇచ్చి గైక్వాడ్‌ పెవిలియన్‌కు చేరాడు.

రెండో డౌన్‌లో వచ్చిన శివం దూబె (0) పరుగులేమీ చేయకుండానే ఔటయ్యాడు. అక్కడికి స్వల్ప వ్యవధిలోనే హర్షల్‌ పటేల్‌ బౌలింగ్‌లో మిచెల్‌ ఎల్బీగా వెనుదిరిగాడు. అప్పటికి జట్టు స్కోరు 75 పరుగులు మాత్రమే. కీలక వికెట్లు కోల్పోవడంతో చెన్నై కష్టాల్లో పడినట్లయింది. అయితే, మిడిలార్డర్‌లో వచ్చిన జడేజా (43; 26 బంతుల్లో 3×4, 2×6) కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. ఓ వైపు వికెట్లు పడిపోతున్నా ఒంటరి పోరాటం చేశాడు. మొయిన్‌ అలీ (17), శాంట్నర్‌ (11), శార్దూల్ ఠాకూర్‌ (17) ఫర్వాలేదనిపించారు. చివర్లో ధోనీ (0) కూడా నిరాశపరిచాడు. పంజాబ్‌ బౌలర్లలో హర్షల్‌ పటేల్‌, రాహుల్‌ చాహర్‌ చెరో 3 వికెట్లు పడగొట్టగా, అర్ష్‌దీప్‌ సింగ్‌ 2, సామ్‌ కరన్‌ ఒక వికెట్‌ తీశారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని